ప్రాణం తీసిన ఫైనాన్స్‌ దందా

Merchant commit to suicide - Sakshi

వ్యాపారి బలవన్మరణం

అప్పులు ఎగ్గొట్టిన ఖాతాదారులు  

డబ్బుల కోసం వేధించిన భాగస్వాములు

భాగస్వాముల వేధింపులే కారణమని లేఖ

ఫైనాన్స్‌ మోసాలను కళ్లకు కట్టిన ‘నర్సారెడ్డి సూసైడ్‌ నోట్‌’

కామారెడ్డికి చెందిన ఓ ఫైనాన్స్‌ వ్యాపారి నిజాయితీగా వ్యాపారం చేయాలనుకున్నాడు. దెబ్బతిని బుధవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ‘‘ఫైనాన్స్‌ మేనేజర్లు వాళ్ల జీతం కోసం నాలాంటి వాళ్లను బలి చేశారు. నన్ను ఇబ్బంది పెట్టారు. ఆ బాధ భరించలేక చనిపోతున్నాను. నా తల్లిదండ్రులు, భార్యపిల్లలకు దూరమవుతున్నాను’’, ‘‘నాలాంటి అమాయకులు ఫైనాన్స్‌ దందాలో ఇమడలేరు’’ అంటూ లేఖ రాశాడు.

సాక్షి, కామారెడ్డి/కామారెడ్డి క్రైం:   ఫైనాన్స్‌ల ఉచ్చులో పడి వ్యాపారులు, సామాన్య ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్న తరుణంలో పట్టణానికి చెందిన వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.   మాచారెడ్డి మండలం వాడి గ్రామానికి చెందిన నర్సారెడ్డి(41) బతుకుదెరువు కోసం కామారెడ్డి పట్ట ణానికి వలస వచ్చాడు. ఆయనకు భార్య లత, కుమారుడు నిఖిల్, కూతురు నిఖిత ఉన్నారు. పిల్ల లు హైదరాబాద్‌లో ఇంటర్‌ చదువుతున్నారు. ఆయ న కుటుంబం అశోక్‌నగర్‌లో నివసిస్తోంది. నర్సారెడ్డి సుమారు 18 ఏళ్ల క్రితం చిన్నగా ఫైనాన్స్‌ వ్యాపారం మొదలుపెట్టాడు. వ్యాపారంలో కలిసిన స్నేహితులతో పెట్టుబడి పెట్టాడు. ఐదు ఫైనాన్స్‌లలో భాగస్వామిగా ఉన్నాడు. భాగస్వాములతో కలిసి ఒక ఫైనాన్స్‌ను నిర్వహిస్తున్నారు. ఫైనాన్సులో అప్పులు ఇప్పించే విషయంలో అందరూ ఆయనను ఆశ్రయిం చేవారు. నర్సారెడ్డి అమాయకత్వాన్ని ఆసరా చేసుకు ని కొందరు అప్పు తీసుకుని ఎగ్గొట్టారు. కొందరు దివాలా తీశారు. అప్పులు తీసుకున్నవారిలో కొందరు మరణించారు. మధ్యవర్తిగా ఉండి డబ్బులు ఇప్పించిన పాపానికి ఫైనాన్స్‌ మేనేజర్లు ఆయనపై తీవ్రమైన ఒత్తిడి తేవడంతో కొందరి అప్పులు కట్టాడు. 

కామారెడ్డి పట్టణంలో వరుసగా ఫైనాన్స్‌ మేనేజర్లు ఐపీలు పెట్టడం, బిచాణా ఎత్తేసిన సంఘటనలతో వ్యాపారంలో తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. ఇదే సమయంలో నర్సారెడ్డిపై కొందరు ఫైనాన్స్‌ మేనేజర్లు డబ్బుల కోసం తీవ్రంగా ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ వేధింపులు భరించలేని నర్సారెడ్డి.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. బుధవారం రాత్రి సంస్థ కార్యాలయానికి వెళ్లాడు. హైదరాబాద్‌లో చదువుకుంటున్న కుమారుడు నిఖిల్, కూతురు నిఖితలకు ఫోన్‌ చేశాడు. అనంతరం భార్య లతతో మాట్లాడాడు. రెండు పేజీల సూసైడ్‌ నోట్‌ రాసి, తన ఫైనాన్సులోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నర్సారెడ్డి రాత్రి 11 గంటల వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన అతడి భార్య లత.. కాలనీవారిని ఫైనాన్స్‌ కార్యాలయానికి పంపించింది. అక్కడికి వెళ్లినవారికి ఫ్యాన్‌కు వేలాడుతూ నర్సారెడ్డి మృతదేహం కనిపించింది. సంఘటన స్థలంలో సూసైడ్‌ నోట్‌ లభించింది. ఫైనాన్స్‌లో సుమారు కోటి రూపాయల వరకు పెట్టుబడి పెట్టానని, అప్పు తీసుకున్నవారు తిరిగి చెల్లించడం లేదని, డబ్బుల కోసం కామారెడ్డికి చెందిన కొందరు వ్యాపార భాగస్వాములు, నిజామాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి తీవ్రంగా వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తన భర్త మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతుడి భార్య లత పోలీసులను కోరింది.

మేనేజర్ల ఒత్తిడితోనే చనిపోతున్నా..
నర్సారెడ్డి ఆత్మహత్య చేసుకునే ముందు అందుకు గల కారణాలను వివరిస్తూ సూౖసైడ్‌నోట్‌ రాశాడు. పది మంది ఫైనాన్స్‌ మేనేజర్లు డబ్బుల కోసం వేధింపులకు గురిచేసినట్లు పేర్కొన్నాడు. ఫైనాన్స్‌లో బ్యాలెన్స్‌ ఉంటే.. నర్సన్న బ్యాలెన్స్‌ ఉన్నవి అని ఎవరికైనా ఇప్పించాలని అన్నవారే.. ఆ అప్పు తిరిగి రాకపోతే వేధిస్తున్నారని ఆవేదన చెందాడు. ‘‘ఫైనాన్స్‌లో డబ్బులు తీసుకున్నవారిలో కొందరు చనిపోయారు. కొందరు దివాలా తీసి డబ్బులు చెల్లించడం లేదు. ఇంకొందరు బాగానే ఉన్నా డబ్బులు కట్టడం లేదు. అప్పు తీసుకున్నవారికి ఫోన్‌చేస్తే ఇప్పుడు కడ్త అప్పుడు కడ్త అంటరే కాని పైసలు కట్టనే కట్టరు.. కొందరు ఫోనే లావట్టరు.. ఫైనాన్స్‌ మేనేజర్లేమో నన్ను ఇబ్బంది పెట్టారు. ఆ బాధ భరించలేక చనిపోతున్నాను. నా తల్లిదండ్రులు, భార్యపిల్లలకు దూరమవుతున్నాను’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తనలాంటి అమాయకులు ఫైనాన్స్‌ ఫీల్డ్‌లోకి రావద్దని సలహా ఇచ్చాడు. పిల్లలు చదువులో ముందంజలో ఉన్నారని, వారికి సహాయం చేసి బాగా చదివించాలని బంధుమిత్రులను, సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, పోచారం, ఎమ్మెల్యేలు గంప, ఏనుగు, ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీలను వేడుకున్నాడు. ఆయన ఈ వ్యాపారంలో కోటి రూపాయలకుపైగా నష్టపోయినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ ఎస్‌హెచ్‌ఓ శ్రీధర్‌కుమార్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top