మహిళలపై కత్తులతో దాడి యత్నం

TDP Activists Attack on Women in Guntur - Sakshi

కొనసాగుతున్న టీడీపీ అరాచకాలు

గుంటూరు జిల్లాలో ఘటన

విశాఖ జిల్లాలో 6 ఎకరాల్లో జీడితోటలు ధ్వంసం

పిడుగురాళ్ల (గురజాల)/రావికమతం (చోడవరం): రాష్ట్రంలో టీడీపీ నాయకుల అరాచకాలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఎంత సంయమనంతో వ్యవహరిస్తున్నప్పటికీ టీడీపీ వర్గీయులు కవ్వింపు చర్యలకు పాల్పడడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం చేçస్తూనే ఉన్నారు. తాజాగా గుంటూరు జిల్లా, పిడుగురాళ్లలో వైఎస్సార్‌సీపీకి చెందిన మహిళలపై కత్తులతో దాడికి యత్నించారు. విశాఖ జిల్లా చోడవరంలో ఆరు ఎకరాల్లో జీడితోటలు ధ్వంసం చేశారు. వీటిపై కేసులు నమోదయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పిడుగురాళ్ల పట్టణ శివారులోని జగ్జీవన్‌రామ్‌ కాలనీలో గత ఎనిమిదేళ్ల నుంచి పలువురు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు నివసిస్తున్నారు. ఇదే కాలనీలో ఉండే దొప్పలపూడి సిరి, తాడేపల్లి నాగేశ్వరరావు, చల్లా రామకృష్ణలతో పాటు మరికొందరు టీడీపీ నాయకులు ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా అడ్డుకుంటూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసేవారు. మేము చెప్పిందే జరగాలంటూ దౌర్జన్యాలు చేసేవారు.

ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాలనీకి చెందిన మహిళా కార్యకర్తలు కొంగని ప్రశాంతి, దుర్గంపూడి సైదమ్మ, కొమ్మరి ప్రమీల తదితరులు ఒక బృందంగా ఏర్పడి స్థానిక ఎమ్మెలేకాసు మహేష్‌రెడ్డిని కలసి తమ సమస్యలను వివరించారు. వెంటనే స్పందించిన ఆయన మంచి నీటి కోసం నాలుగు బోర్లు వేయించారు. వందకు పైగా వీధి దీపాలు ఏర్పాటు చేశారు. మరో ప్రధాన సమస్య అయిన రోడ్డును త్వరలో నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఈ కాలనీలో టీడీపీకి చెందిన తాము పెత్తనం చేయాల్సింది పోయి మహిళలైన మీరు పెత్తనం చేయడం ఏమిటంటూ టీడీపీ నాయకులు బుధవారం అర్ధరాత్రి కత్తులతో దాడులు చేసేందుకు పన్నాగం పన్నారు. దీన్ని గమనించిన కొంగని ప్రశాంతి సీఐకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించింది. పోలీసు వాహనం అక్కడి చేరుకునేలోపు టీడీపీ నాయకులంతా పారిపోయారు. పోలీసులు సమయానికి రాకపోతే తమను కత్తులతో పొడిచి చంపేవారని సీఐకు మహిళలంతా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఐ సురేంద్రబాబు మాట్లాడుతూ.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అల్లరి మూకల పట్ల చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ధైర్యం చెప్పారు. కార్యకర్తలందరికీ అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని ప్రశాంతి తెలిపారు.

రాత్రికి రాత్రి జీడి తోట ధ్వంసం
విశాఖ జిల్లా చినపాచిల గ్రామంలో వైఎస్సార్‌సీపీకి చెందిన పోలవరపు ఈశ్వరరావు కౌలుకు చేస్తున్న ఆరెకరాల భూమిలో మూడేళ్ల వయస్సుగల జీడి తోటను బుధవారం రాత్రి టీడీపీ నేతలు సమూలంగా పీకి పారేశారు. దీంతో బాధిత రైతు కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని టీడీపీ నాయకుడు తన భార్యకు, బంధువులకు ఒంటరి మహిళల కింద పెన్షన్‌ పొందుతుండటంపై గత నెలలో వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ అక్కసుతో వైఎస్సార్‌సీపీ కార్యకర్త సత్యారావుపై గత నెలలో దాడిచేసి గాయపరిచారు. ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన మాజీ ఉప సర్పంచ్‌ కోమటి శంకర్రావు, నాయుడు పలుమార్లు బెదిరింపులకు పాల్పడ్డారని, ఇప్పుడు అన్నంత పని చేయించారని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో రైతు ఈశ్వరరావు పేర్కొన్నారు. రాళ్లు రప్పలుతో ఉన్న బీడు భూమిలో రెక్కలు ముక్కలు చేసుకుని జీడితోటను సాగు చేస్తున్నామని, ఇప్పుడు ఒక్క రాత్రిలో ధ్వంసం చేశారని, తమ జీవనాధారం పోయిందని వాపోయారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top