
సైకిల్ గురూజీకి స్వాగతం పలుకుతున్న ఆదిత్య
అక్షరాస్యతను పెంపొందించేందుకు 24 ఏళ్లుగా సైకిల్‌పై దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న ఆదిత్య కుమార్ ఠాకూర్ మంగళవారం నగరానికి చేరుకున్నారు.
సనత్‌నగర్: అక్షరాస్యతను పెంపొందించేందుకు 24 ఏళ్లుగా సైకిల్‌పై దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న ఆదిత్య కుమార్ ఠాకూర్ మంగళవారం నగరానికి చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 46 ఏళ్ల ఆదిత్య కుమార్ మురికివాడల్లోని పేద బాలలకు ఉచిత విద్యాబోధన చేస్తూ పర్యటన సాగిస్తున్నారు. ఇందులో భాగంగా నగరానికి వచ్చిన ఆయనకు సినీ దర్శకుడు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత పీసీ ఆదిత్య స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లా సలీంపూర్‌లో రైతు కుటుంబానికి చెందిన ఠాకూర్‌కు విద్యా వ్యాప్తి కోసం 1992లో లక్నోలో సైకిల్ యాత్ర ప్రారంభించారు.
పేద పిల్లలకు విద్యను బోధిస్తూ సైకిల్ గురూజీగా పేరుపొందారు. ఇంతవరకు ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, చత్తీస్‌ఘడ్, జమ్మూ కశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మహరాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించి తెలంగాణలో అడుగుపెట్టారు. ఎక్కడ అలసిపోతే అక్కడ ఫుట్‌పాత్ పైనే నిద్ర, ఆకలేస్తే రొట్టె, టీ తీసుకుంటానని ఠాకూర్ వెల్లడించారు. సైకిల్ గురూజీ విద్యా సేవలను గుర్తించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుతో పాటు 20 ప్రపంచ రికార్డులు ఠాకూర్‌ను వరించాయి.