Sakshi News home page

కొనసాగుతున్న విచారణ

Published Wed, Feb 19 2020 10:26 AM

InquirySpeed Up in MLA Manohar Reddy Sister Radha Family - Sakshi

కరీంనగర్‌క్రైం/తిమ్మాపూర్‌(మానకొండూర్‌): పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి బావ సత్యనారాయణరెడ్డి, చెల్లి రాధ, మేన కోడలు వినయశ్రీ కారుతో సహా అల్గునూర్‌ శివారులో కాకతీయ కాలువలో పడి మృతి చెందిన ఘటనపై విచారణ కొనసాగుతోంది. సత్యనారయణరెడ్డి కారు ఏ తేదీన, ఏ సమయంలో పడిందన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ఈమేరకు సీపీ కెమెరాల ఫుటేజీలను మంగళవారం పరిశీలించారు. సత్యనారాయణరెడ్డి ఒక్కడే జనవరి 26న హైదరాబాద్‌ వెళ్లొచ్చినట్లు తిమ్మాపూర్‌ మండలం రేణికుంట వద్ద రాజీవ్‌ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజా వద్ద సీసీ కెమెరాల్లో నమోదైనట్లు గుర్తించారు. జనవరి 26వ తేదీఉదయం 11.44 గంటలకు రేణిగుంట టోల్‌ప్లాజా నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లాడని... తిరిగి సాయంత్రం 8.15 గంటలకు  కరీంనగర్‌ వైపు వచ్చాడని గుర్తించారు. ఈమేరకు సీసీ ఫుటేజీలు స్వీకరించినట్లు ఎల్‌ఎండీ ఎస్సై నరేశ్‌రెడ్డి వెల్లడించారు. కాలువలో పడిన కారు ఫిట్‌నెస్‌ రిపోర్టు కోసం  రవాణాశాఖ అధికారులను సంప్రదించామని తెలిపారు. వాహనానికి సంబంధించి ఏదైనా తప్పిదంతో ప్రమాదవశాత్తు కాలువలో పడిందా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నామన్నారు. రవాణాశాఖ అధికారుల నుంచి వాహనం కండీషన్‌ రిపోర్ట్‌ వస్తే మరిన్ని  వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు.

27న కరీంనగర్‌లోనే..
 కరీంనగర్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు దృశ్యాల ప్రకారం జనవరి 27న సాయంత్రం వరకు నారాయణరెడ్డి కారు పలు ప్రాంతాల్లో కనిపించినట్లు సమాచారం. దీంతో కరీంనగర్‌ బ్యాంకు కాలనీలోని ఇంటి నుంచి తిమ్మాపూర్‌ మండలం అల్గునూర్‌ శివారులోని కాకతీయ కాలువ వరకూ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

నమోదుకాని దృశ్యాలు..
సత్యనారాయణరెడ్డి కుటుంబంతో సహా 27వ తేదీ సాయంత్రం బయల్దేరినట్లు అతడి షాపులో పనిచేసే వ్యక్తి తెలిపాడు. దీంతో పోలీసులు 27 తేదీన అల్గునూర్‌లో సీసీ కెమెరాలను పరిశీలించారు. ఉదయం నుంచి రాత్రి వరకు కారు అటుగా వచ్చినట్లు కనిపించలేదని తెలిసింది. రాత్రి నమోదైన దృశ్యాల్లో వాహనాల నంబర్లు సరిగా కనిపించకపోవడంతో మరింత నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఎల్‌ఎండీ పోలీసులు తెలిపా రు. 27 తేదీ సాయంత్రం వరకు మాత్రం కారు అటువైపు రాలేదని తేలడంతో కారు ఏ సమయంలో పడిందనే విషయంపై స్పష్టత రాలేదు. 

కాల్‌డాటా వస్తే మరిన్ని విషయాలు...
సత్యనారాయణరెడ్డి కుటుంబ సభ్యుల సెల్‌ ఫోన్లకు సంబంధించి కాల్‌డేటా వివరాలు నేడు పోలీసులకు అందనున్నట్లు తెలిసింది. కాలే డేటా వస్తే వారు చివరి ఫోన్‌ ఎవరికి చేశారు. ఏం మాట్లాడారు.. ఎప్పుడు మాట్లాడారు. అనే విషయాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. కాల్‌ డేటా ఆధారంగా మరికొన్ని విషయాలు బయటపడే అవకాశాలున్నాయని పోలీసుల భావిస్తున్నారు.

సహస్ర కాదు వినయశ్రీ...
సత్యనారాయణరెడ్డి–రాధ దంపతులతోపాటు కూతురు వినయశ్రీ మృతి గురించి తెలియగానే బీడీఎస్‌ చదువుతున్న వినయశ్రీ స్నేహితులు బాధపడ్డారు. వినయశ్రీతోపాటు ఆమె తల్లిదండ్రుల ఫొటోలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అయితే వినయశ్రీ ఫొటోపై సహస్ర అని ఉండడంతో కొంతమంది సహస్ర అని భావించారు. అన్ని ధ్రువపత్రాల్లో మాత్రం వినయశ్రీగానే పేరు నమోదై ఉంది. బంధువులు కూడా వియశ్రీగానే రికార్డుల్లో ఉందని, పూర్తిపేరు అదే అని నిర్ధారించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement