అధ్యాపకులే కాలయములు

Medical student suicide because of Professors Molestation Attack - Sakshi

ఎస్వీ మెడికల్‌ కాలేజీ పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్య

చిత్తూరు జిల్లా పీలేరులో ఘటన

బోధించే ప్రొఫెసర్లే లైంగిక వేధింపులకు పాల్పడ్డారు

ఫిర్యాదు చేసిందని కక్షగట్టి పరీక్షల్లో ఫెయిల్‌ చేశారు

మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడిన డాక్టర్‌ శిల్ప

విద్యార్థుల ఆందోళన 

ముగ్గురు ప్రొఫెసర్లపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

హడావుడిగా ఒక ప్రొఫెసర్‌ను సస్పెండ్‌ చేసిన ప్రభుత్వం

సాక్షి, తిరుపతి /పీలేరు: అధ్యాపకులే అపర కీచకుల్లా వ్యవహరించారు. కన్నబిడ్డలా చూసుకోవాల్సిన వైద్య విద్యార్థినిని లైంగికంగా వేధింపులకు గురిచేశారు. వివాహిత కూడా అయిన ఆమె వీరి వేధింపులు భరించలేక గతంలో పలుమార్లు కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. ఆయన పట్టించుకోలేదు. వేధింపులు కొనసాగడంతో గత ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌కు, మంత్రి లోకేశ్‌కు సదరు విద్యార్థిని ఫిర్యాదు చేసింది. దీంతో కక్షగట్టిన ప్రొఫెసర్లు పరీక్షల్లో ఫెయిల్‌ చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై బలవంతంగా తన ప్రాణాలు తీసుకుంది.

విద్యార్థుల కథనం ప్రకారం..  చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన రాజగోపాల్, రాధ దంపతుల మొదటి సంతానం శిల్ప. ఐదేళ్ల క్రితం శిల్పకు రూపేష్‌ కుమార్‌తో ప్రేమ వివాహం జరిగింది. శిల్ప ప్రస్తుతం తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాలలో పీడీయాట్రిక్‌ విభాగంలో పీజీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. మెడికల్‌ కళాశాల ప్రొఫెసర్లు అయిన రవికుమార్, శశికుమార్, కిరీటి తనను లైంగికంగా వేధిస్తున్నట్టు ఆమె గతంలో పలుమార్లు కళాశాల ప్రిన్సిపల్‌ రమణయ్యకు ఫిర్యాదు చేసింది. ప్రిన్సిపల్‌ వైపు నుంచి ఎటువంటి స్పందన లేకపోవటంతో గత ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్, మంత్రి నారా లోకేశ్‌కు ఈ మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేసింది.

స్పందించని మంత్రి... విచారణకు ఆదేశించిన గవర్నర్‌
శిల్ప ఫిర్యాదుపై మంత్రి లోకేశ్‌ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. గవర్నర్‌ నరసింహన్‌ మాత్రం స్పందించి, ఫిర్యాదుపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వీసీని ఆదేశించారు. వీసీ ఆ ఫిర్యాదును ఎస్వీ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌కు పంపారు. డిపార్ట్‌మెంట్‌ వారితో విచారణకు ఓ కమిటీని నియమించిన ప్రిన్సిపల్‌.. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేశారు. ఈ నేపథ్యంలో శిల్ప ఆరోపించినట్లుగా ఏమీ జరగలేదంటూ కళాశాలలో ప్రచారం జరిగింది. దీంతో శిల్ప డిపార్ట్‌మెంట్‌తో సంబంధం లేని అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్‌ ప్రద్యుమ్న తిరుపతి సబ్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఆ కమిటీ నివేదిక ఇప్పటికీ వెలువడలేదు. ఇంతలో ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు జరిగాయి. ఆ పరీక్షల్లో శిల్ప థియరీలో పాసై ప్రాక్టికల్స్‌లో ఫెయిల్‌ అయ్యింది. 

ఆత్మహత్య చేసుకున్న శిల్ప
ఈ నేపథ్యంలో.. చిత్తూరు జిల్లా పీలేరులోని జాగృతి అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్న శిల్ప సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. భర్త రూపేష్‌కుమార్‌ తన వైద్యశాల నుంచి మంగళవారం ఉదయం నివాసానికి చేరుకున్నారు. ఎంత పిలిచినా భార్య స్పందించకపోవడంతో తలుపు పగలగొట్టి చూశారు. శిల్ప ఫ్యానుకు ఉరివేసుకుని కన్పించింది. విషయం తెలుసుకున్న సహచర జూనియర్‌ డాక్టర్లు కళాశాలలో విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. శిల్ప ఆత్మహత్యకు కారణమైన వారందరిపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు శిల్ప ఆత్మహత్యకు ప్రొఫెసర్లు రవికుమార్, శశికుమార్, కిరీటే కారణమంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థుల ఆందోళన అంతకంతకూ తీవ్రం కావడం, పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్య వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో.. ప్రొఫెసర్‌ రవికుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ బాబ్జి ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ఆదేశాల మేరకు బుధవారం తిరుపతిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వనున్నట్టు తెలిపారు. అదే విధంగా శిల్ప ఆత్మహత్యపై తనతో సహా ముగ్గురితో మరోసారి కమిటీని ఏర్పాటు చేశారు.

అయినా శాంతించని విద్యార్థులు శిల్ప ఆత్మహత్యకు కారణమైన వారినందరిపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ డిమాండ్‌ చేశారు. విద్యార్థిని చనిపోతే తప్ప స్పందించరా? అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే శిల్ప చనిపోయి ఉండేది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వేధింపులు ఒక్క శిల్పకే కాదని, అన్ని విభాగాల్లో విద్యార్థినులు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామంటూ రాత్రి కూడా కళాశాలలోనే బైఠాయించారు. 

కేసు సీఐడీకి 
జూనియర్‌ డాక్టర్‌ శిల్ప ఆత్మహత్యపై పీలేరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు ( క్రైమ్‌ నంబర్‌ 101/18) నమోదు చేసినట్టు డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ తెలిపారు. ఈ కేసును సీఐడీకి అప్పగిస్తూ డీజీపీ మంగళవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు.

ప్రభుత్వమే బాధ్యత వహించాలి: ఎమ్మెల్యే ఆర్‌కే రోజా
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా విమర్శించారు. ఆమె మరణానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, డాక్టర్‌ కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. డాక్టర్‌ శిల్ప మృతదేహం వద్ద పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలసి రోజా నివాళులర్పించారు. ముగ్గురు ప్రొఫెసర్లను 24 గంటలలోపు అరెస్ట్‌ చేíసి రిమాండ్‌కు తరలించాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు, విద్యార్థులతో ఉద్యమిస్తామని హెచ్చరించారు. జిల్లాలోని ఐదుమంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేల బృందం త్వరలోనే గవర్నర్‌ను కలసి శిల్ప ఆత్మహత్యపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు.     

చాలా విభాగాల్లో ఇదే పరిస్థితి
డాక్టర్‌ శిల్ప ఫిర్యాదు చేసినా సకాలంలో బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. ఇలాంటి వేధింపులు చాలా విభాగాల్లో ఉన్నాయి. భవిష్యత్‌లో ఇలాంటి వేధింపులు జరగకుండా చర్యలు తీసుకోవాలి.                    
– డాక్టర్‌ వెంకట రమణ, జూడా అసోసియేషన్‌ అధ్యక్షుడు

కారకులను కఠినంగా శిక్షించాలి
నాన్‌ డిపార్ట్‌మెంటల్‌ కమిటీ నివేదికను బయట పెట్టాలి. కారకులకు కఠిన శిక్ష పడాలి. అన్ని విభాగాల్లో పీజీ, యూజీ విద్యార్థులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు.
– డాక్టర్‌ మౌర్య, పీజీ విద్యార్థి

అత్యవసర విధులు బహిష్కరణ
శిల్ప మరణానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే వరకు అత్యవసర విధులు కూడా బహిష్కరిస్తున్నాం. కళాశాలలో విద్యార్థినులకు రక్షణ కావాలి. మాకు న్యాయం జరిగే వరకు పోరాడతాం.          
– డాక్టర్‌ లావణ్య, పీజీ విద్యార్థిని

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top