World Bicycle Day: మొదటి వాహనముకు వందనం! | World Bicycle Day: Benefits of using the bicycle | Sakshi
Sakshi News home page

World Bicycle Day: మొదటి వాహనముకు వందనం!

Jun 3 2025 5:52 AM | Updated on Jun 3 2025 5:52 AM

World Bicycle Day: Benefits of using the bicycle

నేడు వరల్డ్‌ సైకిల్‌ డే

రాజైనా రైతైనా.. కొడుకైనా కూతురైనా కలెక్టరైనా బంట్రోతైనా.. ఊరైనా పట్నమైనా మనిషికి ప్రాప్తమయ్యే మొదటి వాహనం సైకిల్‌. దోగాడే వయసులో ట్రై సైకిల్‌ తొక్కి
బైస్కిల్‌కు ఎదగడమే చేయాల్సింది. ఇక అక్కడి నుంచి ఎక్కడికి చేరినా జీవితాన్ని బేలెన్స్‌ చేసుకుంటూ ముందుకు సాగమని చెబుతుంది సైకిల్‌. ప్రతి ఒక్కరి బాల్యంలో సైకిల్‌ విడదీయరానిది. ఆ మాటకొస్తే సైకిల్‌లోని ప్రతి పార్ట్‌ జీవన సందేశాన్ని వినిపిస్తుంది. అసలు సైకిల్‌ని ఇష్టపడని వారెవరు?

సైకిల్‌! 
ట్రింగ్‌ ట్రింగ్‌మని బెల్లు కొడుతూ జ్ఞాపకాలు కమ్ముకుంటున్నాయా? 
చిన్నప్పుడు ఎవరిదో ఇంటి ముందు సైకిల్‌ స్టాండ్‌ వేసి ఉంటే కింద కూచుని పెడల్‌ తిప్పుతూ వెనుక చక్రం గిర్రున తిరుగుతుంటే చూసిన జ్ఞాపకం. ముందు చక్రంలో వెనుక చక్రంలో స్పోక్స్‌ మధ్యన ఉండే ఇంధ్రధనువు రంగుల కుచ్చు గుబ్బలను ఆసక్తిగా చూసిన జ్ఞాపకం. వెనుక సీటుకు డైనమో ఉంటుంది. అది ఆన్‌ చేస్తే బ్యాక్‌ టైర్‌కు అంటుకుంటుంది. టైరు తిరిగే కొద్దీ డైనమో నుంచి కరెంటు జనరేట్‌ అయ్యి ముందున్న బల్బు వెలుగుతుంది. ఆ రోజుల్లో రాత్రుళ్లలో లైటు వెలిగే సైకిల్‌ తొక్కేవాడు గొప్ప.

అవును. సైకిల్‌ తొక్కడం గొప్పే. ఎంతమంది దగ్గర ఉండేదని. ఒకవేళ ఉన్నా అందులో అంతరం. ర్యాలీ, హంబర్‌ సైకిళ్లు ఉన్నవారు  శ్రీమంతులు, హీరో సైకిల్‌ ఉన్నవారు మధ్య తరగతి వారు, అట్లాస్‌ అంటే ఇక పేదవాళ్లు కొని తెగ తొక్కడమే. ఆ తర్వాత బి.ఎస్‌.ఏ సైకిళ్లు వచ్చాయి. వాళ్లు తెచ్చిన లేడీస్‌ సైకిళ్లు ఆడపిల్లలను వాటిపై కూచోబెట్టి నేరుగా స్కూళ్లకు కాలేజీలకు పంపాయి. చిన్న పట్టణాల్లో సాయంత్రాలు సైకిల్‌ తొక్కుతూ వెళ్లే ఆడపిల్లలకు ఉండే క్రేజ్‌ సామాన్యం కాదు. 

మగాడికి ‘మగాడు’ అనిపించుకునే సవాళ్లు సమాజం పెడుతూ ఉంటుంది. ఆ సవాళ్లలో ఒకటి సైకిల్‌ తొక్కడం నేర్చుకోవడం. ఏడు, ఎనిమిది తరగతులకు రావడంతోటే ఊళ్లలో పల్లెల్లో పిల్లలు సైకిల్‌ నేర్చుకుని ఉండాల్సింది. ‘ఏంటి.. మీవాడికి ఇంకా సైకిల్‌ తొక్కడం రాదా’ అనంటే అవమాన పడిపోయే తండ్రులు ఉండేవారు. కొడుకు తిట్లతో రెచ్చగొట్టి ‘సైకిల్‌ తొక్కుతావా లేదా’ లేదా అని ఎక్కించి వెనుక పరిగెత్తుతూ నేర్పించేవారు. ఆ రోజుల్లో పిల్లలు తొక్కే సైకిళ్లు ఎక్కడివని? అన్నీ పెద్దలు తొక్కేవే. అందుకే పిల్లలు మొదట ఆఫ్‌ పెడల్‌ తొక్కి, ఆ తర్వాత ఫ్రంట్‌ బార్‌ మీద కూచుని తొక్కి, కాళ్లందే ఎత్తు పెరిగాక సీటు మీద కూచుని తొక్కేవారు.

సైకిల్‌ తొక్కడం అంత వీజీ కాదు. ఆ రోజుల్లో ప్రతి సైకిలూ తన యజమానిని సొంత ఊరి చెరువు నీళ్లు గటగటా తాగించేది. ఒక సైకిలుకు బ్రేకులు పడవు. ఒక సైకిల్‌కు పెడళ్లు ఊడిపోతాయి. ఒక సైకిల్‌కు చైను లూజు. మరో సైకిలుకు స్టాండ్‌ పడదు. స్టాండ్‌ వేసి జరగ్గానే ధబేలున పడుతుంది. ఒక సైకిలుకైతే సీటు అట్టగట్టుకుని పోయి కూచుంటే ముళ్ల మీద కూచున్నట్టు ఉంటుంది. ఒక సైకిలు సైడుకు లాగుతూ ఉంటుంది. ఒక సైకిలుకు హ్యాండిలు వంకర. ఇక పంక్చర్లు వేసి వేసి లోపల టైరు బ్యారుమన్నా ఓనరు కనికరించక దాన్ని తొక్కుతూనే ఉంటాడు. డబ్బులే లేని ఆ కాలంలో సైకిలే సిరి.

సైకిల్‌ వల్ల ఫ్రెండ్‌షిప్స్‌ ఏర్పడతాయి. ఫ్రంట్‌ రాడ్‌ మీద కూచుని సినిమాకొచ్చేవాడొకడు. బ్యాక్‌ క్యారేజీ మీద కూచుని సంతకు పోదాం అనేవాడొకడు. ఎదురుగాలిలో తొక్కుతుంటే వెనుక కూచున్నవాడు కూడా తోడు తొక్కుతాడు. అంటే రెండు పెడళ్ల మీద నాలుగు కాళ్లు. సైకిల్‌ డౌన్‌లో తొక్కేటప్పుడు గడ్డిపోచకంటే తేలిగ్గా ఉంటుంది. ఎదురుగాలిలో తొక్కుతుంటే రాకాసి దెయ్యమంత బరువు పెరుగుతుంది.  అన్నింటి కంటే హింస ఏమిటంటే చైనుకు ఉన్న మడ్‌గార్డు గనుక పెడల్‌కు రాసుకుంటూ ఉంటే మనం వీధి వెంట వెళుతున్నామని ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు.. ఆ గర్‌గర్‌మనే సౌండ్‌కి.

సైకిల్‌కు సింగారాలు చేసేవారు ఉండేవారు. హ్యాండిల్‌కు చెరొక మిర్రర్‌ని బిగించే సోగ్గాళ్లు ఉండేవారు.  హ్యాండిల్‌ మీద ఫ్రంట్‌ క్యారేజ్‌ బిగిస్తే వాటి మీద బుక్స్‌ పెట్టుకోవచ్చు. సీటుకు స్పాంజ్‌ కవర్‌ చాలా షోకు. స్టీలు బిందెల మీద పేర్లు రాసినట్టు సైకిల్‌ హ్యాండిల్‌ మీద ఓనర్‌ పేరు రాయించడం సేఫ్‌. సైకిల్‌ దొంగతనం అయితే పోలీసులు ఆ పేరును బట్టి వాపసు చేసేవారు.

ఆ రోజుల్లో అద్దె సైకిళ్ల జమానా నడిచింది. ఐదారు సైకిళ్లు అద్దెకు ఇస్తూ బతికే వారుండేవారు. సైకిళ్లన్నీ అద్దెకెళ్లిపోతే కావాల్సిన వాళ్లు వెయిట్‌ చేస్తూ కూచునేవారు. కొందరైతే రే΄÷్పద్దున నాకు సైకిల్‌ కావాలి అని ముందే అద్దెకు మాట్లాడుకునేవారు. సైకిల్‌ లేకుండా పని ఎవరికి జరిగేదని? సామాన్లు తెచ్చుకోవాలన్నా, పక్కూరికి పనికి వెళ్లాలన్నా, నీళ్లు తెచ్చుకోవాలన్నా, ఎవరికైనా బాగా లేకపోతే డాక్టర్‌ని పిలుచుకు రావాలన్నా, చావు కబురు చె΄్పాలన్నా సైకిలే గతి. 

సైకిల్‌ వేదాంతి. బతుకు బండిని బేలెన్స్‌ తప్పకుండా చూసుకోమని, అత్యాశలకూ అతి కోరికలకూ బ్రేకులు వేస్తూ నువ్వెంత తొక్కగలవో అంతలోనే బతకమని, మంచి అనుబంధాలనే ఆయిల్‌ను తరచూ రిమ్ములకు రాస్తూ ఉండమని, మంచి చెడ్డల్లో పాల్గొంటూ సైకిల్‌ బెల్లులా ఉనికి చూపమని, వెనుక క్యారేజీ మీద కూచోబెట్టుకునే పాటి సహాయమైనా ఇతరులకు చేస్తూ ఉండాలని, జీవితపు పరుగుకు అప్పుడప్పుడు స్టాండ్‌ వేసి నిలబెట్టమని లేదంటే కనీసం సైడ్‌ స్టాండ్‌ వేయమని చెబుతుంటుంది. లేదంటే హటాత్తుగా సైకిల్‌ మొరాయించి ఓవరాయిలింగ్‌కు వస్తుందని హెచ్చరిస్తుంది.

సైకిల్‌లా సింపుల్‌గా బతకడం ఇవాళ చాలా కష్టమైపోతుంది. కాసింత గాలి కొడితే ఇక సైకిల్‌ ఏమీ అడగదు. కాని నేడు మనం ఉపయోగిస్తున్న, వాడుతున్న, అందుకోవాలనుకుంటున్న ప్రతిదీ మన నుంచి చాలా అడుగుతున్నాయి.  ఇంటి వాకిటలో నిలబెట్టిన సైకిల్‌ ఎంత నిమ్మళంగా ఉంటుంది!

‘వరల్డ్‌ సైకిల్‌ డే’ రోజున జీవితపు వేగాన్ని తగ్గించుకుని ఆస్వాదనకు పెడల్‌ వేద్దాం.

– కె.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement