ప్రాణం తీసిన పొగమంచు

Man Died in Car Accident Guntur - Sakshi

కంచికచర్లలో రోడ్డు రోలర్‌ను     ఢీకొన్న కారు

ఒకరు మృతి, 11 మందికి తీవ్ర గాయాలు

క్యాటరింగ్‌ కోసం వస్తున్న హైదరాబాద్‌ వాసులు

గుంటూరు, కంచికచర్ల (నందిగామ) : పొగమంచు దట్టంగా వ్యాపించడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, 11 మంది గాయాలపాలైన ఘటన కంచికచర్లలో గురువారం తెల్లవారుజామున జరిగింది. వివరాలిలా ఉన్నాయి. హైద్రాబాద్‌లోని మాదాపూర్‌కు చెందిన 9 ఈవెంట్స్‌ ఆర్గనైజేషన్‌కు చెందిన 12మంది కాకినాడలో జరిగే ఓ ఫంక్షన్‌లో క్యాటరింగ్‌ చేసేందుకు కారులో హైద్రాబాద్‌ నుంచి రాత్రి 2.30గంటలకు బయలుదేరారు. వీరిలో ఎక్కువ మంది ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఖాళీ సమయాల్లో క్యాటరింగ్‌ పనులకు వెళ్తుంటారు. వీరు ప్రయాణించే కారు కంచికచర్ల కంచలమ్మ చెరువు కట్టపైకి రాగానే ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొని, ఆ తర్వాత అదే రూట్‌లో ముందున్న రోడ్డు రోలర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయ్యింది. అయితే తెల్లవారుజాము కావటంతో రోడ్డుపై దట్టంగా పొగమంచు అలుముకుని ఉంది. దీంతో ముందు వెళ్తున్న వాహనాలు సక్రమంగా కనిపించకపోవటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ఘటనలో తటకంటి గణేష్‌ (25) అనే వ్యక్తి దుర్మరణంపాలయ్యాడు. అతనికి రెండేళ్ల క్రితమే వివాహం జరిగింది. భార్యతో సహా క్యాటరింగ్‌ పనులకు వెళ్తున్నాడు. ఈ ప్రమాదంలో ఆమెకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. భర్త గణేష్‌ మృతదేహాన్ని చూసి ఉమామహేశ్వరి బోరున విలపించింది. కారులో ఉన్న డ్రైవర్‌తోపాటు మరో 10మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో అద్దరపు నాగరాజు, తడకంటి ఉమామహేశ్వరి, అద్దరపు లక్ష్మి, జూపూడి భార్గవి, కే పూజ, గర్రె మహేష్, గర్రె సంధ్య, వాంకుడోత్‌ సంగీత, కోడూరు మధుసూదనరెడ్డి, కొలిమి మహేష్, మహ్మద్‌ అజీమ్‌ ఉన్నారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న కంచికచర్ల 108 అంబులెన్స్‌ వాహన సిబ్బంది, నేషనల్‌ హైవే అంబులెన్స్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నందిగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ దాడి చంద్రశేఖర్‌ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా, పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. అంతేకాకుండా కారు డ్రైవర్‌ కూడా నిద్రమత్తులోకి జారుకున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top