బెగ్గర్స్‌ మాఫియా..

Hyderabad Beggars Arrested in Bopal Child Trafficking Case - Sakshi

భోపాల్‌లో సిటీ యాచకులు

సీడబ్ల్యూసీ అదుపులో 21 మంది మహిళలు  

వీరిలో హైదరాబాద్‌తో పాటు కాన్పూర్‌కు చెందిన వారు

44 మంది బాలబాలికలు రెస్క్యూ హోంలకు తరలింపు

చిన్నారుల అక్రమ రవాణా వ్యవహారంగా అనుమానం

దర్యాప్తు కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు

హైదరాబాద్‌కు చెందిన కొందరు మహిళలు మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో బెగ్గింగ్‌ పేరిట చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. వీరు అమాయకులైన చిన్నారులతో భిక్షాటన చేయిస్తూ డబ్బులు దండుకుంటున్నట్లు తేలింది. మరోవైపు చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భోపాల్‌లో అక్కడి చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ(సీడబ్ల్యూసీ)కి చెందిన అధికారులు చైల్డ్‌ లైన్‌ సహాయంతో దాడులు నిర్వహించి 21 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 44 మంది చిన్నారులను కాపాడారు. చిక్కిన మహిళల్లో హైదరాబాద్‌తో పాటు కాన్పూర్‌కు చెందిన వారూ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ బెగ్గింగ్‌ మాఫియా వెనుక చిన్నారుల కిడ్నాప్, అక్రమ రవాణా వంటి వ్యవహారాలు ఉండొచ్చనే అనుమానంతో ఆ మహిళలపై భోపాల్‌లోని బజ్రియ ఠాణాలో కేసులు నమోదు చేశారు. భిక్షాటన చేస్తూ చిక్కిన 21 మంది మహిళలను జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపిన అధికారులు చిన్నారులను పునరావాస కేంద్రాలకు తరలించారు. అనుమానాస్పదంగా ఉన్న ఈ మాఫియా వ్యవహారాలపై దర్యాప్తు చేసేందుకు మధ్యప్రదేశ్‌ సీఐడీ ఆధీనంలో ఓ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేసిన అధికారులు కాన్పూర్, హైదరాబాద్‌లో దర్యాప్తు చేపట్టారు. 

సాక్షి, సిటీబ్యూరో: మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో భారీ బెగ్గింగ్‌ మాఫియా వెలుగులోకి వచ్చింది. అక్కడి చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీకి (సీడబ్ల్యూసీ) చెందిన అధికారులు చైల్డ్‌ లైన్‌ సహాయంతో నగరంలో దాడులు నిర్వహించి 21 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద, ఇతర ప్రాంతాల్లోనూ భిక్షాటన చేస్తున్న 44 మంది చిన్నారులను కాపాడారు. సీడబ్ల్యూసీకి చిక్కిన మహిళల్లో హైదరాబాద్‌తో పాటు కాన్పూర్‌కు చెందిన వారూ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ బెగ్గింగ్‌ మాఫియా వెనుక చిన్నారుల కిడ్నాప్, అక్రమ రవాణా వంటి వ్యవహారాలు ఉండవచ్చుననే అనుమానంతో ఆ మహిళలపై భోపాల్‌లోని బజ్రియ ఠాణాలో కేసులు నమోదు చేశారు. భిక్షాటన చేస్తూ చిక్కిన 21 మంది మహిళలను జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపిన అధికారులు చిన్నారులను పునరావాస కేంద్రాలకు తరలించారు. అనుమానాస్పదంగా ఉన్న ఈ మాఫియా వ్యవహారాలపై దర్యాప్తు చేసేందుకు మధ్యప్రదేశ్‌ సీఐడీ ఆధీనంలో ఓ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేసిన అధికారులు కాన్పూర్‌తో పాటు హైదరాబాద్‌లోనూ దర్యాప్తు చేపట్టారు. 

బిచ్చగాళ్లు పెరిగిపోవడంతో...
భోపాల్‌లో నగరంలో ఇటీవల బిచ్చగాళ్ళ తాకిడి ఎక్కువైనట్లు అధికారులు గుర్తించారు. ప్రధానంగా మహిళా భిక్షగత్తెల చేతుల్లో చిన్నారులను గమనించిన అక్కడి సీడబ్ల్యూసీ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. దీంతో గత నెల మూడో వారంలో వరుస దాడులు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే 21 మంది మహిళలను అదుపులోకి తీసుకుని, 44 మంది చిన్నారులకు కాపాడారు. సదరు మహిళల వ్యవహార శైలి ఆద్యంతం అనుమానాస్పదంగా ఉండటంతో  సీడబ్ల్యూసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన అధికారులు వారి వ్యవహారశైలి భిన్నంగా ఉన్నట్లు గుర్తించారు. వీరిలో కొందరు బుర్ఖాలు ధరించి, చేతుల్లో లేదా వీల్‌చైర్‌పై చిన్నారులతో భిక్షాటన చేస్తుండగా పలకరిస్తే తెలుగులో మాట్లాడుతున్నారు. తాము ఓ వర్గానికి చెందిన వారమని చెబుతున్నప్పటికీ.. పేర్లు, మెడలో ధరించిన మంగళసూత్రాలు, కాళ్లకు ఉన్న మట్టెలు మరో వర్గానికి చెందిన వారిగా సూచిస్తుండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. 

అవసరం లేకపోయినా..
ఈ మహిళల్లో కొందరికి భిక్షాటన చేయాల్సిన అవసరం లేదని బజ్రియ అధికారులు గుర్తించారు. వీరిలో కొందరు  భర్తలతో వేరు పడగా, మరికొందరు దూరంగా ఉంటున్నప్పటికీ అప్పుడప్పుడూ కలుస్తూనే ఉన్నట్లు గుర్తించారు. వీరిలో కొందరి సంతానం అనేక మిషనరీ స్కూళ్లల్లో చదువుకుంటుండగా, మరికొందరు మహిళలు భిక్షాటనతోనే సొంతంగా ఇళ్లు సైతం సమకూర్చుకున్నట్లు వెల్లడైంది. ఓ మహిళకు హైదరాబాద్‌లో సొంత ఇల్లు ఉండగా, పిల్లలు హిమాయత్‌నగర్‌లోని ప్రముఖ మిషనరీ స్కూల్‌లో చదువుకుంటున్నట్లు తేలింది. రెస్క్యూ చేసిన చిన్నారుల్లో కొందరు ఇంగ్లిష్‌ సైతం మాట్లాడుతున్నట్లు పోలీçసులు పేర్కొన్నారు. వీరిలో ఓ మహిళ నగరంలోని ఓ స్కూల్‌లో వంట మనిషిగా పని చేస్తున్నట్లు తేలింది. సెలవుల్లో మాత్రం వివిధ నగరాలకు వెళ్లి బిక్షమెత్తుకుంటానని తెలిపింది. తమ వెంట ఉన్న చిన్నారులు తమ పిల్లలే అంటూ వారు చెబుతున్నా పోలీసులు మాత్రం నమ్మట్లేదు. అదే నిజమైనా సొంత పిల్లలతో భిక్షాటన చేయించడమూ నేరం అయినందున వీరిని రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి కొన్ని ఆధార్‌ కార్డులు స్వాధీనం చేసుకున్న పోలీసులు అవి అసలైనవా? కాదా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. 

రంగంలోకి దిగిన సీఐడీ సిట్‌...
ఈ బెగ్గింగ్‌ మాఫియా వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న మధ్యప్రదేశ్‌ పోలీసు విభాగం కేసును బజ్రియ పోలీస్‌ స్టేషన్‌ నుంచి సీఐడీకి బదిలీ చేసింది. కేసును భోపాల్‌తో పాటు కాన్పూర్, హైదరాబాద్‌ల్లోనూ దర్యాప్తు చేయాల్సి ఉండటంతో సిట్‌ ఏర్పాటు చేసింది. దీంతో రెండు ప్రత్యేక బృందాలు కాన్పూర్, హైదరాబాద్‌ చేరుకుని ఆరా తీస్తున్నాయి. రెస్క్యూ చేసిన చిన్నారుల్లో ఎవరైనా భిక్షాటన చేస్తున్న మహిళల పిల్లలే ఉన్నారా? అనే అంశాన్ని నిర్థారించడంపై దృష్టి సారించారు. ఇందుకుగాను వీరి సంబంధీకుల్ని సంప్రదించడంతో పాటు చిన్నారులు, మహిళలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు. అక్కడి కోర్టు అనుమతి వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. ప్రాథమికంగా ఈ కేసులో ఐపీసీలోని 363 (చిన్నారులను భిక్షాటనకు వినియోగించడం), 367 (చిన్నారులను కిడ్నాప్‌ చేయడం) సెక్షన్లతో పాటు జేజే యాక్ట్‌ లోని సెక్షన్‌ 76ను చేర్చారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాలు ఆధారంగా మరికొన్ని చేర్చడం, ఉన్న వాటితో మార్పులు చేయనున్నారు. హైదరాబాద్‌కు చేరుకున్న సిట్‌ బృందం వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నట్లు సమాచారం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top