భార్య లేని జీవితమెందుకని..

Two Days After HIS Wife Death Man Committed Suicide In Visakhapatnam - Sakshi

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

మూడు రోజుల కిందటే భార్య బలవన్మరణం

బుచ్చిరాజుపాలెం గవరవీధిలో విషాదం

సాక్షి, ఎన్‌ఏడీ జంక్షన్‌ (విశాఖ పశ్చిమ): ‘‘నీవు లేని జీవితం నాకెందుకు... నీతో ఏడు అడుగులు నడిచాను... చావులో కూడా నీతోనే నడుస్తాను... అంటూ’’ లేఖ రాసి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య బలవన్మరణంతో మనస్తాపానికి గురై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజులు గడవక ముందే దంపతులిద్దరూ ఇలా బలవన్మరణాలకు పాల్పడడంతో బుచ్చిరాజుపాలెం గవరవీధిలో విషాదం నెలకొంది. ఎయిర్‌పోర్టు జోన్‌ పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బుచ్చిరాజుపాలెం గవరవీధికి చెందిన మళ్ల లీలా సత్యనారాయణ(29)కు అదే ప్రాంతానికి చెందిన మౌనిక(23)తో మూడేళ్ల కిందట వివాహమైంది.

అనంతరం భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో మౌనిక శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎయిర్‌పోర్టు జోన్‌ పోలీసులు విచారణ నిమిత్తం సత్యనారాయణను అదే రోజు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం ఆదివారం గ్రామ పెద్దలు ఇంటికి తీసుకెళ్తామని చెప్పడంతో పోలీసులు విడిచిపెట్టారు. ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రించి సోమవారం ఉదయం సత్యనారాయణ బయటకు వెళ్లిపోయాడు. దీంతో సత్యనారాయణ ఇంటి నుంచి వెళ్లిపోయాడని అతని సోదరుడు ఎయిర్‌పోర్ట్‌ జోన్‌ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశాడు. దీనిపై మిస్సింగ్‌ కేసు కూడా నమోదు చేశారు.

ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో ఎన్‌ఏడీ దరి గణేష్‌నగర్‌ సమీపంలో రైల్రే ట్రాక్‌ దాటిన తరువాత మర్రి చెట్టుకు చీరతో ఉరి వేసుకున్నాడు.  స్థానికుల సమాచారం మేరకు తొలుత రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఎయిర్‌పోర్ట్‌ జోన్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. మృతుని వద్ద లభించిన లేఖను స్వాధీనం చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top