దోచుకుంది 58 లక్షలు.. రీకవరి 4 లక్షలు!

In Vanasthalipuram ATM Robbery Case Police Recovered Only 4 Lakhs - Sakshi

పనామా ఏటీఎం రాబరీ కేసును ఛేదించిన పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని వనస్థలిపురంలో ఏటీఎం నుంచి రూ. 58 లక్షలను దొంగిలించి, ఆటోలో పరారైన కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ దోపిడీని చేసింది తమిళనాడుకు చెందిన రాంజీ గ్యాంగ్‌ అని పోలీసులు తేల్చారు. ఈ కేసులో నలుగురుని అరెస్ట్ చేసి.. వారి నుంచి మొత్తం రూ. నాలుగు లక్షలు రికవరీ చేశారు.

మే 7న వనస్థలిపురం పనామా దగ్గర యాక్సిస్‌ బ్యాంక్‌ ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన మనీ లోడింగ్‌ సిబ్బంది దృష్టి మరల్చి కొందరు దుండగులు రూ. 58 లక్షలను ఎత్తుకొని ఆటోలో పరారయ్యారు. కేసును సవాల్‌గా తీసుకొన్న రాచకొండ కమిషనర్‌, ఎల్బీ నగర్‌ పోలీసులు మూడు నెలలుగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చోరీకి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అవడంతో వాటి ఆధారంగానే ఈ కేసును చేధించినట్టు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ, కొన్ని టెక్నీకల్ ఎవిడెన్స్‌ను బట్టి ఈ చోరీలో దీపక్, సత్యరాజు పేర్లు బయటకి రావడంతో నిందితులను గుర్తించామని గ్యాంగ్‌కు సంబంధించిన వివరాలను సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు.

అంతేకాక రాంజీ నగర్ గ్యాంగ్ సభ్యుడు దీపక్ అలియాస్ దీపు ముఠాని పట్టుకున్నామని, నిందితుల నుంచి మొత్తం 4 లక్షలు నగదు, కారు, 15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. ఈ ఏటీఎం చోరీ కేసులో మొత్తం 14 మంది నిందితులు ఉన్నారని చెప్పారు. అందులో 11 మంది తమిళనాడుకి చెందిన వారు కాగా, ముగ్గురిది పశ్చిమ బెంగాల్ అని, దొంగిలించిన తర్వాత దుండగులు అక్కడ నుంచి ట్రైన్‌లో తమిళనాడులోని వారి స్వస్థలాలకు వెళ్లారని తెలిపారు. వీరందరిది రాంజీ నగర్ అని, ఈ ఊరిలో చాలామంది ఇలాంటి నేరాలు చేస్తున్నట్లు విచారణలో తేలిందని సీపీ వివరించారు.

చెడ్డి గ్యాంగ్ తరహాలోనే రాంజీ గ్యాంగ్ కూడా దృష్టి మరల్చి చోరీలు చేస్తారని, ఇలాంటి గ్యాంగుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్‌ సూచించారు. గతంలో ఓ కేసులో ఇన్‌ఫార్మర్ అనే నేపంతో ఓ వ్యక్తిని ఈ గ్యాంగ్ హత్య చేసిందని తెలిపారు. రాంజీ గ్యాంగ్‌ ప్రతి ఏడాది ఓ రాష్ట్రాన్ని టార్గెట్ చేసుకొని ఒక ప్లాన్ చేసుకుంటారని వ్యాఖ్యానించారు. పక్కా ప్లాన్ ప్రకారం, చార్ట్‌ గీసుకొని దోపిడీలు చేస్తారని గ్యాంగ్‌ వివరాలను వెల్లడించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top