అదే అమ్మవారి దర్శనం | There are Three Deities on These Three Peaks | Sakshi
Sakshi News home page

అదే అమ్మవారి దర్శనం

Apr 14 2019 4:00 AM | Updated on Apr 14 2019 8:20 AM

There are Three Deities on These Three Peaks - Sakshi

‘‘హిమాద్రిసుతే పాహి మాం వరదే పరదేవతే/సుమేరు మధ్య వాసినీ అంబ శ్రీకామాక్షి.....’’ అన్న కీర్తనలో శ్యామశాస్త్రి గారు ‘సుమేరు మధ్య వాసినీ’ అనడంలో అమ్మవారు నివాసం ఉండే స్థానాన్ని ప్రస్తావిస్తూ  గొప్ప రహస్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. అమ్మ ఎప్పుడూ ఎక్కడుంటుంది ? ఆమె పరమశివుని ఎడమ తొడమీద కూర్చుని ఉంటుంది. అమ్మా! శివకామేశ్వరాంకస్థవమయిన నువ్వుండే గృహమెక్కడో తెలుసా? అంటున్నారు ఆయన. అంటే– మేరు పర్వతానికున్న నాలుగు శిఖరాలలో మధ్యన ఒక శిఖరం ఉంటుంది. అదే శ్రీచక్రంలో బిందు స్థానం. ఆ త్రికోణం కింద చూస్తే తూర్పుకు ఒక శిఖరం, నైరుతికి ఒకటి, వాయవ్యానికి ఒకటి ఉన్నాయి. ఈ మూడు శిఖరాలమీద ముగ్గురు దేవతలున్నారు. వాళ్ళే సృష్టి, స్థితి, లయలు చేసే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఈ ముగ్గురికీ కావలసిన శక్తి స్వరూపాలయిన సరస్వతి, లక్ష్మి, పార్వతి అనే మూడు శక్తులను ముగ్గురు మూర్తులకు ఇచ్చిన మూల పుటమ్మవై ఈవేళ ఆ మధ్యలో ఉండే శిఖరంమీద కూర్చుని ఉన్నావమ్మా..’– ఇది బాహ్యంలో అర్థం.

అంతరంలో!!! అందుకే ఆయన కీర్తనల్ని కదళీఫలంతో పోల్చారు. మేరు అంటే–మనకు వెన్నెముక ఉంటుంది. అలాగే భూమండలానికి, పాలపుంతకు, బ్రహ్మాండానికీ మేరువుంటుంది. ఆ మేరుకు మధ్యలో అమ్మవారు ఉండడం అంటే....ఆ మేరు అన్న మాటను విడదీయండి. అం+ఆ+ఇ+ఉ+రు. ఇందులో మొదటి రెండు, చివరి రెండు అక్షరాలు పర–పశ్యంత–మధ్యమ–వైఖరి అనే నాలుగు వాక్కులు. మధ్యలో ఉన్న ‘ఇ’కారం ‘ఈమ్‌’ అమ్మవారి బీజాక్షరం. ఆ ‘ఇ’కారం అమ్మవారి నాద స్వరూపం. సృష్టి ఆరంభం శూన్యం. ఆకారమొక్కటే ఉంటుంది. భూతములన్నీ ఆకాశంలోకి వెళ్ళిపోతాయి. అందులోంచి మొట్టమొదట వాయువు వస్తుంది. ఆకాశం శబ్దగుణకం కాబట్టి శబ్దం వస్తుంది. అదే ప్రణవం..‘ఓంకారం’ అంటాం.అలాగే మనిషిలోంచి కూడా శబ్దం బయటికొచ్చేముందు– లోపల ఒక నాదం ఉంటుంది. ఆ నాదమే అమ్మవారు.

నాదాన్ని ఉపాసన చేయడమే అమ్మవారి దర్శనం చేయడం. అది పునరావృత్తిరహిత శాశ్వత శివసాయుజ్యం కోసం. అంతే తప్ప, దాన్ని అమ్మకానికి పెట్టి డబ్బు సంపాదించుకోవడానికి కాదు. ఆ నాదోపాసనకు సంబంధించిన ‘ఇ’ అక్షరానికి అటు ఉన్న  పర–పశ్యంతి, ఇటు ఉన్న మధ్యమ, వైఖరి..అంటే ఒక వాక్కు నోట్లోంచి బయటకు రావాలనుకోండి...అమ్మవారిని ‘హిమాద్రిసుతే’ అనాలనిపించడానికి ముందు సంకల్పం కలుగుతుంది. సహస్రార చక్రంలో..అలా కలిగితే దాన్ని ‘పర’ అంటారు. ‘హిమాద్రిసుతే’ అనడానికి అనాహత చక్రం దగ్గర వాయువు కదులుతుంది. అలా కదిలితే దానిని ‘పశ్యంతి’ అంటారు.

కంఠం దగ్గరకు రాగానే అక్కడ ‘విశుద్ధ చక్రం’ దగ్గర ‘ర్‌’ అనే రేఫం తో కలిసి అగ్ని చేత సంస్కరింపబడి పరిశుద్ధమై అది నాలుకకు, పెదవులకు తగులుతుంది. లోపల ఉన్న వాయువు సొట్టలు పడి–అక్షరాలై, పదాలై, చరణాలై లోపల సహస్రారంలో కదలిన మాట ‘వైఖరి’ రూపుగా లోపల ఉన్న నాదం ఉపాసన చేస్తున్న స్వరూపంగా బయటికి రావాలి. అలా రావాలంటే అమ్మవారి అనుగ్రహం కలగాలి. సహస్రారంలో కలిగిన సంకల్పం..ౖ వెఖరీ వాక్కయి బయటికొచ్చి ఆకాశంలో ప్రయాణించి నీ చెవిలోకి వెడితే.. అక్కడ సహస్రారంలో కలిగిన భావన ఇక్కడ సహస్రారానికి అందుతుంది. అలా అందించగలిగిన నాదస్వరూపిణి అయిన అమ్మవారు ‘ఇ’కారం. ఆవిడే ‘సుమేరు మధ్య వాసిని’.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement