ఇబ్రహీంపట్నంలో ఘోర ప్రమాదం

RTC Bus And Auto Road Accident In Rangareddy - Sakshi

ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ బస్సు ఆటోట్రాలీని ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా, 12 మంది గాయపడిన సం ఘటన ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం పోలీసుల కథనం ప్రకారం.. యాచారం మండలం మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన రైతులు ప్రతి రోజు ఆకుకూరలను అమ్ముకునేందుకు హైదరబాద్‌ మార్కెట్‌కు వెళ్తుంటారు. రోజూ మాదిరిగానే ఆటోట్రాలీలో కూరగాయాలు నింపుకొని గ్రామం నుంచి బయల్దేరారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కనిగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ సమీపంలో రైతులు ప్రయాణిస్తున్న ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది.

దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న గొడుకాండ్లు యాదయ్య(59) అక్కడికక్కడే మృతిచెందగా కట్టెల రాములు(40), మంచాల జంగయ్యలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. వీరితో పాటు ప్రమాదంలో గాయపడిన  మర్రిపల్లి వినోద్‌కుమార్, గుర్రం మధుకర్‌రెడ్డి, బోరిగె మహేందర్, కట్టల మహే ందర్, మేకల యాదగిరిరెడ్డి, మొగిలి జంగారెడ్డి, జి. రవీందర్, శ్యామల లక్ష్మమ్మ, గుడాల బాలమ్మ, మేకల కల్పనలను స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించారు. అనంతరం నగరంలోని ఉస్మానియా, యశోద, సాయి సంజీవిని ఆస్పత్రులకు తరలించారు. నిర్లక్ష్యంగా బస్సును నడిపించిన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
 
మొండిగౌరెల్లిలో విషాదఛాయలు 
యాచారం: కరువు పరిస్థితులు పండించిన ఆకుకూరలకు మంచి ధర వస్తుందనే ఆశ ప్రాణాల మీదకు తెచ్చింది. పూదీనా, కొత్తిమీరా పండించే మొండిగౌరెల్లి రైతులు నిత్యం ప్రైవేట్‌ వాహనా ల్లో హైదరాబాద్‌లోని మాదన్నపేట మార్కెట్‌కు తరలించి 5:30 గంటల్లోపే విక్రయాలు జరిపి తిరిగి ఇంటికి చేరుకుంటారు. ఏళ్లుగా ఇదే మాదిరిగా గ్రామానికి చెందిన రైతులు ఆకుకూరలను మార్కెట్‌లో విక్రయిస్తారు. అదే మాదిరిగా ఆదివారం ఉదయం 4 గంటలకు ఆటోలో పూదీనా, కొత్తిమీరా తదితర ఆకుకూరలను తీసుకుని 13 మంది రైతులు మాదన్నపేట మార్కెట్‌కు బయల్దేరారు.

ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌ దాటుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు రైతులు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ సంఘటనలో తీవ్రగాయాలపాలైన గొడుకొండ్ల యాదయ్య మృతిచెందగా, పలువురు తీవ్ర గాయాలపాలై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

యాదయ్య మృతితో  వీధిన పడిన కుటుంబం... 
గొడుకొండ్ల యాదయ్య మృతితో ఆయన కుటుంబం వీధిన పడింది. యాదయ్యకు నాలుగు ఎకరాల వ్యవసాయ పొలం ఉన్నప్పటికీ బోరుబావుల్లో నీళ్లు లేకపోవడంతో యాచారం గ్రామానికి చెందిన కుమ్మరి గాలయ్య వద్ద పొలాన్ని కౌలుకు తీసుకుని ఆకుకూరలు సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. యాదయ్యకు భార్య మల్లమ్మతో పాటు ఇద్దరు కుమారులు ప్రవీణ్‌కుమార్, రాంప్రసాద్‌కుమార్, దివ్యాంగురాలైన కూతురు జంగమ్మ ఉంది. యాదయ్య మృతితో కుటుంబం వీధినపడింది.

ఈ ప్రమాదంతో మొండిగౌరెల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆటోట్రాలీ ప్రమాదాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచనలు చేశాడు. యాదయ్య కుటుంబీలకు సాయం అందించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. క్షతగాత్రులను పరామర్శించిన వారిలో బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మరిపల్లి అంజయ్య యాదవ్, యాచారం జెడ్పీటీసీ కర్నాటి రమేష్‌గౌడ్, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు దెంది రాంరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు అచ్చెన మల్లీకార్జున్‌ తదితరులు ఉన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top