డీజిల్‌ అక్రమ నిల్వలపై దాడులు

Vigilance Attack on Diesel Stores - Sakshi

నాలుగు కిళ్లీ షాపుల నుంచి 2 వేల లీటర్లు స్వాధీనం

ఒక్కో దుకాణంలో భారీ డ్రమ్ములు

నివ్వెరపోయిన విజిలెన్స్‌ అధికారులు

గుట్టుచప్పుడు కాకుండా భారీస్థాయిలో వ్యాపారం

పశ్చిమగోదావరి, గోపాలపురం: గోపాలపురం మండలం కోమటికుంట వద్ద ఉన్న మాతంగమ్మ తల్లి ఆలయం ఎదురుగా ఉన్న నాలుగు కిళ్లీ షాపుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 2 వేల లీటర్లు డీజిల్‌ ఆయిల్‌ను సోమవారం విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. జిల్లా విజిలెన్స్‌ ఎస్పీ బి.అచ్చుతరావు ఆదేశాల మేరకు దాడులు నిర్వహించినట్లు ఎస్సై కె. ఏసుబాబు, ఏఓ ఎం శ్రీనివాసరావు చెప్పారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గోపాలపురం నుంచి కొయ్యలగూడెం వెళ్లే ప్రధాన జాతీయ రహదారి కోమటికుంట మాతంగమ్మతల్లి ఆలయం ఎదురుగా ఉన్న షేక్‌ ఇస్మాయిల్‌ 800 లీటర్లు, జగతా చిట్టిబాబు నుంచి 130 లీటర్లు, మందపాటి సత్యనారాయణ నుంచి 550 లీటర్లు, దండే సురేష్‌ వద్ద నుంచి 600 లీటర్లు డీజిల్‌ అక్రమ నిల్వలను పట్టుకున్నట్టు తెలిపారు. లారీల నుంచి కొనుగోలు చేసిన డీజిల్‌ను స్థానికంగా ఉన్న ట్రాక్టర్లకు, కార్లకు, ఆటోలకు డీజిల్‌ అమ్మకాలు సాగిస్తున్నట్టు చెప్పారు.

పెట్రోల్‌ బంకులను తలపిస్తున్న డీజిల్‌ వ్యాపారం
స్థానిక కోమటికుంట వద్ద విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్న డీజిల్‌ అమ్మకాలు, వారి వ్యాపారం చూసి విజిలెన్స్‌ అ«ధికారలు ఖంగుతిన్నారు. ఒక్కొక్కరు సుమారు 700 లీటర్లు నిల్వ ఉంచే డ్రమ్ములను ఏర్పాటు చేయడం, దానికి 1 హెచ్‌పీ మోటార్‌ను అమర్చి ఎటువంటి భయం లేకుండా డీజిల్‌ను విక్రయిస్తున్నారు. డ్రమ్ములు, నిల్వలను చూసి విజిలెన్స్‌ అధికారులు నివ్వెరపోయారు. ఇక నుంచి అక్రమ డీజిల్‌ వ్యాపారంపై ప్రత్యేక దృష్టి పెడతామని, తరచూ దాడులు నిర్వహిస్తామని విజిలెన్స్‌ ఎస్సై ఏసుబాబు చెప్పారు. డీజిల్‌ వ్యాపారం చేస్తున్న నలుగురు వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్న డీజిల్‌ను స్థానిక పెట్రోల్‌ బంక్‌కు అప్పగించడం జరుగుతుందని, వీరిపై 6ఏ, 7.1 కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. ఈ దాడుల్లో సీఎస్‌ డీటీ ఎన్‌.శ్రీనివాసరావు, వీఆర్వో మాటేటి గోపాలరావు, కానిస్టేబుల్‌ మహేష్‌బాబు పాల్గొన్నారు.

బండారం బయటపడిందిలా..
ఏలూరు నుంచి గోపాలపురం వస్తుండగా కోమటికుంట మాతంగమ్మ తల్లి ఆలయం ఎదురుగా ఉన్న కిళ్లీ షాపుల వద్ద ఆగి ఉన్న లారీ నుంచి డీజిల్‌ తీస్తుండగా విజిలెన్స్‌ అ«ధికారులు అటుగా వెళుతున్నారు. ఏం జరుగుతుందో చూద్దామని కారు నిలుపుదల చేసి పరిశీలించగా అక్రమ వ్యాపారుల గుట్టు రట్టయ్యింది. దీంతో విచారించగా నాలుగు కిళ్లీ షాపుల్లోనూ తనిఖీలు నిర్వహించినట్టు విజిలెన్స్‌ అధికారులు చెబుతున్నారు. లారీ సూర్యాపేట నుంచి అనకాపల్లి సిమెంట్‌ దిగుమతి చేసి తిరిగి వెళుతుండగా లారీ డ్రైవర్‌ డీజిల్‌ అమ్ముతుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నామన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top