వంతెన పైనుంచి లారీ బోల్తా | Lorry Roll Overed and Driver Injured | Sakshi
Sakshi News home page

వంతెన పైనుంచి లారీ బోల్తా

Mar 30 2018 11:30 AM | Updated on Apr 3 2019 8:03 PM

Lorry Roll Overed and Driver Injured - Sakshi

ప్రమాదంలో గాయపడిన డ్రైవర్, బ్రిడ్జి పైనుంచి బోల్తాపడిన లారీ

బుచ్చెయ్యపేట(చోడవరం): మండలంలో  విజయరామరాజుపేట గ్రామం వద్ద తాచేరు వంతెన పైనుంచి ఓ చెరుకు లారీ గురువారం బోల్తా పడింది. ఈ  ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ నుంచి రోలుగుంట చెరుకు కాటాకు వెళ్తున్న లారీ విజయరామరాజుపేట వద్ద తాచేరు వంతెనపై ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి వంతెన రక్షణ గోడను ఢీకొని కిందకు పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ గణేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. 30 అడుగుల కిందకు లారీ పడడంతో  పెద్ద శబ్దం వచ్చింది.  

బాంబు పేలిందేమోనని విజయరామరాజు పేట, వడ్డాది గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. ఈ సమయంలో అటుగా  వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గాయపడిన డ్రైవర్‌ను స్థానికులు 108లో చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా వంతెనపై వాహనాల రాకపోకలు నిలిచిపోయి, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఎస్‌ఐ కృష్ణారావు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.వంతెన పూర్తిగా శిథిలమై, ఇప్పటికే 50 శాతం మేర రక్షణ గోడ దెబ్బతింది. ప్రమాదం కారణంగా మిగిలిన గోడ పడిపోయింది. దీంతో వంతెనపై ప్రయాణించేందుకు వాహన చోదకులు భయాందోళన చెందుతున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి రక్షణగోడ నిర్మించాలని పలు గ్రామాల ప్రయాణికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement