ప్రేమోన్మాది ఘాతుకం

Phsyco Murder Attempt on Young Women With Love Named Guntur - Sakshi

ప్రేమోన్మాది వేధింపులకు భయపడి యువతి ఉద్యోగం మానేసి ఇంటికి పరిమితమైనా ఆ మృగాడు వదలలేదు. ఇంటికి వచ్చి హత్యాయత్నానికి తెగబడ్డాడు. గుంటూరు రూరల్‌ మండలం జొన్నలగడ్డలో జరిగిన ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. గాయపడిన యువతి జీజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ప్రేమోన్మాది పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.    

గుంటూరు ఈస్ట్‌: వేధింపులకు భయపడి యువతి ఉద్యోగం మానేసి ఇంటికి పరిమితమైనా వెంటాడి మరీ హత్యాయత్నానికి తెగబడ్డాడు ఓ ఉన్మాది. ప్రేమ ముసుగులో ఉన్మాదిగా మారి యువతిని కత్తితో పొడిచి తర్వాత తనను తాను గాయపరుచున్నాడు. గుంటూరు రూరల్‌ మండలం జొన్నలగడ్డలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడ్డ యువతి జీజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. జొన్నలగడ్డలో నివసించే పుప్పాల సాంబయ్య, సామ్రాజ్యం దంపతుల మూడో కుమార్తె దివ్య డిగ్రీ పూర్తి చేసింది. గుంటూరు అరండల్‌పేటలోని ఓ ప్రైవేటు మార్కెటింగ్‌ కంపెనీలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా కొన్ని నెలలు పనిచేసింది. అదే సమయంలో మాచర్లకు చెందిన బాలాజీనాయక్‌ అనే యువకుడు దివ్య వద్ద అసిస్టెంట్‌ సేల్స్‌ ప్రమోటర్‌గా పనిచేశాడు.

తనను ప్రేమించమంటూ వెంట పడ్డాడు. అతని వేధింపులకు భయపడిన దివ్య ఉద్యోగం మానేసి కొద్ది రోజులుగా ఇంటి వద్దే ఉంటోంది. బుధవారం దివ్య ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో బాలాజీ నాయక్‌ ఆమె వద్దకు వచ్చాడు. తనను ప్రేమించి పెళ్లికి ఒప్పుకోవాలంటూ ఒత్తిడి చేశాడు. దివ్య నిరాకరించడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె పొట్టలో పొడిచాడు. మళ్లీ పొడిచే ప్రయత్నం చేయగా దివ్య పెద్దగా కేకలు వేస్తూ చేతులు అడ్డం పెట్టడంతో చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. దివ్య తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడిపోవడంతో.. ఇంట్లో ఉన్న కుక్కర్‌ మూతతో బాలాజీనాయక్‌ తనను తాను తలపై కొట్టుకుని గాయపరుచుకున్నాడు. అలజడికి అక్కడికి చేరుకున్న స్థానికులు వారిద్దరినీ జీజీహెచ్‌కు తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. దివ్య ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉన్నా, ప్రాణాపాయం లేదని తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top