దారుణం : ఓటు వేయలేదని గ్యాంగ్‌రేప్‌.. హత్య

Minor Rape and Killed over Family did not vote - Sakshi

రాంచీ :  జార్ఖండ్‌ లో దారుణం చోటు చేసుకుంది. ఎన్నికల్లో తన భార్యకు మద్ధతు ఇవ్వలేదని ఓ వ్యక్తి ఒక కుటుంబంపై పగ పెంచుకుని దాష్టీకానికి పాల్పడ్డాడు. ఆ కుటుంబంలోని 13 ఏళ్ల బాలికపై సాముహిక అత్యాచారానికి పాల్పడి.. కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. 

అసలేం జరిగిందంటే... పాకూరు జిల్లా లిట్టిపారా గ్రామ పంచాయితీలో ‘ముఖియా’ పదవి కోసం కొన్నాళ్ల క్రితం ఎన్నికలు జరిగాయి. ప్రేమ్‌లాల్‌ హంసద అనే వ్యక్తి భార్య ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే బాధిత కుటుంబ సభ్యులు మాత్రం ఆమెకు ఓటు వేయలేదు. దీంతో వారి మూలంగానే తన భార్య ఓడిపోయిందన్న కోపంతో ప్రేమ్‌లాల్‌ రగిలిపోయాడు. జనవరి 8న బహిర్భూమికని వెళ్లిన బాలికను తన సోదరుల సహకారంతో అపహరించాడు. ఆపై వారంతా కలిసి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడి, ప్రాణాలు తీశారు. చివరకు బాలిక మృత దేహాన్ని సమీపంలోని బ్లెవాన్‌ అటవీ ప్రాంతంలో పడేశారు. 

బాలిక కనిపించకుండా పోయే సరికి ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిచ్చిన సమాచారం మేరకు బాలిక శవాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఆపై నిందితులపై తల్లిదండ్రుల ఫిర్యాదు చేయటంతో వారిని అరెస్ట్‌ చేశారు.

తీవ్ర విమర్శలు... 
నిందితులు రాజకీయంగా కాస్త పలుకుబడి ఉన్నవారు కావటంతో తొలుత కేసు నమోదు చేసుకునేందుకు పోలీసులు తటపటాయించారు. అయితే ప్రతిపక్షాల ఆందోళన, తల్లిదండ్రుల నిరసన ప్రదర్శనతో  పోలీసులపై విమర్శలు గుప్పించారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించి.. తక్షణమే వారిని అరెస్ట్‌ చేయాలని పోలీస్‌ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఎట్టకేలకు నిందితులను అరెస్ట్‌ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. 

ఈ కేసులో ఎలాంటి తమపై ఎలాంటి ఒత్తిళ్లు రాలేదని.. సాక్ష్యాలు సేకరించటంలో జాప్యం మూలంగానే అరెస్ట్‌ ఆలస్యం అయ్యిందని పాకూరు జిల్లా ఎస్పీ శైలేంద్ర బర్న్‌వాల్‌ వెల్లడించటం విశేషం. నిందితులు ప్రేమ్‌లాల్‌, శ్యామూల్‌, కథి, శిశు హం‍దలు నేరాన్ని ఒప్పుకోవటంతో వారిని రిమాండ్‌కు తరలించినట్లు వారు వివరించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top