ఆ రెండు కేసులతో తన ప్రమేయంలేదని..

A Person Killed Himself For Unnecessarily Indulging Him In Two Cases - Sakshi

సాక్షి భీమ్‌గల్‌: మండలంలోని చేంగల్‌ గ్రామంలో మగ్గిడి సచిన్‌(24) అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి ఆదివారం తెలిపారు. మగ్గిడి సచిన్‌ శనివారం రాత్రి పడుకునేందుకు ఇంటి మేడపైకి వెళ్లాడు. ఆదివారం ఉదయం ఎంతకూ లేవకపోవడంతో సచిన్‌ తండ్రి సంజీవయ్య మేడపైకి వెళ్లగా ఎంతకూ గది తలుపులు తెరవకపోవడంతో అనుమానంతో తలుపులు బద్దలు కొట్టాగా దూలానికి ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యు లు ఒక్క సారిగా షాక్‌కు గురయ్యారు. సచిన్‌పై గతంలో పలు పోలీసు కేసులు నమోదు కాగా పలుమార్లు రిమాండ్‌కు వెళ్లివచ్చాడు. గతంలో గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న సాయి దీక్షిత ఆత్మహత్య వ్యవహారంలో నిందితుడుగా ఉన్నాడు. సాయి దీక్షిత, సచిన్‌ ప్రేమించుకున్నారు.

ఈ నేపథ్యంలో సాయి దీక్షిత ఆత్మహత్యపై పెళ్లుబికిన విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో సచిన్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించగా బెయిల్‌పై వచ్చిన అనంతరం కోర్టుకు హాజరవుతున్నాడు. అనంతరం కొద్ది రోజుల తర్వాత గ్రామ శివారులో మామిడి కాయల కోసం వచ్చిన వారిని దుండగులుగా భావించి గ్రామస్తులు తీవ్రంగా కొట్టి స్థానిక గ్రామ కమిటీ భవనంలో బంధించిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ సందర్భంగా మృతుల తరపువారు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టగా పోలీసులు అప్పుడు వీడియోలో కనిపించిన పలువురు వ్యక్తులపై కేసులు నమోదు చేసి కోర్టుకు రిమాండ్‌ చేశారు.

ఆ ఘటనలో కూడా తన ప్రమేయం లేకున్నా అక్కడ నిలబడి ఉన్నందుకు తనపై అనవసరంగా కేసులు నమోదు చేసారని తరచూ స్థానికులతో వాపోయే వాడు. రెండు కేసులలో తన ప్రమేయం లేకున్నా ఇరుక్కుని ఇబ్బందులకు గురవుతన్నానని మానసిక వేదన చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాట్లు ఎస్సై శ్రీధర్‌ రెడ్డి తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top