
విజయనగరం, లక్కవరపుకోట: మండలంలోని రంగరాయపురానికి చెందిన కాలేజీ విద్యార్థిని పిల్లా శ్యామల హత్యకేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. జనవరి 8న జరిగిన ఈ హత్య కలకలం రేపిన సంగతి తెలిసింది. పోలీసులు హత్యకు పాల్పడిన లక్కవరపుకోట గ్రామానికి చెందిన మజ్జి రాము (17) అనే బాలుడిన సోమవారం అదుపులోకి తీసుకుని బాల నేరస్తుల కోర్టులో హాజరు పరిచారు. దీనికి సంబంధించి ఎస్‌కోట సీఐ వెంకటరావు, ఎల్‌కోట ఎస్‌ఐ ప్రయోగమూర్తి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నింధితుడు రాము, మృతురాలు శ్యామల 8వ తరగతి నుంచే కలిసి చదువుకున్నారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తోంది. ఇంటర్ ఎస్‌కోటలోని పుణ్య గిరి జూనియర్ కాలేజీలో సీఈసీ గ్రూప్‌లో ఇద్దరు చేరి, నిత్యం బస్సులో రాకపోకలు సాగిస్తూ వచ్చా రు. కొద్ది రోజుల తర్వాత పెళ్లి చేసుకోవాల్సిందిగా రాము, శ్యామలను కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. విషయం శ్యామల తల్లికి, బంధువులకు తెలిసింది.
వారు మందలించారు. దీంతో ఆమె రామును క్రమేపీ దూరం పెడుతూ వచ్చింది. దీన్ని తట్టుకోలేక పోయిన రాము ఒక రోజు ఎస్.కోట ఆర్టీసీ కాంప్లెక్‌లో శ్యామలతో ఘర్షణకు దిగాడు. సహనం కోల్పోయి క్షణికావేశంలో గాజు పెంకుతో చేయి కోసుకున్నాడు కూడా. అనంతరం జనవరి 8న కాలేజీకి వెళ్లిన ఇద్దరు తర్వాత ఎల్.కోట జామి వీధి శ్మాశాన వాటిక సమీపంలో శ్యామలతో ఘర్షణకు దిగాడు. కోపంతో ఆమె చున్నీతో పీకను గట్టిగా బిగించడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సాక్ష్యాలను తారు మారు చేసేందుకు పెట్రోల్ తెచ్చి మృతదేహంపై పోశాడు. ఆ క్రమంలో రాము శరీరంపై కూడా పెట్రోల్ పడింది. మంటలను ముట్టిం చేందుకు ప్రయత్నిస్తున్నపుడు ముందు రాము శరీరానికే మంటలు అంటుకున్నాయి. దాంతో వెంటనే పక్కనే ఉన్న చెరువులోకి దూకాడు. తర్వాత నేరుగా తల్లి, తమ్ముడు సాయంతో విజయనగరం జిల్లా ఆస్పత్రిలో చేరాడు. ఇంటి దగ్గర వేసిన చలిమంటలో ప్రమాదవశాత్తూ పడిపోయినట్లు ఆస్పత్రిలో చెప్పాడు. కానీ కేసు ఛేదనలో పోలీసులకు అనేక అనుమానాలు తలెత్తాయి. రాముపై అనుమానం కలిగింది. సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రామును పోలీసులు విచారించగా నేరం అంగీకరించాడు. దీంతో బాలనేరస్తుల కోర్టుకు తరలించినట్లు సీఐ, ఎస్‌ఐ వివరించారు.
బాలికను గర్భవతిని చేసిన వ్యక్తి అరెస్టు
మెనర్‌పై లైంగికదాడికి పాల్పడి సదరు బాలికను 8 నెలల గర్భవతిని చేసిన వ్యక్తిని విజయనగరం డీఎస్పీ శ్రావణ్‌కుమార్ అరుకు–విశాఖ రోడ్డులో రంగరాయపురం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుంటే అరెస్టు చేశారు. అనంతరం సీఐ వెంకటరావు, ఎస్‌ఐ ప్రయోగమూర్తి నిందితుడిని సోమవారం విలేకర్ల ముందు ప్రవేశపెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వేపాడ మండలం రామస్వామిపేట గ్రామానికి చెందిన గుదే కోటేశ్వరరావు ఎల్‌కోట మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన ఓ బాలిక (11) తండ్రి, మేనమామతో పరిచయం పెంచుకుని వారి ఇళ్లకు కొన్నాళ్లుగా రాకపోకలు సాగించేవాడు. బాలిక తండ్రి స్థానిక స్టీల్ ఎక్సేంజ్ కర్మాగారంలో కూలి పనులకు వెళ్లేవాడు. తల్లి, నానమ్మ మేకలను మేపునకు తీసుకెళ్లేవారు. వారెవరూ ఇంట్లో లేని సమయం చూసిన కోటేశ్వరరావు రోజూ వచ్చి బాలికకు చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి, లోబర్చుకుని అత్యాచారానికి ఒడిగట్టాడు. కాగా ఈ నెల 24న బాలికకు కడుపు నొప్పి వచ్చింది. దీంతో స్థానిక పీహెచ్‌సీకి నానమ్మ తీసకెళ్లి వైద్యులకు చూపించింది. వైద్యులు పరీక్షించి బాలిక 8 నెలల గర్భవతిగా నిర్ధారించారు. వెంటనే కుటుంబ సభ్యులు బాలిక చెప్పిన వివరాల ప్రకారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు కోటేశ్వరరావును పట్టుకుని విచారిస్తే నిజం అంగీకరించారు. అయితే ఆయనపై ఇప్పటికే ఓ మహిళపై దాడి చేసిన కేసు నడుస్తోంది. 90 రోజులు శిక్ష అనుభవించి వాయిదాలకు తిరుగుతున్నాడు.