పసికందు మృతి.. తల్లిదండ్రులపై అనుమానం..?

Infant Drowns In Water Tank At Nellore - Sakshi

సాక్షి, నెల్లూరు: ఓ బాలుడు అదృశ్యమయ్యాడు. బాధిత తల్లిదండ్రులు అతని కోసం గాలిస్తుండగా తొట్టెలో (ప్లాస్టిక్‌ డ్రమ్‌) మృతదేహమై కనిపించాడు. దీంతో వెంటనే అతడిని హాస్పిటల్‌కు తరలించగా వైద్యులు మృతిచెందాడని నిర్ధారించారు. మంగళ వారం మృతదేహాన్ని ఊరికి తీసుకెళ్లి పూడ్చిపెట్టేం దుకు యత్నించగా బంధువుల సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేసి కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరులోని సంతపేటకి చెందిన హుస్సేనీ అలియాస్‌ వైష్ణవికి నాలుగేళ్ల క్రితం వెంకటగిరి పట్టణం నాగులగుంటపాళేనికి చెందిన విజయకుమార్‌తో వివాహమైంది. విజయకుమార్‌ సెంట్రింగ్‌ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారికి రేవంత్‌కుమార్‌ (14 నెలలు) కుమారుడు ఉన్నాడు. వినాయకచవితి సందర్భంగా సుమారు 15 రోజుల క్రితం హుస్సేనీ తన కుమారుడితో కలిసి నెల్లూరులోని పుట్టింటికి వచ్చింది.

విజయకుమార్‌ ఈనెల రెండో తేదీన నెల్లూరుకు వచ్చాడు. అందరూ కలిసి పండగ చేసుకున్నారు. మంగళవారం హుస్సేనీ, విజయకుమార్‌లు వెంకటగిరికి వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి రేవంత్‌కుమార్‌ అదృశ్యమయ్యాడు. బాలుడు కనిపించకపోవడంతో బాధిత తల్లిదండ్రులు, బంధువులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల వెతికారు. ఈక్రమంలో ఇంటిపక్కనే ఉన్న నీటితొట్టె (ప్లాస్టిక్‌ డ్రమ్‌)లో బాలుడు తేలుతుండగా గుర్తించి వెంటనే కనికల హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. బాలుడ్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని నిర్ధారించడంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. బాధిత తల్లిదండ్రులు మంగళవారం తెల్లవారుజామున మృతదేహాన్ని వెంకటగిరి నాగులగుంటపల్లికి తీసుకెళ్లారు.

అక్కడ పూడ్చిపెట్టేందుకు యత్నించగా రేవంత్‌కుమార్‌ మృతి అనుమానాస్పదంగా ఉందని బంధువులు డయల్‌ 100కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. వెంకటగిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అంత్యక్రియలను అడ్డుకున్నారు. అనంతరం జరిగిన విషయాన్ని సంతపేట పోలీసులకు తెలియజేసి మృతదేహాన్ని నెల్లూరుకు పంపారు. సంతపేట ఎస్సై పి.వీరనారాయణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తొట్టిలో పడే అవకాశం తక్కువగా ఉండటం, మృతికి తల్లిదండ్రులు ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటుండటంతో అనుమానాస్పద మృతికింద కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు. బుధవారం ప్రభుత్వ వైద్యులు శవపరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top