విద్యార్థులపై పోలీసుల దాష్టీకం

Police Over Action On College Students - Sakshi

నారాయణ కళాశాల విద్యార్థిని ఆత్మహత్యపై ఆందోళన 

మృతురాలి తండ్రిని బూట్‌ కాలుతో తన్నిన కానిస్టేబుల్‌ 

పటాన్‌చెరు టౌన్‌:  నారాయణ కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలంటూ బుధవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ క్రమం లో మృతురాలి తండ్రి ని ఓ కానిస్టేబుల్‌ బూటు కాలుతో తన్నడం ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం వెలిమెలలోని నారాయణ బాలికల కళాశాలలో విద్యార్థిని సంధ్యారాణి (16) ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బుధవారం మృతదేహంతో నారాయణ కళాశాల ఎదుట ధర్నా చేయాలని బాధితులు, కొన్ని విద్యార్థి సంఘాలు యత్నించాయి.

మరోవైపు కొందరు యువకులు ఆస్పత్రిలోని మార్చురీ తలుపుల తాళాలు పగులగొట్టి సంధ్యారాణి మృతదేహాన్ని తీసుకుని తెచ్చారు. పోలీసులు అడ్డుకుని మృతదేహాన్ని మళ్లీ మార్చురీ గదిలోకి తీసుకువెళ్లారు. ఆ సమయంలో ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఓ దశలో పోలీసులు రెచ్చిపోయి లాఠీచార్జీ చేశారు. ఈ సందర్భంగా ఓ కానిస్టేబుల్‌.. మృతురాలి తండ్రి చంద్రశేఖర్‌ను బూటు కాలితో తన్నారు. దీంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని విద్యార్థిని చనిపోయిందని చెబుతున్న గదిని చూపిస్తామని మృతురాలి బంధువులను తీసుకువెళ్లారు. మరోవైపు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. ఆస్పత్రి పోస్టుమార్టం గది తలుపులు పగలగొట్టిన ఘటనలో విద్యార్థి సంఘం నాయకులపై కేసు నమోదు చేసినట్లు పటాన్‌చెరు సీఐ నరేశ్‌ తెలిపారు. 

కానిస్టేబుల్‌పై వేటు: ఇన్‌చార్జి ఎస్పీ: కానిస్టేబుల్‌ శ్రీధర్‌ మృతిరాలి తం డ్రితో దురుసుగా ప్రవర్తించడంపై శాఖ తరఫున చింతిస్తున్నట్లు ఇన్‌చార్జి ఎస్పీ చందనాదీప్తి అన్నారు. కానిస్టేబుల్‌ను ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్‌ సంగారె డ్డికి అటాచ్‌ చేశామన్నారు. ఘటనపై విచారణ జరుపుతామన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top