న్యాయవాది అనుమానాస్పద మృతి

lawyer Suspicious death in Prakasam - Sakshi

ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా మృతదేహం గుర్తింపు

సంఘటన స్థలంలో గుళికలు కలిపిన వాటర్‌ బాటిల్‌

నరసింహం మృతిపై సహచర న్యాయవాదుల విస్మయం

సింగరాయకొండ: కందుకూరుకు చెందిన ప్రముఖ న్యాయవాది బలుసు వెంకట నరసింహం (51) అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ సంఘటన పాకల రోడ్డులోని పీబీ చానల్‌ సమీపం సోమరాజుపల్లి పంచాయతీ పొలాల్లో బుధవారం సాయంత్రం జరగగా గురువారం వెలుగులోకి వచ్చింది. అందిన వివరాల ప్రకారం.. వలేటివారిపాలెం మండలం కొండసముద్రానికి చెందిన నరసింహం వృత్తిరీత్యా న్యాయవాది. కుటుంబ సభ్యులతో కలిసి కందుకూరులో నివాసం ఉంటున్నాడు. బుధవారం ఉదయం 9.30 గంటల సమయంలో నరసింహం మోటారు సైకిల్‌పై ఇంటి నుంచి బయటకు వచ్చాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో పాటు ఫోన్‌ కూడా చేయలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆయనకు ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ వచ్చింది. వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించి కందుకూరులోని సీసీ పుటేజీని పరిశీలించారు. ఇంటి నుంచి బయల్దేరిన నరసింహం ఊరు చివరన ఉన్న రమణారెడ్డి పెట్రోల్‌ బంకు దాటడం గమనించారు. ఆ తర్వాత అతని ఫోన్‌ను ట్రాకింగ్‌ పద్ధతి ప్రకారం ట్రేస్‌ చేయగా లాస్ట్‌ సిగ్నల్‌ పాకల రోడ్డులో గుర్తించారు. చీకటి కారణంగా ఆ ప్రాంతంలో ఎక్కడ వెతికినా ఆచూకీ దొరకలేదు. మళ్లీ గురువారం ఉదయం ఆచూకీ  కోసం ప్రయత్నించగా పాకల రోడ్డు నుంచి సోమరాజుపల్లి వెళ్లే రోడ్డు పీబీ చానల్‌ పక్కన మోటార్‌ సైకిల్‌ ఉండటాన్ని గమనించారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలోని పొలాల్లో వెతగ్గా వేపచెట్టు కింద నరసింహం మృతదేహం ఉంది. పక్కనే ఓ వాటర్‌ బాటిల్, చెప్పులు ఉన్నాయి. బాటిల్లో సగం తాగిన బ్లూ కలర్‌ గుర్తుతెలియని ద్రవ పదార్థం ఉంది. సెల్‌ఫోన్‌ మాత్రం కనిపించలేదు.

పోలీసుల తీరుపై న్యాయవాదుల ఆగ్రహం
విషయం తెలిసి కందుకూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సన్నెబోయిన శ్రీనివాసులు, సహచర లాయర్లు సంఘటన స్థలానికి చేరుకుని నరసింహం మృతదేహాన్ని చూసి విచారం వ్యక్తం చేశారు. సీపీఐ జిల్లా నాయకురాలు, మృతుడి బంధువైన లాయర్‌ అరుణ కూడా వచ్చి నరసింహం మృతి విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు మాత్రమే తాము సంఘటన స్థలానికి వస్తామని పోలీసులు పేర్కొనడంతో న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత వీఆర్వో శివశంకర్‌ ఆ గ్రామ వీఆర్‌ఏ సింహాద్రిని పంపించడంతో పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి శవపంచనామా నిర్వహించారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కందుకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదు
న్యాయవాది నరసింహం ఆత్మహత్యకు కారణాలు తెలియ రావడం లేదు. ఆయన ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడతాడని, ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని సహచర న్యాయవాదులు పేర్కొంటున్నారు. తన తండ్రి మృతి తమను విస్మయానికి గురి చేస్తోందని, ఆయన మృతికి కారణాలు తెలియదని చిన్న కుమారుడు వినయ్‌ చౌదరి తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రైటర్‌ శేషు వివరించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top