స్కెచ్‌ ఫ్రమ్‌ సిటీ | Sakshi
Sakshi News home page

స్కెచ్‌ ఫ్రమ్‌ సిటీ

Published Mon, Jun 18 2018 10:39 AM

Gangster Sampath Nehra Case Reveals hyderabad Police - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: మియాపూర్‌ ఠాణా పరిధిలోని గోకుల్‌ ఫ్లాట్స్‌లో హర్యానా స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు ఈ నెల తొలి వారంలో చిక్కిన మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ సంపత్‌ నెహ్రా వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో అనేక మందిని బెదిరించి డబ్బు దండుకున్న నెహ్రా.. బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌నూ విడిచిపెట్టని విషయం విదితమే. అక్కడి పోలీసుల నిఘా తప్పించుకోవడానికి నగరంలో తలదాచుకున్న నెహ్రా... ఇక్కడి నుంచే తన దందాలు యథేచ్ఛగా కొనసాగించాడు. చండీగఢ్‌లోని తన ఐదుగురు ప్రధాన అనుచరుల ద్వారా అనేక నేరాలు చేయించాడు. వాట్సప్‌ ద్వారా వీరికి ఆదేశాలు జారీ చేస్తూ ‘పనుల’కు పురమాయించాడు. ఈ ఐదుగురినీ అక్కడి మొహాలీ పోలీసులు గత వారం పట్టుకున్నారు. వీరిలో ఆర్మీలో నాయక్‌ హోదాలో పని చేస్తున్న వ్యక్తి కూడా ఉండటం గమనార్హం. అవసరమైతే బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ను హత్య చేయాలంటూ ఇతడికి టాస్క్‌ అప్పగించినట్లు తెలిసింది. 

ఆ రెండు ప్రాంతాల్లోనే...
సంపత్‌ ప్రధానంగా చండీగఢ్‌లోని మొహాలీ, పంచకుల ప్రాంతాల్లోనే తన దందాలు కొనసాగించాడు. అక్కడి వివిధ ప్రాంతాలకు చెందిన రామ్‌దీప్‌ సింగ్, శుభ్‌నవ్‌దీప్‌ సింగ్, జస్పీత్‌ సింగ్, గుర్వీందర్‌ సింగ్‌లను తన ప్రధాన అనుచరులుగ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రాంతాల్లో వ్యవహారాలన్నీ వీరి ద్వారానే చేయించేవాడు. రాజస్థాన్‌లోని చురు జిల్లాకు చెందిన దినేష్‌కుమార్‌ ఆర్మీలోని సిగ్నల్‌ కారŠప్స్‌ విభాగంలో నాయక్‌గా పని చేస్తున్నాడు. ఇతడినీ తన అనుచరుడిగా మార్చుకున్న సంపత్‌.. ప్రత్యేక టాస్క్‌ల కోసం మాత్రమే రంగంలోకి దింపేవాడు. సిటీలో ఇద్దరు ఎంబీఏ విద్యార్థులతో కలిసి లోప్రొఫైల్‌ జీవితం గడిపిన సంపత్‌.. నిత్యం చాటింగ్స్, కాల్స్‌తో బిజీగా ఉండేవాడు. వీటి ద్వారానే అనుచరులకు అవసరమైన ఆదేశాలు జారీ చేసేవాడు. మొహాలీ, పంచకుల ప్రాంతాల్లో బెదిరింపులు, దోపిడీలు, బందిపోటు దొంగతనాలతో పాటు కిడ్నాప్స్‌ సైతం చేయించాడు. దీనికోసం నలుగురు అనుచరులకూ రెండు .315 రివాల్వర్లు, .32 పిస్టల్, తూటాలతో పాటు కత్తులు, కారు సమకూర్చాడు. మొహాలీకి చెందిన వరీంద్రకుమార్‌ అనే యువకుడిని కిడ్నాప్‌ చేయించి భారీగా వసూలు చేశాడు. సొహాన ప్రాంతంలో ఓ కారుతో పాటు భారీ నగదు దోచుకున్నారు. సిటీలో సంపత్‌ను పట్టుకున్న తర్వాత మొహాలీ పోలీసులు రామ్‌దీప్‌ సింగ్, శుభ్‌నవ్‌దీప్‌ సింగ్, జస్పీత్‌ సింగ్, గుర్వీందర్‌ సింగ్‌లతో పాటు దినేష్‌ కుమార్‌నూ అరెస్టు చేశారు.

సెలవుపై వచ్చి ‘డ్యూటీ’...  
నాయక్‌ దినేష్‌ ప్రస్తుతం రాజస్థాన్‌లోని జైపూర్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. తన గ్యాంగ్‌లో కీలక సభ్యుడిగా ఉన్న ఇతడిని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే సంపత్‌ వాడేవాడు. ఇతడి నుంచి వర్తమానం అందిన ప్రతిసారీ సెలవు పెట్టుకుని వచ్చే దినేష్‌ తనకు అప్పగించిన ‘పని’ పూర్తి చేసుకుని తిరిగి వెళ్లేవాడు. అయితే ప్రస్తుతం తాను పూర్తి అజ్ఞాతంలో ఉండటంతో దినేష్‌ను రావాల్సిందిగా సంపత్‌ సూచించాడు. దీంతో ఏప్రిల్‌లో నెల రోజుల సెలవుపై ఇతగాడు మొహాలీ చేరుకొని మిగిలిన నలుగురు గ్యాంగ్‌ మెంబర్స్‌తో కలిసి ఉంటున్నాడు. సెలవు పూర్తయినప్పటికీ తిరిగి వెళ్లకుండా అక్కడే ఉండిపోయాడంటే సంపత్‌ పెద్ద టాస్క్‌నే ఇతడికి అప్పగించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘరానా గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ అనుచరుడిగా పని చేసిన సంపత్‌ అతడి ఆదేశాల మేరకు బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ను  టార్గెట్‌ చేశాడు. ఆయన నుంచి అందినకాడికి దండుకోవాలనే ఉద్దేశంతో సోషల్‌మీడియా ద్వారా తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగాడు. కృష్ణ జింకల్ని వేటాడిన కేసు విచారణకు హాజరైనప్పుడు జోధ్‌పూర్‌ కోర్టు ప్రాంగణంలోనే హతమారుస్తానంటూ సల్మాన్‌కు గతేడాది వార్నింగ్‌ ఇచ్చాడు. దీన్ని పరిగణలోకి తీసుకున్న జోధ్‌పూర్‌ పోలీసులు సల్మాన్‌ హాజరైనప్పుడల్లా కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసేవారు. అవసరమైతే సల్మాన్‌ ‘పని’ చేయాల్సిందిగా సంపత్‌ నుంచి దినేష్‌కు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని మొహాలీ పోలీసులు చెప్తున్నారు. తొమ్మిదేళ్లుగా ఆర్మీలో పనిచేస్తున్న దినేష్‌ ఏఏ నేరాలు చేశాడనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement
Advertisement