వైద్య ఉద్యోగి కిడ్నాప్‌ కలకలం

Lab Technician Kidnap in East Godavari - Sakshi

వైద్య సంఘాల నాయకులు, సిబ్బంది ఆందోళన

వెంటనే ఆచూకీ తెలపాలంటూ ఆసుపత్రి ముందు ధర్నా

తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: వైద్య విధాన పరిషత్‌ జిల్లా ఆసుపత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ గుత్తుల వెంకట సుబ్బారావు (సుభాష్‌) కిడ్నాప్‌ సంఘటన కలకలం రేపింది. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్‌ ఉద్యోగి(ల్యాబ్‌లో టెక్నీషియన్‌)గా పనిచేస్తున్న  గుత్తుల వెంకట సుబ్బారావు మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. తన కోసం నలుగురు వ్యక్తులు కారులో రావడంతో ఆసుపత్రి ఆవరణలో వారితో మాట్లాడి, అనంతరం 2.45 సమయంలో అదే కారులో వెళ్లారు. ఆసుపత్రి గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు కారు నంబర్‌ టీసీ 12 ఈజీ 6730 గా రికార్డులో నమోదు చేశాడు. అప్పటి నుంచి సుబ్బారావు సెల్‌ఫోన్‌ పని చేయకపోవడంతో భార్య శ్రీదేవి మంగళవారం రాత్రి త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుభాష్‌ను కారులో తీసుకు వెళ్లడం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పుటేజీలో నమోదైంది. సెక్యూరిటీ గార్డు నమోదు చేసి కారు నెంబర్‌ ట్రేస్‌ అవుట్‌ కాకపోవడం, సెల్‌ఫోన్‌ పని చేయకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

కారణమేంటో..
సుభాష్‌ కిడ్నాప్‌ వ్యవహారంపై ఆసుపత్రి వర్గాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. సుభాష్‌కు అప్పులు ఎక్కువగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో అప్పులు తీర్చలేనందుకు, అప్పులు ఇచ్చిన వారు ఎవరైనా కిడ్నాప్‌ చేశారా? లేక ప్రస్తుతం క్రికెట్‌ బెట్టింగ్‌లు జరుగుతున్న దృష్ట్యా బెట్టింగ్‌ ముఠాలు వారు ఎవరైనా కిడ్నాప్‌ చేశారా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సుభాష్‌ను కారులో తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరా పుటేజీలో రికార్డు అయినా కారు నంబర్‌ గానీ, తీసుకువెళ్లిన వ్యక్తులు గానీ స్పష్టంగా కనిపించకపోవడం పోలీసులకు సవాల్‌ గా మారింది. సుభాష్‌కు ఎవరితోనూ గోడవలు లేవని సహ ఉద్యోగులు పేర్కొంటున్నారు.

ఆచూకీ తెలపాలంటూ ఆందోళన
ల్యాబ్‌ టెక్నీషియన్‌ సుభాష్‌ ఆచూకీ తెలపాలంటూ భార్య శ్రీదేవి, తన ఇద్దరు పిల్లలతో బుధవారం సాయంత్రం ఆసుపత్రి ముందు ఆందోళన చేసింది. ఈ ధర్నాకు ఆసుపత్రి వైద్య సంఘాల నాయకులు మద్దతు పలికారు. వెంటనే సుభాష్‌ ఆచూకీ తెలియజేయాలని, కిడ్నాప్‌ చేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top