న్యాయవాది దారుణ హత్య

Kurnool Lawyer Murder In Rangareddy - Sakshi

 సాక్షి, తాండూరు టౌన్‌ (రంగారెడ్డి): గుర్తు తెలియని వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున తాండూరు రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాండూరు రైల్వే స్టేషన్‌ రెండో ఫ్లాట్‌ఫాంపై హత్యకు గురైన ఓ వృద్ధుడి మృతదేహాన్ని సోమవారం ఉదయం పోలీసులు గుర్తించారు. మృతుడు 70 ఏళ్ల వయసు, ముస్లిం మతానికి చెందిన వాడు. మృతుడి గొంతుకోసి, కడుపులో పలు చోట్లు కత్తిపోట్ల వల్ల చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అతని దగ్గర దొరికిన విజిటింగ్‌ కార్డు ఆధారంగా హతుడు కర్నూలు జిల్లాకు చెందిన ఓ న్యాయవాదిగా గుర్తించారు. కార్డు వెనుక ఉన్న రెండు ఫోన్‌ నంబర్లకు రైల్వే పోలీసులు ఫోన్‌ చేయగా ఓర్వకల్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌ నంబర్‌గా గుర్తించారు.

అతడికి మృతుడి ఫొటో, విజిటింగ్‌ కార్డును వాట్సాప్‌ ద్వారా పంపించారు. అయితే మృతుడు తనకు తెలియదని, విజిటింగ్‌ కార్డుపై ఉన్న రాతను బట్టి అది బనగానపల్లికి చెందిన రాజేష్‌ అనే ఓ నేరస్థుడిదని చెప్పారు. రాజేష్‌ రెండు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, అతడిని కోర్టుకు తరచూ తరలిస్తుండే తరుణంలో తన ఫోన్‌ నంబర్‌ విజిటింగ్‌ కార్డుపై రాసుకున్నట్లు కానిస్టేబుల్‌ చెప్పాడు. రాజేష్‌ మానసికస్థితి సరిగా ఉండదని, గతంలో ఇదే తరహాలో రెండు హత్యలు చేశాడని చెప్పాడు. కానిస్టేబుల్‌ సమాచారం మేరకు రాజేష్‌ నంబర్‌కు  ఫోన్‌ చేయగా వరంగల్‌ ప్రాంతంలో సంచరిస్తున్నట్లుగా సెల్‌ టవర్‌ సిగ్నల్‌ చూపిస్తుందని సికింద్రాబాద్‌ రూరల్‌ రైల్వే డీఎస్పీ శ్రీనివాస్‌రావు తెలిపారు. వెంటనే రెండు టీంలను రాజేష్‌ కోసం పంపినట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top