డెత్‌ మిస్టరీ

Inter Student Death Mystery in Prakasam - Sakshi

 అదృశ్యమైన ఇంటర్‌ విద్యార్థి సజీవ దహనం

తాను చదువుతున్న కాలేజీ సమీపం లోనే ఘటన

ఒంగోలు: నగర శివారు పేర్నమిట్ట శ్రీ ప్రతిభ కాలేజీ వద్ద గురువారం అర్ధరాత్రి 16 ఏళ్ల ఇంటర్‌ విద్యార్థి సజీవ దహనం మిస్టరీగా మారింది. కాలేజీ నుంచి అదృశ్యమై 24 గంటలు గడవక ముందే కాలేజీకి పట్టుమని పది అడుగుల దూరంలో గేటుకు ఆవలి వైపు మృతి చెంది కనిపించడం కలకలం రేపుతోంది. కొద్దిసేపు మృతదేహాన్ని గుర్తించలేని తల్లి రాత్రికి బంధువులతో కలిసి వచ్చి మృతదేహం తమ కుమారుడిదేనంటూ నిర్థారించింది. వివరాలు.. కనుమర్ల సుబ్బలక్షమ్మ స్వగ్రామం అర్ధవీడు మండలం నాగులవరం. భర్త 12 ఏళ్లు క్రితం అనారోగ్యంతో కన్నుమూశాడు. అప్పటి నుంచి పిల్లలను చదివించుకుంటోంది. పెద్ద కుమారుడు రాజారెడ్డిని, చిన్న కుమారుడు రాహుల్‌రెడ్డిని ప్రతిభ విద్యా సంస్థల్లో చేర్పించింది. రాజారెడ్డి జూనియర్‌ ఇంటర్‌ ఎంపీసీ చదువుతుండగా చిన్న కుమారుడు 8వ తరగతి చదువుతున్నాడు. ప్రోకబడ్డీ వంటి వాటిపై కాలేజీలో చిన్న చిన్న బెట్టింగులు పెట్టుకుంటూ డబ్బులు పోగొట్టుకొని రాజారెడ్డి తన తమ్ముడి నుంచి 50 రూపాయలు తీసుకొని కాలేజీ నుంచి అదృశ్యమయ్యాడు. గతంలో కూడా కాలేజీ నుంచి అదృశ్యమై తర్వాత తిరిగి వచ్చే వాడు.

మంటలు రావడంతో ఆందోళన
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ప్రతిభ కాలేజీలో విద్యార్థులు డ్యాన్స్‌లు నేర్చుకుంటున్నారు. అర్ధరాత్రి దాటినా విద్యార్థులు డ్యాన్స్‌లు వేస్తుండటంతో ఇన్‌చార్జి బాధ్యతలు పర్యవేక్షిస్తున్న జూనియర్‌ లెక్చరర్‌ సుబ్బారెడ్డి ఇక పడుకోండంటూ విద్యార్థులకు హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో కాలేజీ ప్రహరీ అవతలి వైపు పొలంలో మంటలు కనిపించాయి. ఏదో తగలబడుతోందని భావించిన విద్యార్థులు, లెక్చరర్లు అక్కడకు పరుగున చేరుకున్నారు. గేటు వేసి ఉండటంతో గేటుకు ఉన్న రంధ్రం నుంచి పరిశీలించారు. బయట ఓ యువకుడు తగలబడుతున్నట్లు గుర్తించారు. గేటు తాళం బలవంతంగా తెరిచి నీటితో విద్యార్థులు మంటలు ఆర్పేశారు. కానీ మృతుడు ఎవరనేది విద్యార్థులు గుర్తించలేకపోయారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని రిమ్స్‌ మార్చురీకి తరలించి ఇన్‌చార్జి బాధ్యతలు పర్యవేక్షిస్తున్న సుబ్బారెడ్డి నుంచి ఫిర్యాదు స్వీకరించారు.

విచారణపై ప్రత్యేక దృష్టి
విషయం తెలియగానే ఎస్పీ సత్యఏసుబాబు పోలీసు అధికారులను పరుగులెత్తించారు. ట్రైనీ ఎస్పీ బిందు మాధవ్, టౌన్‌ డీఎస్పీ రాథేష్‌ మురళి, సీసీఎస్‌ డీఎస్పీ కేశన వెంకటేశ్వరరావు, తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లుతో పాటు డాగ్‌ స్క్వాడ్, వేలిముద్రల నిపుణులు రంగ ప్రవేశం చేశారు. కాలేజీ ఆవరణ నుంచి విద్యార్థులు పారిపోయేందుకు అవకాశం ఉన్న రెండు ప్రాంతాలను గుర్తించారు. అందులో ఒకటి ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతం. పోలీసు జాగిలం కాలేజీలోని వంటగది తదితరాలను పరిశీలించింది. వేలిముద్రల నిపుణులు ఘటన స్థలంలోని మట్టి నమూనాలు, వెంట్రుకలు సీజ్‌ చేశారు. అనంతరం కాలేజీ సిబ్బంది, విద్యార్థులను విచారించి కాలేజీ నుంచి గురువారం ఉదయం అదృశ్యమైన రాజారెడ్డి ఆచూకీ కోసం సీసీ టీవీ పుటేజిని పరిశీలించారు. బుధవారం రాత్రి  తమ్ముడు నుంచి రూ.50లు తీసుకున్న తర్వాత నుంచి అదృశ్యమైనట్లు నిర్థారణకు వచ్చారు. గురువారం కర్నూల్‌ రోడ్డులోని అన్నా క్యాంటీన్‌లో కూడా భోజనం చేసినట్లు నిర్థారించుకున్నారు. రాత్రికి సమతానగర్‌ వద్ద ఒక పెట్రోలు బంకులో ఒక యువకుడు అరలీటరు పెట్రోలును ఒక థమ్సప్‌ బాటిల్‌లో కొట్టించుకున్నట్లు గుర్తించి పెట్రోలు బంకులో సీసీ పుటేజి పరిశీలనలో నిమగ్నమయ్యారు.

వ్యక్తమవుతున్న అనుమానాలు
రాజారెడ్డి వ్యవహారంలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా ఘటన స్థలిని పరిశీలిస్తే ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే మంటల ధాటికి పరుగులు పెడతారు. ఎక్కడా పరిగెత్తిన ఆనవాళ్లు లేవు. ఒకచోట మాత్రమే తగలబడినట్లు ఉండటంతో ఎవరైనా చంపి తీసుకొచ్చి కాలేజీ వద్ద పడేశారా..అనే అనుమానం వ్యక్తం అవుతోంది. దానికితోడు కాలేజీ వరకు వచ్చిన విద్యార్థి అక్కడ తగలబెట్టుకోవాల్సిన అవసరం ఏమిటనేది అంతుబట్టడంలేదు. ఇది కాకుండా కాలేజీలో విద్యార్థుల మధ్య ఏదైనా వివాదం చోటుచేసుకొని అందులోకి ప్రైవేటు వ్యక్తులు రంగంలోకి దిగారా అనే అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. విద్యార్థులను ఎంత తరచి ప్రశ్నించినా వివాదం వంటి అంశాలు ఎక్కడా వెలుగులోకి రాలేదు. మరో వైపు పేర్నమిట్ట శ్రీచైతన్య కాలేజీ సమీపంలో గురువారం రాత్రి 11 నుంచి 11.30 గంటల సమయంలో ఒక కారు, నాలుగు బైకులపై ఉన్న ఏడెనిమిది మంది వ్యక్తుల మధ్య వివాదం జరిగిందని ప్రచారం జరుగుతోంది. దాని ప్రభావం ఏమైనా ఈ అంశంలో చోటుచేసుకుందా అనే మరో అనుమానం కూడా వ్యక్తం అవుతోంది.

పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గురువారం రాత్రి ముగ్గురు విద్యార్థులతో కలిసి రాజారెడ్డి మొదటి ఆట సినిమాకు వెళ్లినట్లు తెలుస్తోంది. అనంతరం వారిలో ఒకరితో కలిసి సెకండ్‌ షో సినిమాకూ వెళ్లాడు. ఆ తర్వాత బస్టాండ్‌కు వెళ్లి ఇద్దరూ విడిపోయినట్లు సమాచారం. ఆ తర్వాత అక్కడ నుంచి ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top