రౌ‘డీఎస్పీ’! | Rowdy SP! | Sakshi
Sakshi News home page

రౌ‘డీఎస్పీ’!

Oct 15 2017 2:32 AM | Updated on Aug 21 2018 6:00 PM

Rowdy SP! - Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ నగరంలో సంచలనం సృష్టించిన రౌడీ షీటర్‌ కొప్పెర్ల సత్యనారాయణరాజు అలియాస్‌ గేదెల రాజు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆర్టీసీ విజిలెన్స్‌ డీఎస్పీ దాసరి రవిబాబును ఏ 1 ముద్దాయిగా గుర్తించారు. ఈ మేరకు విశాఖ జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ దాడి నాగేంద్రకుమార్‌ శనివారం కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. రౌడీ షీటర్‌ హత్య కేసులో డీఎస్పీ రవిబాబు పాత్ర ఉన్నట్లు ‘సాక్షి’ ఇప్పటికే పరిశోధనాత్మక కథనంతో వెలుగులోకి తేవటం తెలిసిందే. ఏ–1 ముద్దాయి రవిబాబుతోపాటు ఏ–2 ముద్దాయి అయిన క్షత్రియభేరి పత్రిక ఎడిటర్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ భూపతిరాజు శ్రీనివాసరాజు పరారీలో ఉన్నట్లు కమిషనర్‌ చెప్పారు. హత్య కేసులో సంబంధం ఉన్న మరో ఎనిమిదిమంది నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

అసలేం జరిగింది...
ఈనెల 6న పెదగంట్యాడలోని భాగ్యశ్రీ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన ఓ వివాహానికి వెళ్లిన తన భర్త తిరిగి ఇంటికి రాలేదని గేదెల రాజు భార్య కొప్పర్ల కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు న్యూపోర్టు పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదైంది. సబ్బవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గాలి భీమవరం ప్రాంతంలో సగం కాలిన స్థితిలో లభ్యమైన మృతదేహాన్ని కొన్ని ఆనవాళ్లు, మెడలోని గొలుసు ఆధారంగా రాజుదిగా గుర్తించారు. దీంతో హత్య కేసుగా మార్చి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

డీఎస్పీపై పద్మలత ఫిర్యాదు
రవిబాబు అనకాపల్లి సీఐగా ఉండగా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు కుమార్తె, మాజీ ఎంపీపీ కాకర పద్మలతతో వివాహేతర సంబంధం ఏర్పడింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చింది. రవిబాబు మధురవాడ ఏసీపీగా పని చేస్తున్న సమయంలో అప్పటి పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో గత ఏడాది సెప్టెంబర్‌ 22న పద్మలత అనుమానాస్పద రీతిలో హఠాత్తుగా మృతి చెందింది. గుండెపోటుతో మృతి చెందినట్లు తొలుత భావించినా..  ఆమెకు విషం పెట్టి చంపేశారన్న వాదన బలంగా వినిపించింది. ఆమె చనిపోయిన సమయంలో పద్మలత కుటుంబానికి సన్నిహితుడైన గేదెల రాజు అక్కడే ఉండటంపై అనుమానాలు వ్యక్తమైనా కుటుంబ సభ్యులు పట్టించుకోక పోవడంతో విషయం మరుగున పడింది.

రౌడీషీటర్‌తో అడ్డు తొలగించాడు..
తనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పద్మలతను అడ్డుతొలగించునేందుకు దాసరి రవిబాబు నిర్ణయించుకున్నాడు. రౌడీషీటర్‌ గేదెల రాజుతో కోటి రూపాయలకు ఒప్పందం చేసుకుని అడ్వాన్స్‌గా రూ.50 లక్షలు ఇచ్చాడు. మిగతాది పని పూర్తయిన తరువాత ఇస్తామని చెప్పాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను గేదెల రాజు తన మొబైల్‌లో రికార్డు చేశాడు. పద్మలత చనిపోయిన తర్వాత డబ్బు చెల్లించాలని డీఎస్పీపై ఒత్తిడి తెచ్చాడు. డబ్బివ్వకుంటే తన దగ్గర ఉన్న ఫోన్‌ రికార్డును బయటపెడతానని బెదిరించేవాడు. దీంతో రౌడీషీటర్‌ను అంతమొం దించేందుకు క్షత్రియభేరి పత్రిక నిర్వాహకుడు శ్రీనివాసరాజును రవిబాబు ఆశ్రయించాడు. 

పోలీసులకు చిక్కిన కిరాయి ముఠా సభ్యుడు
కిరాయి ముఠా గేదెల రాజు మృతదేహాన్ని గోనె సంచిలో మూటకట్టి గాలి భీమవరం ప్రాంతంలో పెట్రోలు పోసి తగులబెట్టింది. అయితే మంటలను గమనించిన స్థానికులు సబ్బవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహంపై ఉన్న ఆనవాళ్ల ఆధారంగా శవం గేదెల రాజుదిగా గుర్తించారు. మృతుడి యాక్టివాను వినియోగిస్తున్న కిరాయి ముఠా సభ్యుడు రవి ఈ నెల 6వ తేదీ రాత్రి మద్యం తాగి వాహనాన్ని నడుపుతూ పోలీసులకు చిక్కాడు. ఈ నేపథ్యంలో నిందితుడిని విచారించటంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

డీజీపీకి నివేదిక పంపాం: విశాఖ కమిషనర్‌
ఆర్టీసీ విజిలెన్స్‌ డీఎస్పీ రవిబాబుపై డీజీపీకి నివేదిక పంపించామని విశాఖ పోలీస్‌ కమిషనర్‌ టి.యోగా నంద్‌ వెల్లడించారు. నిందితులు ఎంతటివారైనా చట్టప్రకారం శిక్ష తప్పదన్నారు. పరారీలో ఉన్న రవిబాబు కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నా యని ఆయన ‘సాక్షి’ ప్రతినిధికి చెప్పారు.

పత్రిక నిర్వాహకుడితో ప్రణాళిక
భూ సెటిల్‌మెంట్లు, పంచాయితీలు చేసే శ్రీనివాసరాజు, గేదెల రాజుల మధ్య ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలున్నాయి. కానీ పోలీస్‌ అధికారి కోరటంతో రౌడీషీటర్‌ అయిన రాజును అంతమొందించేందుకు పథకం రచించాడు. పెదవాల్తేరు ప్రాంతానికి  చెందిన మరో రౌడీ షీటర్‌ సువ్వాడ మహేష్‌తో కలసి హత్యకు పక్కా పథకం వేశాడు. రూ.4 లక్షలు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. పథకంలో భాగంగా ఈ నెల 6న మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో గాజువాకలోని క్షత్రియభేరి కార్యాలయానికి రావాలని, ఒక వ్యవహారం సెటిల్‌ చేయాలని గేదెల రాజును పిలిచాడు. ఆ సమయంలో భాగ్యలక్ష్మి ఫంక్షన్‌ హాల్‌లో జరుగుతున్న ఓ వివాహ వేడుకలో ఉన్న గేదెల రాజు క్షత్రియభేరి కార్యాలయానికి తన యాక్టివా వాహనం(ఏపీ 31 డీహెచ్‌ 3761)పై వెళ్లాడు. అప్పటికే అక్కడ మాటువేసిన కిరాయి ముఠా సభ్యులు గేదెల రాజుపై రాడ్లు, కత్తులతో దాడి చేయడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement