ఇన్‌ఫార్మర్‌ నెపంతో రైతు హత్య

Maoists Killed Farmer Over Informar - Sakshi

జయపురం: నవరంగపూర్‌ జిల్లాలోని రాయిఘర్‌ సమితిలో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. పోలీసు ఇన్‌ఫార్మర్‌ నెపంతో ఓ రైతు ప్రాణాలను బలితీసుకున్నారు. రాయిఘర్‌ సమితిలోని హొలాబీ గ్రామ పంచాయతీ మారుమూల దుర్గమ ప్రాంతం బెనసర్‌ గ్రామానికి చెందిన రైతు అనంతరామ్‌ గోండ్‌ ఉరఫ్‌ టును గోండ్‌ను మంగళవారం రాత్రి గ్రామం మధ్యలో గల అంగన్‌వాడీ కేంద్రం వద్ద మావోయిస్టులు బంధించి తపాకీతో కాల్చి చంపారు. ఈ వార్త అన్ని ప్రాంతాలకు వ్యాపించడంతో ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. ఈ సఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మావోయిస్తులు గతంలో అనంతరామ్‌కు ఒక లేఖ రాసి పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా ఉన్నావు వెంటనే అ పని మానుకోమని  హెచ్చరించినట్లు తెలుస్తోంది. అనంతరామ్‌ను హత్య చేసిన ప్రాంతంలో వారు మావోయిస్టులు ఓ లేఖను విడిచి పెట్టారు.  

భారతీయ కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఇందగాం ఒరియా కమిటీ పేరుతో హిందీలో ఉన్న ఆ లేఖలో మావోయిస్టులను అంతమొందించేందుకు అనంతరామ్‌ పోలీసులతో కలిసి పనిచేస్తున్నాడని ఆరోపించారు. మావోయిస్టులు అడుగుజాడలపైన,   కదలికలపైన కన్ను ఉంచిన నవరంగపూర్‌ ఎస్‌పీతో రైతు అనతరామ కాంటాక్ట్‌లో ఉన్నాడని మావోయిస్టులు ఆరోపించారు. 2015వ సంవత్సరం నుంచి ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తున్నాడని అనేక పర్యాయాలు నచ్చచెప్పినప్పటికీ  మారక పోవడంతో మరణదండన విధించామని లేఖలో వెల్లడించారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ముగ్గురు మావోయిస్టులు తుపాకులు, గొడ్డళ్లతో గ్రామానికి వచ్చి అనంతరామ్‌  ఇంటికి వెళ్లి బయటకు రావాలని పిలిచారు. ఛత్తీస్‌గఢ్‌ భాషలో వారు అనంతరామ్‌ను, అతని  తండ్రిని  దుర్భాషలాడారు. అనంతరామ్‌ ఇంటినుంచి బయటకు రాగా తమ వెంట ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారు. అలా కొంత దూరం వెళ్లిన తరువాత తుపాకులు పేలిన శబ్దం వచ్చిందని గ్రామస్తులు వెల్లడిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top