రత్నగిరిపై కల్యాణ కాంతులు | annavaram satyanarayanaswami kalyanothsavam | Sakshi
Sakshi News home page

రత్నగిరిపై కల్యాణ కాంతులు

May 4 2017 10:52 PM | Updated on Sep 5 2017 10:24 AM

రత్నగిరిపై కల్యాణ కాంతులు

రత్నగిరిపై కల్యాణ కాంతులు

అన్నవరం : మంచి వ్యక్తితో తన జీవితం ముడిపడాలని.. మంచి చదువు, ఉద్యోగం దొరకాలని పార్థించే యువతీయువకులు.. తమ కాపురం నిండు నూరేళ్లూ అష్టైశ్వర్యాలతో పచ్చగా సాగాలని వేడుకొనే నవదంపతులు.. తమ పిల్లల భవిష్యత్తు చక్కగా సాగాలని కోరుకొనే లక్షలాది మంది భక్తులు.. ఇలా భక్తులు కోరిన కోర్కెలు తీర్చే భక్తవరదుడైన సత్యదేవుడు, దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవితో కలిసి.. లోకకల్యాణార్థం

- నేటి నుంచే సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలు
- సాయంత్రం 4 గంటలకు వధూవరులు కానున్న అమ్మవారు, స్వామి
- రేపు రాత్రి 9.30 గంటల నుంచి కల్యాణ మహోత్సవం
అన్నవరం : మంచి వ్యక్తితో తన జీవితం ముడిపడాలని.. మంచి చదువు, ఉద్యోగం దొరకాలని పార్థించే యువతీయువకులు.. తమ కాపురం నిండు నూరేళ్లూ అష్టైశ్వర్యాలతో పచ్చగా సాగాలని వేడుకొనే నవదంపతులు.. తమ పిల్లల భవిష్యత్తు చక్కగా సాగాలని కోరుకొనే లక్షలాది మంది భక్తులు.. ఇలా భక్తులు కోరిన కోర్కెలు తీర్చే భక్తవరదుడైన సత్యదేవుడు, దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవితో కలిసి.. లోకకల్యాణార్థం కల్యాణ తిలకం దిద్దుకుంటున్నవేళ.. పావన దివ్యక్షేత్రం రత్నగిరి సానువులు పులకరిస్తున్నాయి. వరాలిచ్చే సత్యదేవుడే వరుడవుతున్న వేళ.. సిరులిచ్చే శ్రీమహాలక్ష్మే వధువవుతున్న శుభవేళ.. రత్నగిరి కల్యాణశోభతో తుళ్లిపడుతోంది. ఈ కమనీయ ఘట్టానికి దేవస్థానంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు.
అనివేటి మండపంలో అంగరంగ వైభవంగా..
సత్యదేవుని ప్రధానాలయం దిగువన అనివేటి మండపంలో అమ్మవారిని, సత్యదేవుడిని వధూవరులను చేసే కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం గంటన్నరపాటు జరుగుతుందని పండితులు తెలిపారు. అనంతరం రాత్రి 7 గంటలకు రత్నగిరి కళావేదిక మీద ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది. పండితులు రెండు పక్షాలుగా ఏర్పడి.. స్వామి, అమ్మవార్ల ఘనకీర్తిని, వంశచరితను వివరించడమే ఈ కార్యక్రమం ప్రత్యేకత.
సీతారాములే పెళ్లిపెద్దలుగా..
సత్యదేవుని కల్యాణానికి రత్నగిరి క్షేత్రపాలకుడైన శ్రీరామచంద్రుడు, సీతమ్మతల్లి పెళ్లి పెద్దలుగా వ్యవహరించనున్నారు. అమ్మవారిని, సత్యదేవుడిని వధూవరులను చేసే కార్యక్రమం నుంచే వారి పెద్దరికం మొదలవుతుంది. వైశాఖ శుద్ధ ఏకాదశి, శనివారం రాత్రి 9.30 గంటల నుంచి జరిగే కల్యాణం, ఆపై ఐదు రోజులపాటు వరుసగా జరిగే వైదిక కార్యక్రమాలు.. పండిత సత్కారం, వనవిహారం, చక్రస్నానం, శ్రీపుష్పయాగం తదితర కార్యక్రమాలకు సీతారాములే పెళ్లి పెద్దలుగా వ్యవహరించనున్నారు.
వారం రోజులపాటు నిత్యకల్యాణాల నిలుపుదల
ప్రతి నిత్యం స్వామి, అమ్మవార్లకు కల్యాణ మండపంలో నిత్య కల్యాణం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం నుంచి ఏడు రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడు రోజులూ స్వామివారి నిత్యకల్యాణాలు జరగవు. తిరిగి 12వ తేదీ నుంచి నిత్య కల్యాణాలు ప్రారంభమవుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement