ఆ అమ్మకు కన్నీరే మిగిలింది | Niloufer hospital kid kidnap issue became tragedy | Sakshi
Sakshi News home page

ఆ అమ్మకు కన్నీరే మిగిలింది

Oct 25 2017 3:03 AM | Updated on Oct 25 2017 6:49 AM

Niloufer hospital kid kidnap issue became tragedy

ఆదివారం శిశువును నిలోఫర్‌కు తీసుకొస్తున్న అమ్మమ్మ కల్పన, మంజుల (సీసీ కెమెరాలో రికారై్డన దృశ్యం)

సాక్షి, హైదరాబాద్‌/వెల్దండ: కన్నకొడుకును కళ్లారా చూసుకోకముందే ఆ అమ్మకు కన్నీరు మిగిలింది.. పుట్టిన మూడు రోజులకే దూరమైన బిడ్డ చివరిచూపు కూడా దక్కకుండానే శాశ్వతంగా దూరమైపోయాడు.. ఆదివారం హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆస్పత్రి వద్ద కిడ్నాపైన శిశువు ఉదంతం విషాదాంతమైంది. సోమవారం ఉదయమే ఆ శిశువు మరణించాడని.. కిడ్నాపర్‌ నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండి మండలం బండరోనిపల్లి గ్రామంలో మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు తేలింది. కిడ్నాపర్‌ను సత్తూరి మంజులగా గుర్తించిన పోలీసులు.. మంగళవారం ఆమెను, ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

ఆయాగా పరిచయం చేసుకుని..
హైదరాబాద్‌లోని ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన పాండు భార్య నిర్మల శుక్రవారం పేట్లబురుజు ఆస్పత్రిలో మగశిశువుకు జన్మనిచ్చింది. ఆ పసికందు ఆరోగ్యం బాగా లేకపోవడంతో నిలోఫర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి తీసుకువస్తున్నారు. ఇక వరంగల్‌ జిల్లా కేసముద్రానికి చెందిన మంజుల, నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండి మండలం బండరోనిపల్లికి చెందిన కుమార్‌గౌడ్‌ కొన్నేళ్ల కింద హైదరాబాద్‌లోని కాటేదాన్‌ పారిశ్రామికవాడకు వలస వచ్చారు. అక్కడ వారికి పరిచయం ఏర్పడి మూడేళ్ల కింద వివాహం చేసుకున్నారు. మంజుల పలు గర్భం దాల్చినా వరుసగా అబార్షన్లు కావడంతో తమకు పిల్లలు పుట్టే అవకాశం లేదని భావించింది. రెండు నెలల కింద ఆరు నెలల గర్భం కూడా పోయింది.

అయినా భర్తకు చెప్పకుండా దాచిన ఆమె.. ప్రసవం కోసమంటూ ఓ మహిళతో కలసి పేట్లబురుజు ఆస్పత్రికి వచ్చింది. అక్కడ ఎవరైనా తనకు శిశువును ఇస్తే.. తమ బిడ్డగా భర్తకు చూపాలని భావించింది. శనివారం రోజంతా ఆస్పత్రిలోనే ఉండి.. ఆయాగా చెప్పుకుంటూ తిరిగింది. చివరికి ఆస్పత్రిలో నిర్మల కుమారుడిని కిడ్నాప్‌ చేయాలని నిర్ణయించుకుని.. వారితో పరిచయం పెంచుకుంది. ఆదివారం శిశువును నీలోఫర్‌ ఆస్పత్రికి తీసుకెళుతుండగా తాను సహాయంగా ఉంటానంటూ మంజుల కూడా వెళ్లింది. నీలోఫర్‌ ఆస్పత్రిలో స్కానింగ్‌ తీసిన అనంతరం శిశువు బంధువులు ఏమరుపాటుగా ఉన్న సమయం చూసి.. శిశువును ఎత్తుకుని పరారైంది.

సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా..
నీలోఫర్‌ ఆస్పత్రి వద్ద శిశువును కిడ్నాప్‌ చేసిన మంజుల.. అక్కడి నుంచి లక్డీకాపూల్‌ వరకు ఆటోలో, తర్వాత బస్సులో పేట్లబురుజు ఆస్పత్రి వద్దకు వెళ్లినట్లు పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా గుర్తించారు. అనంతరం తనను డిశ్చార్జి చేశారని, బిడ్డను తీసుకుని వెళదామని భర్తను ఆస్పత్రి వద్దకు పిలిపించుకుంది. అక్కడి నుంచి శిశువుతో సహా భార్యాభర్తలు బైక్‌పై తమ స్వగ్రామం బండరోనిపల్లికి చేరుకున్నారు.

అయితే అప్పటికే శిశువు అనారోగ్యంతో ఉండగా.. పరిస్థితి విషమించి సోమవారం ఉదయం కన్నుమూశాడు. దీంతో శిశువును గ్రామంలోనే పూడ్చిపెట్టారు. అయితే శిశువును తీసుకెళుతున్న మహిళ బస్సులో ప్రయాణించిన విషయం తెలుసుకున్న పోలీసులు... మంగళవారం వెల్దండ వెళ్లి విచారించారు. కిడ్నాపర్‌ చిత్రాలు చూపించగా సత్తూరి మంజులగా స్థానికులు గుర్తించారు. దీంతో ఆ గ్రామానికి వెళ్లిన పోలీసులు మంజులను, ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పోలీసులు బుధవారం శిశువు మృతదేహాన్ని వెలికితీసి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

’నీలోఫర్’ శిశువు కిడ్నాప్‌ ఘటన విషాదాంతం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement