కుళ్లిన కూతురి శవంతో నెలరోజుల పాటు.. 

Retired Police And Wife Found Living With Daughter Decomposed Body In UP - Sakshi

 మిర్జాపూర్‌ : శవం పక్కన కొద్దిసేపు ఉండడానికే భయపడతారు చాలా మంది. కానీ చనిపోయిన వ్యక్తి శవం పక్కన నెల రోజుల పాటు ఉండాల్సి వస్తే ? అది కూడా సొంత కూతురి శవమైతే? ఆ ఊహే భయంకరంగా ఉంది కదూ. కానీ ఓ దంపతులు తమ కూతురి శవాన్ని ఇంట్లో పెట్టుకొని నెల రోజుల పాటు ఉన్నారు.  ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్న ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. యూపీకి చెందిన ఓ రిటైర్డ్‌ పోలీసు అధికారి, అతని భార్య మిర్జాపూర్‌లోని హయత్‌నగర్‌లో ఏరియాలో ‘దిలావర్ సిద్దిఖీ’ హౌజ్‌లో నివాసం ఉంటున్నారు. అతనికి ఓ కూతురు ఉంది. గత కొద్ది రోజులుగా ఆ ఇంటి నుంచి ఏదో దుర్వాసన వస్తోంది. ఆ దుర్వాసన రోజురోజుకి ఎక్కువవుతుండడంతో భరించలేక చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న పోలీసులు హయత్‌నగర్‌ చేరుకొని రిటైర్డ్‌ పోలీసు అధికారి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇంట్లో నుంచి కుళ్లిపోయిన ఒక శవం లభించింది. ఆ శవాన్ని రిటైర్డ్‌ పోలీసు అధికారి కూతురిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై ఆ దంపతులను విచారించగా.. తమ కూతురు చనిపోలేదని, నిద్రపోతుందని సమాధానం చెప్పడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. అంతే కాకుండా తామంతా కలిసే ఉన్నామని, తమ ఇంట్లో ఎలాంటి దుర్వాసన రావడం లేదని పిచ్చి పిచ్చి సమాధానాలు ఇచ్చారు. 

వారి సమాధానాలపై అనుమానం వచ్చి ఈ విషయంపై చుట్టుపక్కలవారిని ప్రశ్నించగా..ఆ దంపతులు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని, ఎవరితో సరిగా మాట్లాడేవారు కాదని చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకి తరలించారు. మానసిక రుగ్మతతో బాధపడుతున్న దంపతులు అనుకోకుండా తమ కూతురిని హత్య చేసి ఉండవచ్చని, పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చాక పూర్తి దర్యాప్తు చేపడతామని పోలీసులు పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top