స్నేహితున్ని చంపి.. పూలతొట్టెలో పాతి..

Murder mystery revealed after two years - Sakshi

రెండేళ్ల తర్వాత వెలుగులోకి.. 

ప్రేయసిని దూరం చేస్తున్నాడని కక్ష గట్టి అంతం 

ఢిల్లీలో మెదక్‌ యువకుడి హత్య 

ఇటీవలే అస్థిపంజరాన్ని  గుర్తించిన ఇంటి యజమాని 

దర్యాప్తు చేసి నిందితుడిని  సిటీలో పట్టుకున్న పోలీసులు 

సాక్షి, హైదరాబాద్‌: ఎట్టకేలకు రెండేళ్ల మిస్టరీ వీడింది. అనుమానమే పెనుభూతమై స్నేహాన్ని అంతం చేసింది. బంధువని కూడా చూడకుండా ఓ వ్యక్తిని చంపేసింది. మెదక్‌కు చెందిన జయప్రకాశ్‌(27), విజయ్‌కుమార్‌(30) సమీపబంధువులు, స్నేహితులు. బతుకుదెరువు కోసం ఢిల్లీకి వెళ్లి ఓ అద్దె ఇంట్లో నివసించారు. అపార్థంతో జయప్రకాశ్‌పై కక్షకట్టిన విజయ్‌ మూడేళ్ల క్రితం అతడిని అంతం చేశాడు. మిస్సింగ్‌ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి హైదరాబాద్‌కు పారిపోయి వచ్చాడు. యాదృచ్ఛికంగా జయప్రకాశ్‌ అస్థిపంజరం బయటపడటంతో ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేసిన అధికారులు బుధవారం విజయ్‌ను హైదరాబాద్‌లో అరెస్టు చేసి తీసుకువెళ్లారు.

బతుకుదెరువు కోసం వలస వెళ్లి... 
జయప్రకాశ్, విజయ్‌కుమార్‌ విద్యాభ్యాసం తర్వాత ఉద్యోగాన్వేషణ మొదలెట్టారు. ఈ నేపథ్యంలోనే 2015లో ఢిల్లీకి వలసవెళ్లి దాబ్రీ ప్రాంతంలో ఉన్న చాణక్యప్లేస్‌లో విక్రమ్‌సింగ్‌ అనే వ్యక్తికి చెందిన అపార్ట్‌మెంట్‌లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. అనేక ప్రయత్నాల తర్వాత ఇద్దరూ ప్రైవేట్‌ ఉద్యోగాలు పొందారు. విజయ్‌ తన ప్రేయసికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు జయప్రకాశ్‌కు చెప్తుండేవాడు. అనేకసార్లు జయప్రకాశ్‌ ఆమెతో ఫోన్‌ ద్వారా, నేరుగా మాట్లాడాడు. దీంతో జయప్రకాశ్‌పై విజయ్‌ అనుమానం పెంచుకున్నాడు. తన ప్రేయసితో సన్నిహితంగా ఉంటూ దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని భావించి జయప్రకాశ్‌ను అంతం చేయడానికి పథకం వేశాడు.  

మరమ్మతుల నేపథ్యంలో వెలుగులోకి... 
 జయప్రకాశ్, విజయ్‌లు నివసించిన తర్వాత ఆ గదిలో మరికొందరు అద్దెకు ఉండి వెళ్లారు. అధ్వానంగా మారడంతో గత ఏడాది అక్టోబర్‌ 8న ఆ గదికి యజమాని మరమ్మతులు చేపట్టారు. అందులో భాగంగా పూలకుండీల తొట్టెను కూలీలు తొలగిస్తుండగా ఓ అíస్థిపంజరం బయటపడింది. యజమాని ఇచ్చిన సమాచారం మేరకు అక్కడి పోలీసులు గత ఏడాది అక్టోబర్‌ 9న హత్య కేసు నమోదైంది. అస్థిపంజరం నుంచి డీఎన్‌ఏ నమూనాలు సేకరించిన పోలీసులు మెదక్‌ నుంచి జయప్రకాశ్‌ కుటుంబీకుల్ని రప్పించి నమూనాలు తీసుకున్నారు.  

ఒకటేనంటూ నివేదిక రావడంతో... 
డీఎన్‌ఏ నమూనాలనూ విశ్లేషించిన ఫోరెన్సిక్‌ నిపుణులు ఆ అస్థిపంజరం జయప్రకాశ్‌దేనంటూ ఇటీవల నిర్ధారించారు. దీంతో ఈ కేసులో విజయ్‌ను ప్రధాన అనుమానితుడిగా చేర్చిన ఢిల్లీ పోలీసులు అతడి కోసం ముమ్మరంగా గాలించారు. హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించి, వచ్చి అరెస్టు చేసి తీసుకువెళ్లారు. విచారణ నేపథ్యంలో హత్యకు కారణాలను బయటపెట్టాడు. చంపేసిన తర్వాత తానే ఉద్దేశపూర్వకంగా జయప్రకాశ్‌ సెల్‌ఫోన్‌ను ధ్వంసం చేసి పారేశానని, ఆపైనా పదేపదే అతడి సెల్‌ఫోన్‌కు కాల్స్‌ చేయడం, ఎస్సెమ్మెస్‌లు పెట్టానని చెప్పాడు. వాటికి స్పందించట్లేదంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేశానని వెల్లడించాడు. 

ఫ్యాన్‌ మోటార్‌తో  కొట్టి హత్య... 
అదను కోసం ఎదురు చూసిన విజయ్‌ 2016 ఫిబ్రవరి 12న తన పథకాన్ని అమలు చేశాడు. ఉద్దేశపూర్వకంగా జయప్రకాశ్‌తో వాగ్వాదానికి దిగి తమ గదిలో ఉన్న ఫ్యాన్‌ మోటారు భాగంతో తలపై మోది హత్య చేశాడు. మూడో అంతస్తు బాల్కనీలో ఓ తొట్టె లాంటిది నిర్మించి శవాన్ని అందులో పూడ్చేశాడు. అదేరోజు స్థానిక పోలీసుస్టేషన్‌కు వెళ్లి జయప్రకాశ్‌ అదృశ్యమయ్యాడంటూ ఫిర్యాదు చేశాడు. ఇంటి యజమానికీ ఇదే విషయం చెప్పిన విజయ్‌ కొన్నిరోజులకు ఢిల్లీ వదిలి హైదరాబాద్‌ వచ్చి ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top