భయమే ప్రాణాలు తీసింది | friends missing in krishna river | Sakshi
Sakshi News home page

భయమే ప్రాణాలు తీసింది

Nov 27 2017 7:50 AM | Updated on Apr 3 2019 7:53 PM

friends missing in krishna river - Sakshi - Sakshi

సాక్షి, గద్వాల/  గద్వాల క్రైం: ఆ యువకుడు ఇంట్లో కళాశాలకు వెళ్తున్నానని చెప్పి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. అలా వచ్చి తన  మామ కూతురుకు ఫోన్‌ చేసి ఆమెను సైతం వెంట తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి రేకులపల్లి వద్ద కృష్ణానది అందాలను తిలకించేందుకు వచ్చారు. సంతోషంగా నదీ పరిసరా ప్రాంతాల్లో కలియతిరిగారు. అనంతరం నదిలోకి వెళ్లి సరదాగా గడిపారు. చీకటి పడుతుండటంతో ఇంటికి వెళ్లాలనే ఆత్రుతతో నదిని దాటే ప్రయత్నం చేస్తూ.. ఇద్దరూ నీటి ఉధృతికి గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో ఓ యువకుడు, యువతి తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఈ సంఘటన మండలంలోని రేకులపల్లి వద్ద కృష్ణానదిలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం..

ద్విచక్రవాహనంపై వచ్చి..
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని కటికవీధికి చెందిన మహ్మద్‌ రఫి, మునీరభాను కూమారుడు వారిస్‌(19) ఎర్రకోటలోని సెయింట్‌ జోసెఫ్‌ కళాశాలలో బీఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం కళాశాలకు వెళ్తున్నానని చెప్పి ద్విచక్రవాహనంపై గద్వాలకు వచ్చాడు. గద్వాలోని కుంటవీధికి చెందిన వారిస్‌ మామ జాఫర్‌బాయి కూతురు సనా జబీన్‌(17)కు ఫోన్‌ చేసి పిలిపించుకున్నాడు. ఇద్దరూ కలిసి ద్విచక్రవాహనంపై మధ్యాహ్నం రేకులపల్లి వద్ద ఉన్న కృష్ణానది, లోయర్‌ జూరాల పరిసరా ప్రాంతాల్లో తిరిగారు. చీకటి పడుతుండటంతో ఇంటికి చేరుకోవాలని నది పరిసరాల నుంచి బయటకు వస్తున్నారు. అయితే నదిలో మధ్యాహ్నం నుంచే నీటి ఉధృతి క్రమంగా పెరిగింది.

కన్నీటి పర్యంతం..
కళాశాలకు వెళ్తున్నానని యువకుడు, ఫ్రెండ్‌ ఇంటికి వెళ్లొస్తానని వెళ్లిన యు వతి.. ఇద్దరూ తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో వారి తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. గల్లంతైన వారి మృతదేహలు లభ్యం కావడంతో అక్కడికి చేరుకుని బోరున విలపించారు. సమాచారం తెలుసుకున్న గద్వాల ము న్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ శంకర్, కాంగ్రెస్‌ నా యకులు రామాంజనేయులు, బాబర్‌ తదితరులు కుంటుంబ సభ్యులను ఓదార్చారు.

పడవ తెచ్చేలోపు..
వీరిద్దరిని గమనించిన గ్రామస్తుడు భీంరెడ్డి అక్కడికి చేరుకుని వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువస్తానని చెప్పి పడవ తెచ్చేందుకు వెళ్లాడు. అయితే తమ గురించి ఇంట్లో తెలిస్తే ప్రమాదమని భయాందోళనకు గురైన వారు అతను రాకముందే నదీలో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూ.. నీటి ఉధృతికి ఇద్దరూ  గల్లంతయ్యారు. వెంటనే భీంరెడ్డి గ్రామస్తులకు సమాచారం అందించగా.. అందరూ కలిసి గాలించినా ఫలితం లేకపోయింది. అనంతరం రూరల్‌ ఎస్‌ అంజద్‌అలీకి సమాచారం అందించగా ఆయన సిబ్బందితో వచ్చి గజఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు చీకటి పడటంతో గజఈతగాళ్లు సైతం వెనుదిరిగారు. ఆదివారం ఉదయం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా.. 10 గంటల సమయంలో వారిస్‌ మృతదేహం వలకు చిక్కింది. 12 గంటల సమయంలో సనా జబీన్‌ సైతం మృతదేహం లభ్యమైంది. వెలికితీసిన మృతదేహలను గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement