మళ్లీ అదే తీరు

Maniac young man hulchul in badvel

ఉన్మాదిగా ప్రవర్తిస్తున్న యువకుడు

పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళలు

వైఎస్‌ఆర్‌ జిల్లా , బద్వేలు అర్బన్‌ : స్థానిక సిద్దవటం రోడ్డులోని సుమిత్రానగర్‌లో ఓ యువకుడు ఉన్మాదిగా ప్రవర్తిస్తుండటంతో మహిళలు బెంబేలెత్తుతున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంతానికి చెందిన మహిళలు ఆదివారం స్థానిక అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. కొంత కాలంగా నాగరాజు అనే వ్యక్తి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. గత నెలలో రమణమ్మపై లైంగిక వేధింపులకు పాల్పడి దాడికి యత్నించడంతో.. సదరు మహిళతోపాటు స్థానిక మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌కు పంపారు.

అనంతరం కొన్ని రోజుల క్రితం బెయిల్‌పై వచ్చిన ఆ యువకుడు ఆదివారం రాత్రి గతంలో ఫిర్యాదు చేసిన మహిళతోపాటు రేణుక, కళావతిపై దాడి చేశాడు. ‘నా పైనే ఫిర్యాదు చేస్తారా, మీ అంతు చూస్తా’ అంటూ వీరంగం సృష్టించినట్లు మహిళలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అతని ప్రవర్తన వలన ఒంటరిగా తిరగలేకున్నామని, గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా మళ్లీ అదే విధంగా వ్యవహరిస్తున్నాడని మహిళలు వాపోతున్నారు.

పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళలు
(ఇన్‌సెట్‌) ఉన్మాదిగా ప్రవర్తిస్తున్న నాగరాజు (ఫైల్‌)

Back to Top