
క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌కు వైద్యం అందిస్తున్న డాక్టర్
చింతూరు (రంపచోడవరం) : ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఓ లారీడ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుని ఐదు గంటలపాటు నరకం అనుభవించాడు. మండలంలోని కాటుకపల్లి వద్ద ఆదివారం ఛత్తీస్‌గఢ్ నుండి విజయవాడ వెళ్తున్న లారీ విజయవాడ నుంచి ఛత్తీస్‌గఢ్ వెళుతున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ఈ ఘటనలో ఓ లారీ డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి. దీంతో అతడికి ఏడుగురాళ్లపల్లి ఆసుపత్రిలో చికిత్స నిర్వహించిన అనంతరం భద్రాచలం తరలించారు. కాగా మరో లారీలోని డ్రైవర్ తెలంగాణ రాష్ట్రం నల్గొండకు చెందిన లతీఫ్ క్యాబిన్‌లో ఇరుక్కుని పోయాడు.
స్టీరింగ్ వీల్ వద్ద కాలు ఇరుక్కుని ఎంతకూ రాకపోవడంతో వైద్యులు అతడికి లారీలోనే సిలైన్లు పెట్టి చికిత్స అందించారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రమాదం జరుగగా పోలీసులు తీవ్రంగా శ్రమించి ఐదు గంటల అనంతరం గ్యాస్‌కట్టర్ సాయంతో రాత్రి ఎనిమిది గంటలకు అతనిని బయటకు తీశారు. అనంతరం 108 ద్వారా అతడిని భద్రాచలం ఆసుపత్రికి తరలించారు.