ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో 12 మంది అరెస్ట్‌

Red Sandal Smugglers Case In YSR Kadapa - Sakshi

కడప అర్బన్‌ : అటవీశాఖ కడప సబ్‌ డివిజన్‌ పరిధిలో వేంపల్లె రేంజ్‌లో ముచ్చుకోన, పీకల కోన మ«ధ్యలో దాచి ఉంచిన 20 ఎర్రచందనం దుంగలను, వాహనాన్ని బుధవారం స్వాధీనం చేసుకుని 12 మంది నిందితులను అరెస్టు చేసినట్లు కడప డీఎఫ్‌ఓ శివప్రసాద్‌ తెలిపారు. కడప నగరంలోని అటవీశాఖ డీఎఫ్‌ఓ కార్యాలయ ఆవరణంలోని పంచవటి అతిథి గృహంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెండ్లిమర్రి మండలంలోని నందిమండలం పాపాఘ్ని నది వంతెన సమీపంలో ఈనెల 7వ తేది రాత్రి, తమ అధికారులు, సిబ్బంది తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో ఆరుగురు యువకులు కనిపించారన్నారు. వారు పొంతన లేని సమాధానాలు చెబుతుండగా, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని పరిశీలించామన్నారు.

అందులోని కాల్‌డేటా ఆధారంగా ఎర్రచందనానికి సంబంధించిన వ్యవహారం బయటపడిందన్నారు. దీంతో వారిని విచారించగా, తాము ఎర్రచందనం దుంగలను ముచ్చుకోన ప్రాంతంలో నరికి దాచి ఉంచామని వెల్లడించారన్నారు. తర్వాత వారిని విచారించి సంఘటనా స్థలానికి తీసుకెళ్లామన్నారు. అక్కడ మరో ఆరుగురు 20 ఎర్రచందనం దుంగలను దాచి  ఉంచారన్నారు. ప్రధానంగా నిందితులలో కొండయ్య అలియాస్‌ బన్ని, ట్రిపుల్‌ ఐటీలో ఇంజినీరింగ్‌ విద్య పూర్తి చేసిన శివ అనే యువకుడితోపాటు బాల గంగాధర్, మురళి, నారాయణస్వామి, చంద్రమౌళిలు ఉన్నారన్నారు.

అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలు నరికి దాచి ఉంచిన ప్రదేశంలో సుబ్బారెడ్డి, రమణ, ఆనంద్, శ్రీరాములు అలియాస్‌ కాశన్న, దేవ్లా నాయక్, కొండారెడ్డిలు ఉన్నారన్నారు. వీరిని అరెస్టు చేయడంలోనూ, నెట్‌వర్క్‌ను ఛేదించడంలోనూ వేంపల్లె రేంజ్‌ ఆఫీసర్‌ స్వామి వివేకానంద, శ్రీరాములు, మనోహర్, ప్రసాద్‌నాయక్, వెంకట రమణ, సుబ్బరాయుడు, కిశోర్, రసూల్, శేషయ్య, ఓబులేశు, గోపిచంద్రలు తమవంతు కృషి చేశారన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ ఐఎఫ్‌ఎస్‌ నరేంద్రన్, స్క్వాడ్‌ డీఎఫ్‌ఓ ఆర్డీ వెంకటేశ్వర్లు, ఏసీఎఫ్‌ సోమశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top