బడికి వెళ్తూ మృత్యుఒడిలోకి..

Head Master Died in Bike Accident Srikakulam - Sakshi

నేలవాలిన విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న బైక్‌

ఆంపురం ప్రధానోపాధ్యాయుడు దుర్మరణం

మృతుడు మెళియాపుట్టి

పీఆర్‌టీయూ మండలశాఖ అధ్యక్షుడు

శ్రీకాకుళం, పాతపట్నం: మరి కొద్దిసేపట్లో పాఠశాలకు వెళ్లాల్సిన ఆ ప్రధానోపాధ్యాయుడిని విద్యుత్‌ స్తంభం రూపంలో మృత్యువు వెంటాడింది. పెథాయ్‌ తుఫాన్‌ గాలుల కారణంగా రోడ్డుకు అడ్డంగా నేలవాలిన స్తంభాన్ని గమనించక బైకుతో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం ఉమామహల్‌ వెనుకన ఉపాధ్యాయుల కాలనీలో నివాసముంటున్న పాగోటి ధర్మారావు(56) మెళియాపుట్టి మండలం ఆంపురం ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఎప్పట్లాగే మంగళవారం ఉదయం 8 గం టలకు భార్య పార్వతికి చెప్పి పాఠశాలకు బైకుపై బయలుదేరారు. కొండల ప్రాంతంలో ఉండే ఆంపురం పాఠశాలకు సిగ్నల్‌ సమస్య ఉండటం తో ప్రతిరోజూ అదే దారిలో ఉన్న బడ్డుమర్రి పాఠశాలలో బయోమెట్రిక్‌ వేసుకుని వెళ్తుంటారు. మంగళవారం కూడా అదే మాదిరిగా బడ్డుమర్రి పాఠశాలలో బయోమెట్రిక్‌ హాజరు వేసుకుని బైకుపై ఆంపురం పాఠశాలకు బయలుదేరారు. సోమవారం కురిసిన వర్షం, ఈదురుగాలుల ధాటికి ఆంపురం–తెంబూరు రోడ్డులోని జామిచిన్నయ్యపేట వద్ద విద్యుత్‌ స్తంభం వాలిపోయి రోడ్డుకు నాలుగున్నర అడుగు ఎత్తులో ఉండిపోయింది.

మంగళవారం ఉదయం కూడా వర్షం కురవడంతో ధర్మారావు రైన్‌ కోటు వేసుకుని బైకుపై వెళ్తుండగా విద్యుత్‌ స్తంభాన్ని గమనించక ఢీకొట్టారు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అంతకుముందే విద్యుత్‌ సిబ్బంది ఈ స్తంభాన్ని పరిశీలించి టిఫిన్‌ కోసం తెంబూరు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ప్రమా దం జరిగింది. స్థానికులు పోలీసులకు సమాచా రం అందించడంతో సీఐ బి.ఎస్‌.ఎస్‌.ప్రకాష్, ఎస్‌ ఐ ఈ.చిన్నంనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పాతపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, శవపంచనా మా అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యుల కు అందజేశారు. ఆస్పత్రి వద్దకు కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. ధర్మారావు స్వగ్రామం పాతపట్నం మండలం బడ్డుమర్రి పంచాయతీ కాశీపురం. మూడేళ్లుగా ఆంపురం పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్నారు. మెళియాపుట్టి పీఆర్‌టీయూ మం డలశాఖ అధ్యక్షునిగానూ కొనసాగుతున్నారు. కుమారుడు ఇంద్రసేనాకుమార్‌ అవనిగెడ్డలో డీఎస్సీ కోచింగ్‌ తీసుకుంటున్నాడు. కుమార్తె విజయవాడలో ఇంటర్మీడియట్‌ చదువుతోంది. ధర్మారావు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలి పారు. విషయం తెలుసుకున్న పాతపట్నం, మెళి యాపుట్టి మండల ఎంఈఓలు బి.సింహాచలం, ఎస్‌.దేవేంద్రరావు, పాతపట్నం పీఆర్‌టీయూ మండలశాఖ అధ్యక్షుడు ఎ.జనార్దనరావు, అంబేడ్కర్‌ మండల యువజన సంఘం అధ్యక్షుడు సుదర్శన్, పలువురు ఉపాధ్యాయులు ఆస్పత్రికి చేరుకున్నారు.

పీఆర్‌టీయూ నాయకుల సంతాపం   
శ్రీకాకుళం: మెళియాపుట్టి మండలంలో ఎల్‌ఎఫ్‌ ఎల్‌ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న పాగోటి ధర్మారావు మంగళవారం జరిగిన ప్రమాదంలో మరణించడంతో పీఆర్‌టీయూ నాయకులు ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ధర్మారావు విశేష కృషి చేశారని పేర్కొన్నారు. సంతాపం తెలిపిన వారిలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు భైరి అప్పారావు, జిల్లా అధ్యక్షుడు పప్పల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి పి.రవికుమార్, గౌరవాధ్యక్షుడు వి.హరిశ్చంద్రుడు, అసోసియేట్‌ అధ్యక్షుడు వైబీఎస్‌ ప్రసాదరావు, పత్రికా సంపాదక వర్గ సభ్యులు జి.యోగానంద్, ఎల్‌ఎఫ్‌ఎల్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బలివాడ ధనుంజయరావు, బొంగు సత్యనారాయణ, ఎస్‌.ప్రసాదరావు, ఇ.గణపతి, జె.భరత్‌చరణ్‌ తదితరులు ఉన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top