కారు, లారీని ఢీ కొట్టిన బస్సు | RTC Bus Car Accident In Khammam | Sakshi
Sakshi News home page

కారు, లారీని ఢీ కొట్టిన బస్సు

Jul 29 2018 7:42 AM | Updated on Jul 29 2018 7:42 AM

RTC Bus Car Accident In Khammam - Sakshi

ప్రమాదంలో ధ్వంసమైన బస్సు (ఇన్‌సెట్‌) జాన్‌రెడ్డి (ఫైల్‌)

కొణిజర్ల ఖమ్మం: ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం తెల్లవారుజామున ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడులో జరిగింది. ఎస్‌ఐ వడ్లకొండ సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంలో మాగ్మా ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ బ్రాంచ్‌ హెడ్‌గా పని చేస్తున్న నకిరికంటి వెంకటజాన్‌రెడ్డి (36) కారులో కొత్తగూడెం వెళ్లి తిరిగి ఖమ్మం వస్తుండగా తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో హైదరాబాద్‌ నుంచి మధిర వెళుతున్న ఆర్టీసీ లగ్జరీ బస్సు  ఢీకొట్టింది. బస్సు అదే వేగంతో కారు వెనుక వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవింగ్‌ సీట్‌లో ఉన్న జాన్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.

బస్సు డ్రైవర్‌ భూక్యా నాగేశ్వరరావు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు లారీని ఢీకొని రోడ్డుకు అడ్డంగా నిలిచి పోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఎస్‌ఐ సురేష్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో బస్సు, లారీ, కారును రోడ్డు పక్కకు తీయించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. గాయపడ్డ బస్సు డ్రైవర్‌ నాగేశ్వరరావును 108 ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం తరలించారు. మృతుడు జాన్‌రెడ్డిది కృష్ణా జిల్లా షేర్‌మహ్మద్‌పేట, ఖమ్మంలోని ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలో 6 నెలల క్రితమే బ్రాంచ్‌ హెడ్‌గా చేరాడు. మృతుడికి భార్య శృతి, కుమారుడు, కూతురు ఉన్నారు. బంధువులు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement