ముసలమ్మ మరణం.. ఎవరిదీ పాపం? | Old Woman Died With Contractor Negligence | Sakshi
Sakshi News home page

ముసలమ్మ మరణం.. ఎవరిదీ పాపం?

Mar 1 2019 9:15 AM | Updated on Mar 1 2019 9:15 AM

Old Woman Died With Contractor Negligence - Sakshi

శిథిలాల కింద నలిగిన వృద్ధురాలి మృతదేహం (ఇన్‌సెట్లో) మృతురాలు వనజాక్షి(ఫైల్‌)

పొందూరు:  కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యానికి వృద్ధురాలు కన్నుమూసింది. ముందస్తు సమాచారం లేకుండా జేసీబీతో పనులు చేపట్టడంతో ఓ ఇల్లు నేలకూలింది. అభం శుభం తెలీని అవ్వ శిథిలాల కింద ముక్కలైంది. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయ ప్రాంగణంలో ఉప ఖజానా శాఖ ఆఫీసు నిర్మాణానికి జేసీబీతో పనులు చేస్తుండగా గురువారం ఈ సంఘటన జరిగింది. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ప్రాంగణంలో ఉపఖజానాశాఖ కార్యాలయం నిర్మాణానికి గత ఏడాది అక్టోబర్‌ 9న ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్‌ స్వయాన ఆయనకు అన్నయ్య.. విజయలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత కూన వెంకట సత్యనారాయణ. కొద్ది రోజుల క్రితమే కార్యాలయం ప్రహరీ గోడకు, సమీప ఇళ్లకు ఆనుకొని పొడవైన పెద్ద గోతులను తవ్వారు.

అప్పటి నుంచి సమీప ఇళ్లలోని వారు బాత్రూమ్‌లకు, మరుగుదొడ్లకు వెళ్లేందుకు భయపడుతూనే ఉన్నారు. గురువారం బాత్రూమ్‌లకు, మరుగుదొడ్లుకు ఆనుకొని ఉన్న ప్రహరీ గోడను తవ్వుతుండగా జరిగినప్రమాదంలో వృద్ధురాలు కమ్మచ్చి వనజాక్షి (73) అక్కడికక్కడే మృతి చెందింది. ప్రహరీగోడ ముద్దంశెట్టి వెంకటలక్ష్మి, కమ్మచ్చి వనజాక్షి, ఖాళీగా ఉన్న మరో ఇంటికి ఆనుకొని ఉంది. జేసీబీతో పనులు చేసే ముందుకు ఇంటి యజమానులకు నోటీసులు ఇవ్వడం గాని, సమాచారం గానీ లేదు. జేసీబీతో ఉదయం నుంచే పనులు చేస్తుంటే ప్రాంగణంలో ఎక్కడో దగ్గర చేస్తున్నారని ఇంటివాళ్లు అనుకొన్నారు. ముద్దంశెట్టి వెంకటలక్ష్మి స్నానం చేసుకొని అప్పుడే ఇంట్లోకి వెళ్లారు. కొన్ని క్షణాల్లో ఒక్కసారిగా బాత్రూమ్‌లు, మరుగుదొడ్లు కుప్పకూలిపోయాయి. ఆ సమయంలో కమ్మచ్చి వనజాక్షి (73) స్నానం చేస్తున్నారు. బాత్రూమ్‌తో పాటు గోతిలో పడిపోయారు. ఆమెపై గోడ కూలిపోయింది. శిథిలాల కిందదనే ఉండిపోయి నలిగి మృతి చెందారు.

కేసు నమోదు
మృతురాలు కమ్మచ్చి వనజాక్షి కుమారుడు గిరీష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రైనింగ్‌ ఎస్‌ఐ హైమావతి కేసు నమోదు చేసారు. మరుగుకు వెళ్తున్న సమయంలో గోడకూలిæ తన తల్లి వనజాక్షి మృతి చెందిందని కొడుకు గిరీష్‌ ఫిర్యాదు చేసారు. ట్రైనింగ్‌ ఎస్‌ఐ హైమావతి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

విషాదంలో  వనజాక్షి కుటుంబం
పదేళ్ల క్రితం బతుకు తెరువుకు వనజాక్షి కుటుంబం బెంగళూరు నుంచి పొందూరుకు వచ్చారు. ఈమెకు ఇద్దరు అబ్బాయిలు, ఒక కూతురు ఉన్నారు. పెద్దమ్మాయి శకుంతల, పెద్ద అబ్బాయి వీరేంద్రలు బెంగళూరులో ఉంటున్నారు. చిన్న కుమారుడు గిరీష్‌తో వనజాక్షి పొందూరులో ఉంటున్నారు. బెంగుళూర్‌ అయ్యంగార్‌ స్వీట్‌ బేకరీని ఏర్పాటు చేసుకొన్నారు. కొడుక్కు చేదోడువాదోడుగా ఉంటున్నారు. ఊహించని సంఘటన జరిగి తల్లి మృతి చెందడంతో కొడుకు గిరీష్, కోడలు, పిల్లలు, కుటుంబసభ్యులు ఆందోళనలో ఉన్నారు. కన్నీరు మున్నీ రుగా విలపిస్తున్నారు. మహారాజా మార్కెట్‌లోని కొంద రు వ్యాపారులు సంఘటన స్థలానికి చేరుకొని కుటుం బానికి అండగా నిలిచారు. కాంట్రాక్టర్‌ నష్టపరిహారం అందించాలని కోరారు. మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించేందుకు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement