మైనింగ్‌ మాఫియా సరికొత్త డ్రామా! | Mining mafia new drama! | Sakshi
Sakshi News home page

మైనింగ్‌ మాఫియా సరికొత్త డ్రామా!

Aug 17 2018 2:56 AM | Updated on Aug 31 2018 8:47 PM

Mining mafia new drama! - Sakshi

మిల్లర్లను కలెక్టర్‌ వద్దకు పంపి కలెక్టరేట్‌లో హల్‌చల్‌ చేస్తున్న మైనింగ్‌ మాఫియా సూత్రధారి బుల్లబ్బాయి (సర్కిల్‌లో ఉన్న వ్యక్తి)

సాక్షి, గుంటూరు: అక్రమ మైనింగ్‌కు పాల్పడి తాము తవ్విన తెల్లరాయిని మాత్రమే మిల్లుల్లో దించుకోవాలని గత నాలుగేళ్లుగా భయపెట్టి దౌర్జన్యంగా కోటి టన్నులకు పైగా కొల్లగొట్టిన పల్నాడులోని మైనింగ్‌ మాఫియా కేసు నుండి బయటపడేందుకు ఇప్పుడు కొత్త అంకానికి తెరతీసింది. హైకోర్టు కన్నెర్ర చేయడంతో కేసును పక్కదారి పట్టించేందుకు ఇప్పటివరకూ మిల్లర్లకు నోటీసులు ఇప్పించి వారిని భయాందోళనకు గురిచేసింది. కానీ, కేసు తీవ్రతతో ఇంకా మథనపడుతున్న మాఫియా సూత్రధారులు ఇప్పుడు తాజాగా తాము చెప్పినట్లు చేస్తే మీకు ఇబ్బంది లేకుండా చేస్తామంటూ మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం.. ఎమ్మెల్యే కనుసన్నల్లో మైనింగ్‌ మాఫియా సూత్రధారులు వడ్డవల్లి బుల్లబ్బాయి, ముప్పన వెంకటేశ్వర్లులు పిడుగురాళ్ళ, నడికుడి ప్రాంతాల్లోని మిల్లర్ల యజమానులను దగ్గరుండి కలెక్టరేట్‌కు తీసుకొచ్చి వారిని కలెక్టర్‌ వద్దకు పంపారు. వీరు మాత్రం బయటే ఉండిపోయి కొత్త కథను నడిపించారు.

ఇందులో భాగంగా ముందుగా.. మైనింగ్‌ను నిలిపివేయడంవల్ల కూలీలు ఉపాధి కోల్పోతున్నారని వారితో కలెక్టర్‌కు వినతిపత్రం ఇప్పించారు. పనిలో పనిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల వల్లే తాము, కూలీలు ఇబ్బందులు పడుతున్నామని వారి నోటితో చెప్పించి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అనంతరం వారిని గుంటూరు నగరంలోని ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లి తాము అండగా ఉంటామంటూ మిల్లర్లను మభ్యపెట్టే ప్రయత్నాలు చేశారు. దీంతో.. ఇప్పటికే తమకు మైనింగ్‌ అధికారులు నోటీసులు ఇచ్చారని, మిగతా శాఖలకు చెందిన అధికారులు సైతం నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసిందని, అవైనా తమకు రాకుండా చూడాలంటూ ఎమ్మెల్యేను మిల్లర్లు వేడుకున్నట్లు సమాచారం. అయితే, గతంలో మైనింగ్‌ అధికారులు నోటీసులు ఇవ్వడంలో ఎమ్మెల్యే పాత్ర ఉందని తెలిసినప్పటికీ ఎదురు తిరిగితే కేసుల్లో ఇరికిస్తారనే భయంతో ఇష్టంలేకపోయినా మైనింగ్‌ మాఫియా ఏది చెబితే అది చేయాల్సిన పరిస్థితి మిల్లర్లకు ఏర్పడింది.  ఇదిలా ఉంటే.. నిజంగా ఎమ్మెల్యేకు, మైనింగ్‌ మాఫియాకు తమపై ప్రేమ ఉంటే.. అక్రమ మైనింగ్‌ జరుగుతున్న మూడు క్వారీలను మాత్రమే నిలిపివేయమని హైకోర్టు ఆదేశాలు ఇస్తే, మిగతా క్వారీలను సైతం ఎందుకు మూయించారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కొందరు మిల్లర్లు అంతర్గతంగా చర్చించుకోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement