మీ లైఫ్‌ సెటిల్‌ చేస్తాం

SRI Gowthami Murder Case Police Inquiry On Bank Transactions In West Godavari - Sakshi

ఇదే శ్రీగౌతమి హత్యలో డీల్‌

ముందుగానే విచ్చలవిడిగా లక్షల్లో డబ్బు ఖర్చు

ముగ్గురు నిందితులు దొరికితే మరిన్ని నిజాలు

బ్యాంకు లావాదేవీలను పరిశీలించిన పోలీసులు

సాక్షి, నరసాపురం(పశ్చిమగోదావరి జిల్లా): రోజులు గడుస్తున్న కొద్దీ శ్రీగౌతమి హత్యకేసులో ఎన్నో మలుపులు, మరెన్నో కొత్త నిజాలు బయటకు వస్తున్నాయి. హత్యకు అసలు కిరాయి ఎంత అనేది అంతుచిక్కడం లేదు. అయితే ఈ విషయంలో పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. పని చేసిపెట్టండి, విషయాలు అన్నీ చక్కబడ్డ తర్వాత ‘మీ ఇద్దరి లైఫ్‌లు ఊహించని రీతిలో సెటిల్‌ చేస్తాం..’ ఇదే శ్రీగౌతమి హత్యకేసులో సజ్జా బుజ్జి అండ్‌ కో కిరాయి హంతకులకు ఇచ్చిన హామీ అని తెలుస్తోంది. అంతేకాదు హత్యకు ఒప్పందం చేసుకున్న తర్వాత కిరాయి హంతకులకు రూ.లక్షల్లో ఖర్చు పెట్టారు. విశ్వశనీయ సమాచారం మేరకు పోలీసులు ఇప్పటివరకూ ఈ కేసులో ఛేదించిన అంశాలివి.

కేసును మొదట్లో 15 రోజుల్లోనే క్లోజ్‌చేసి అపప్రద మూటకట్టుకున్న పశ్చిమ పోలీసులు ఈసారి సీబీసీఐడీ  వెనుక ఉండటంతో ఆచితూచి ముందుకెళుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు రోజూ కేసు పురోగతిని సమీక్షిస్తున్నట్టు తెలిసింది. ఇన్విస్టిగేషన్‌ అధికారిగా ఉన్న పాలకొల్లు రూరల్‌ సీఐ బుధవారం నరసాపురం వచ్చి పలు ప్రాం తాల్లో దర్యాప్తు చేశారు. కెనరా బ్యాంకు, ఓ బ్యూటీపార్లర్‌తో పాటుగా పావని ఇంటికి కూడా వెళ్లి వివరాలు సేకరించారు. ఈ కేసుపై మరో పోలీస్‌ బృందం పనిచేస్తుంది. సజ్జా బుజ్జి ఇటీవల విపరీతంగా ఆస్తులు కొనుగోలు చేసిన పెరవలి మండలం కానూరు, నరసాపురం, దర్భరేవు, నవరసపురం ప్రాంతాల్లో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.

ముందుగానే రూ.15 లక్షల వరకూ ఖర్చు..
హత్యకు రూ.1.70 లక్షలతో కారు కొనిపెట్టడమే కాకుండా హత్యకు ముందు రూ.15 లక్షల వరకూ కిరాయి హంతకులకు సజ్జా బుజ్జి, బొల్లంపల్లి రమేష్‌ ముట్టచెప్పారు. నరసాపురం కెనరా బ్యాంకులోని బుజ్జి ఖాతా నుంచి రూ.10 లక్షలు, బొల్లంపల్లి రమేష్‌ ఖాతా నుంచి రూ.5 లక్షలు వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పాలకొల్లు రూరల్‌ సీఐ రజనీకుమార్‌ నరసాపురం కెనరా బ్యాంకుకు వచ్చి వివరాలు సేకరించారు. అసలు నవంబర్‌ నెలలో హత్యకు స్కెచ్‌వేసి, జనవరిలో సంక్రాంతి సమయంలో అమలుచేయాలని ముందుగానే అనుకుని పక్కాగా ప్లాన్‌ను అమలు చేశారు. నవంబర్‌ నెల నుంచే లక్షల్లో సొమ్ములు ఖర్చుపెడుతుండటంతో కిరాయి హంతకులకు పూర్తిగా ధీమా వచ్చింది. ఈ హత్యలతో తమ జీవితాలు కచ్చితంగా సెటిల్‌ అయిపోతాయని భావించి శ్రీగౌతమిని యాక్సిడెంట్‌ మాటున హత్య చేశారు. ఇక ఈ కేసులో వైజాగ్‌కు చెందిన కిరాయి హంతకులు పాకాల సందీప్, కడియం దుర్గాప్రసాద్‌తో పాటుగా బొల్లంపల్లి రమేష్‌ కారు డ్రైవర్‌ కవురు లక్ష్మణ్‌ పరారీలోనే ఉన్నారు. వీరు ముగ్గురూ చిక్కితే కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఎవరా ఎమ్మెల్యే? ఎవరీ బడా వ్యక్తులు
ఈ కేసులో సజ్జా బుజ్జి అండ్‌ కోను రక్షించడానికి శతవిధాలా ప్రయత్నాలు సాగించిన కొందరి వ్యక్తుల పేర్లుపై చర్చ జోరుగా సాగుతోంది. శ్రీగౌతమి హత్య తర్వాత పావని పోరాటం చేయడం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే కేసు నుంచి వైదొలిగేందుకు లక్షలు ఇప్పిస్తామంటూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే, బుజ్జి సామాజిక వర్గానికి చెందిన స్థానికులైన ఇద్దరు బడా వ్యక్తులు పావనిపై విపరీతమైన ఒత్తిడి తెచ్చినట్టుగా తెలు స్తోంది. వారు ఎవరై ఉంటారనే దానిపైనా జోరుగా చర్చ సాగుతోంది.

పావని వీరి గురించి ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో వెల్లడించినట్టు సమాచారం. అయితే సీబీసీఐడీ వెనుకుండటంతో కేసును తప్పనిసరి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళుతున్న పోలీసులు ఈ బడాబాబుల విషయాలను వెలుగులోకి తెస్తారా? లేదా అనేది మరో ప్రశ్న. ఇక పోలీసులు తలుచుకుంటే ఏమైనా చేయగలరనేది శ్రీ గౌతమి కేసుతో మరోసారి రుజువయ్యినట్టయ్యింది. ఈ విషయం ఇప్పటికే శ్రీగౌతమి హత్యకేసులో రోజురోజుకూ తెరమీదకు వస్తున్న కొత్త అంశాలను పరిగణనలోకి తీసుకుంటే మొదట్లో ఎంత దారుణంగా పోలీసులు కేసును క్లోజ్‌ చేశారో అర్థమవుతుంది. శ్రీ గౌతమి, బుజ్జి కాల్‌డేటాలు గాని, నిందితుడి బుజ్జి బ్యాంకు అకౌంట్‌లను కూడా పరిశీలించకుండానే అప్పట్లో కేసు మూసేశారు. అంటే పోలీసులపై ఎంతమేర ఒత్తిళ్లు పనిచేసి ఉంటాయి, ఏ స్థాయి వ్యక్తుల సిఫార్సులు ఉండి ఉంటాయనేది మరోసారి హాట్‌ టాఫిక్‌గా మారింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top