వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని..

Mother Killed Child For Fornication Relation In Tamil Nadu - Sakshi

అన్నానగర్‌: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని మూడు నెలల బిడ్డని గొంతు కోసి చెత్తకుప్పలో విసిరేసిన తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. బిడ్డను హత్య చేసి ఎవరో కిడ్నాప్‌ చేశారని నాటకం ఆడింది. దిండుక్కల్, కొడైరోడ్డు సిరుమలై ప్రాంతానికి చెందిన కార్తీక్‌ (26). ఇతను కోవై శరవణంపట్టి ప్రాంతంలో ఉన్న రబ్బర్‌ పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఇతని భార్య వనిత (22). వీరికి శశిప్రియ (2), మూడు నెలల కవిశ్రీ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ స్థితిలో సోమవారం ఉదయం కార్తీక్‌ ఎప్పటిలాగే పనికి వెళ్లాడు. వనిత ఇద్దరు పిల్లలతో ఇంటిలో ఉంది. అప్పుడు సాయంత్రం 3 గంటల సమయంలో వనిత స్నానానికి వెళ్లి వచ్చింది. తరువాత ఆమె కేకలు వేస్తూ.. తన బిడ్డని ఎవరో కిడ్నాప్‌ చేశారని ఏడ్చింది. అనంతరం భర్తకు ఫోన్‌ ద్వారా సమాచారం తెలిపింది. దీంతో వెంటనే కార్తీక్‌ ఇంటికి వచ్చి కవిశ్రీని పలు స్థలాలలో వెతికారు. తర్వాత శరవణంపట్టి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీని ప్రకారం పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి వనితను విచారించారు. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం ఏర్పడింది. దీంతో పోలీసులు ఆమెని తీవ్రంగా విచారణ చేపట్టారు.

ఇందులో వనిత బిడ్డను హత్య చేసినట్లుగా తెలిపింది. ఇది విన్న పోలీసులు, కార్తీక్‌ దిగ్భ్రాంతి చెందారు. ఈ కేసుపై పోలీసులు మాట్లాడుతూ వనితకి, పక్కింటికి చెందిన శ్రీనివాసన్‌కి వివాహేతర సంబంధం ఏర్పడింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండకూడదని మొదటి కుమార్తె శశిప్రియని దిండుక్కల్‌ సిరుమలై ప్రాంతంలో ఉన్న తన కన్నవారి ఇంటిలో వదిలిపెట్టింది. మూడు నెలల పసికందు కవిశ్రీ తరచూ ఏడుస్తూ ఉండేది. దీంతో తన వివాహేతర సంబంధానికి ఈ బిడ్డ అడ్డుగా ఉందని వనిత, శ్రీనివాస్‌ తలచారు.

కార్తీక్‌ పనికి వెళ్లిన సమయంలో కన్నబిడ్డ అని చూడకుండా గొంతు నులిమి, కత్తితో గొంతు కోసి హత్య చేసింది. తరువాత బిడ్డ మృతదేహాన్ని గోనెసంచిలో పెట్టి ఇంటి సమీపంలో ఉన్న  చెత్తకుప్పలో విసిరేసి ఏమీ తెలియనట్లుగా ఇంటికి వచ్చింది. తరువాత బిడ్డను ఎవరో కిడ్నాప్‌ చేశారని చెప్పి నాటకం ఆడింది. ఈ స్థితిలోనే వనిత పోలీసుల విచారణలో చిక్కుకుంది. హత్య చేయడానికి శ్రీనివాసన్‌ అనుచరుడిగా ఉన్నాడా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తూ వస్తున్నారు. వనిత చెప్పిన చెత్తకుప్ప వద్దకు వెళ్లి చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న  పోలీసులు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. తరువాత వనితను పోలీసుస్టేషన్‌కు తీసుకుని వెళ్లి సోమవారం రాత్రి అరెస్టు చేశారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top