‘మోజు తీరాకా నేనెవరో తెలీదంటున్నాడు’

Husband Dowry Harassment Case - Sakshi

అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధిస్తున్నారు

ప్రేమించి పెళ్లి చేసుకొని భర్త మోసం చేశాడని దివ్యాంగురాలి ఆవేదన 

న్యాయం చేయాలని వేడుకోలు 

సాక్షి, హైదరాబాద్‌: ప్రేమించి వివాహం చేసుకొని ఇప్పుడు వరకట్నం కోసం మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న తన భర్తపై చర్యలు తీసుకోవాలని రాజేంద్రనగర్‌ ప్రేమావతిపేటకు చెందిన వికలాంగురాలు లిల్లీకుమారి రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుద్వేల్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో లిల్లీకుమారి మాట్లాడుతూ.. ‘ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్‌ బేస్‌పై కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్నా, అదే కార్యాలయంలో సీహెచ్‌ శ్రీధర్‌ సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మా ఇద్దరికి 2010లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా స్నేహం నుంచి ప్రేమ వరకు దారి తీసింది.

2014వ సంవత్సరం ఏప్రిల్‌ 20వ తేదీన శంషాబాద్‌ మండలం సాతంరాయి వద్ద గల రామాలయం గుడిలో శ్రీధర్‌ నన్ను వివాహం చేసుకున్నాడు. అనంతరం బుద్వేల్‌తో పాటు రాజేంద్రనగర్, శివరాంపల్లిలలోని అద్దె గృహాల్లో కాపురం చేశాం. 18 నెలల పాటు తమ దాంపత్య జీవితం సాఫీగా సాగింది. అనంతరం శ్రీధర్‌ తల్లి సరోజ, తమ్ముడు డాక్టర్‌ రాజ్‌కుమార్, చెల్లెలు సునీత వచ్చి మా కాపురంలో చిచ్చుపెట్టారు’ అని లిల్లీకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. అనేక రకాలుగా వేధించారని, అదనపు కట్నం కోసం వేధించడంతో రూ. 7 లక్షల నగదు, ఆరు తులాల బంగారం, ద్విచక్ర వాహనాన్ని అందించామన్నారు.

అయినా కట్నం కోసం వేధించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆ సమయంలో రాజేంద్రనగర్‌ పోలీసులు కేసు పెట్టడంతో రాజీకి వచ్చి సరిగ్గా చూసుకుంటానని పెద్దలు, పోలీసుల సమక్షంలో తెలపడంతో కాపురానికి వెళ్లినట్లు తెలిపారు. ఇదే సమయంలో రూ.35 లక్షల రూపాయల కట్నంతో మరో వివాహం చేసుకునేందుకు తన భర్త శ్రీధర్‌ సిద్ధమయ్యాడని, ఈ విషయమై తాను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు తెలిపారు.

ఇప్పుడు మరోసారి వేరొక వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసిందని, విషయంలో పోలీసులు తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వికలాంగురాలినైన తనను పెళ్లి చేసుకొని మోజు తీరిన అనంతరం నీవు ఎవరో నాకు తెలియదని చెబుతున్నాడని వాపోయింది. ఈ విషయంలో పోలీసులు స్పందించి న్యాయం చేయాలని లేకపోతే తనకు ఆత్మహత్యే శరణమని వెల్లడించారు. ఈ విషయమై శ్రీధర్‌ను వివరణ కోరేందుకు వెళ్లగా ఆయన అందుబాటులోకి రాలేదు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top