సట్టా @ వాట్సాప్‌! | Satta Gang Arrest In Hyderabad | Sakshi
Sakshi News home page

సట్టా @ వాట్సాప్‌!

Aug 4 2018 11:53 AM | Updated on Sep 4 2018 5:53 PM

Satta Gang Arrest In Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటివరకు రోడ్డు సైడ్‌కే పరిమితమైన నిషేధిత సింగిల్‌ నంబర్‌ లాటరీని పోలి ఉండే సట్టా గేమ్‌ను నగరానికి చెందిన కుమార్‌ సంజయ్‌ అనే ప్రధాన నిర్వాహకుడు ఆన్‌లైన్‌ వరకు తీసుకువెళ్లాడు. దీనిని గుర్తించిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు  శుక్రవారం రెండు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి రెండు ముఠాలను పట్టుకున్నారు. ఈ రెంటిలోనూ సంజయ్‌ గ్యాంగ్‌ వాట్సాప్‌తో పాటు ఇతర యాప్స్‌ను వినియోగించి, కుమార్‌ జైశ్వాల్‌ గ్యాంగ్‌ ‘సంప్రదాయ పద్దతి’లో సట్టా జూదం నిర్వహిస్తున్నట్లు డీసీపీ  రాధాకిషన్‌రావు తెలిపారు. కుమార్‌ సంజయ్‌ ‘కేఎస్‌ ఆన్‌లైన్‌ ప్లే వాట్సాప్‌’ పేరుతో ఓ వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశాడు.

ఇతడి వద్ద లాలగూడకు చెందిన వి.శ్రవణ్‌కుమార్‌ సబ్‌–బ్రోకర్‌గా పని చేస్తున్నాడు. ఇతడితో పాటు మరికొందరు నిర్వాహకులు, పంటర్లు కొన్ని యాప్స్‌ వాడుతున్నారు. మట్కా.మోబీ, సట్టామట్కా07.కామ్, సట్టామట్కా143 వంటి యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. దీని ఆధారంగా సట్టా జూదాన్ని వ్యవస్థీకృతంగా నిర్వహిస్తున్నారు. మరోపక్క జైశ్వాల్‌ వద్ద సబ్‌–బ్రోకర్‌గా పని చేస్తున్న లాలాపేట్‌ వాసి ఎస్‌.సుధాకర్‌ పాత పద్దతిలోనే సట్టా స్లిప్పులు, పుస్తకాలతో దందా నడుపుతున్నాడు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలోని బృందం శుక్రవారం లాలగూడ ప్రాంతంలో దాడులు చేసి శ్రవణ్, సుధాకర్‌లతో పాటు   10 మంది పంటర్లను పట్టుకున్నారు. వీరిని తదుపరి చర్యల నిమిత్తం స్థానిక పోలీస్‌ స్టేషన్లకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement