గొడ్డలితో యువకుడి వీరంగం | The Psycho Who Held An Ax To Kill Woman Has Escaped | Sakshi
Sakshi News home page

గొడ్డలితో యువకుడి వీరంగం

Jul 13 2019 11:38 AM | Updated on Jul 13 2019 11:38 AM

The Psycho Who Held An Ax To Kill Woman Has Escaped - Sakshi

దాడికి పాల్పడ్డ  దయానందరాజు

సాక్షి, తాడేపల్లి: తాడేపల్లి పట్టణ పరిధిలోని ఎన్టీఆర్‌ కరకట్ట మీద ఆవారాగా తిరిగే యువకుడు ఓ మహిళను చంపుతానంటూ గొడ్డలి పట్టుకొని శుక్రవారం రాత్రి వీరంగం వేశాడు. ఆమె 100కు డయల్‌ చేయడంతో, సమాచారం అందుకున్న ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ ఘటన స్థలానికి వెళ్లారు. యువకుడు ఆయన పైకి గొడ్డలి విసిరేసి, అనంతరం దాడి చేశాడు. ఘటనపై కానిస్టేబుల్‌తో పాటు, సదరు మహిళ తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గిరిజాల సునీత ఎన్టీఆర్‌ కరకట్ట మీద నివాసం ఉంటోంది. కుటుంబ పోషణ నిమిత్తం దగ్గరలో ఉన్న అక్వేరియం షాపులో పని చేస్తోంది. దాని కింద నాగపోగు దయానందరాజు నివాసం ఉంటున్నాడు. సునీత భార్యకు తన మీద ఏదో చెప్పిందనే వంకతో చంపుతానంటూ గోల గోల చేస్తూ, ఇంట్లో నుంచి గొడ్డలి తీసుకొని రోడ్డు మీదకు వచ్చాడు. సునీత అక్కడ నుంచి పారిపోయి బకింగ్‌ హామ్‌ కెనాల్‌ వద్ద ఉన్న ముళ్లపొదల్లో దాక్కొని 100కు డయల్‌ చేసింది.

ఉన్నతాధికారులు తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో అక్కడ దగ్గరలో విధులు నిర్వహిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ యం.వెంకటేశ్వర్లు ఘటన స్థలానికి వెళ్లారు. ద్విచక్ర వాహనం పార్కింగ్‌ చేస్తుండగానే, దయానంద రాజు చేతిలో ఉన్న గొడ్డలిని ఆయన పైకి విసిరేశాడు. అనంతరం పరిగెత్తుకుంటూ వచ్చి ముఖంపై పిడిగుద్దులు గుద్ది రోడ్డు మీద ఉన్న ఓ పైప్‌తో దాడి చేశాడు. హెడ్‌ కానిస్టేబుల్‌పై దాడి చేశాడని తెలియడంతో పోలీస్‌స్టేషన్‌ నుంచి ఘటన స్థలానికి నలుగురు పోలీసులు వెళ్లగా, వారిపై కూడా దురుసుగా ప్రయత్నించాడు.

తనను కొడితే మిమ్మల్నేం చేయాలో తెలుసంటూ రోడ్డుపై పడుకున్నాడు. కానిస్టేబుల్స్‌ బలవంతంగా జీపులో ఎక్కించి, పోలీస్‌స్టేషన్‌కు తీసుకురాగా, స్టేషన్‌ దగ్గర సైతం వీరంగం వేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. గతంలో కూడా దయానందరాజు పక్క ఇంటి వారిపై దాడిచేసి, తండ్రి, కూతుళ్లను రాడ్డుతో తల పగలగొట్టాడు. దయానందరాజు ఎన్టీఆర్‌ కరకట్ట మీద రెండున్నర సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాడు. ఇప్పటివరకు ఆ ప్రాంతంలో ఆరుగురిపై దాడికి పాల్పడ్డాడు. అయినా ఒక్క కేసే నమోదవ్వడం విశేషం. నిందితుడు పరారీలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement