
పోలీసుస్టేషన్ వద్ద వివాహితకు మద్దతుగా మాజీ చైర్‌పర్సన్, మహిళా సంఘాలు
శ్రీకాకుళం, ఇచ్ఛాపురం: తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ వివాహిత మరోసారి పోలీసు స్టేషన్ మెట్లెక్కింది. ఆదివారం ఆందోళనకు దిగిన ఈమెకు మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ లాబాల స్వర్ణమణి, స్థానిక మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి. పట్టణంలోని కొండివీధికి చెందిన నందిక శంకర్ బెల్లుపడ కాలనీకి చెందిన వివాహితను తన ఇంటిలో ఆర్నెల్ల క్రితం లైంగిక దాడికి యత్నించాడు. ఈ నేపథ్యంలో ఆమెకు భర్త విడాకులు ఇస్తానని, కన్నవారు ఇంట్లోకి రానివ్వకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడింది.
దీంతో తన ఇద్దరి పిల్లలతో జీవించేందుకు నిందితుడి నుంచి పరిహారం ఇప్పించాలని ఈ నెల 10న పోలీస్ స్టేషన్ ఎదుట భైఠాయించింది. ఈ విషయమై స్థానిక పెద్దలతో చర్చించి మూడ్రోజుల్లో న్యాయం చేస్తామని పోలీసులు హామీచ్చారు. నేటికీ ఎటువంటి న్యాయం చేయకపోవడంతో మరలా ఆందోళనకు దిగింది. ఈ విషయమై స్థానిక టీడీపీ నాయకుడు గుజ్జు జగ్గు తనను బెదిరిస్తున్నాడని, అతని వల్లే న్యాయం చేయడంలేదని వివాహిత కన్నీటిపర్యంతమైంది. అతన్ని కూడా విచారించాలని డిమాండ్ చేసింది. ఇక్కడ గంటపాటు ఎదురు చూసిన వివాహిత పోలీసులు అందుబాటులో లేకపోవడంతో వారంతా వెనుదిరిగారు.