గొరుసువానిపాలెంలో భారీ అగ్నిప్రమాదం | Sakshi
Sakshi News home page

గొరుసువానిపాలెంలో భారీ అగ్నిప్రమాదం

Published Thu, Jan 17 2019 6:39 AM

Fire Accident in Waste Cloth Gowdown Visakhapatnam - Sakshi

విశాఖపట్నం, పరవాడ (పెందుర్తి): వాడచీపురుపల్లి శివారు గొరుసువానిపాలెం గ్రామ సమీపంలో గల వేస్టు క్లాత్‌ గొడౌన్‌లో మంగళవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో లక్షలాది రూపాయల విలువైన వేస్టు క్లాత్‌ నిల్వలు కాలి బూడిదయ్యాయి. సంక్రాంతి రోజు కావడంతో కార్మికులు గొడౌన్‌లో పనిచేయడానికి రాకపోవడంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. మంగళవారం సాయంత్రం ఉన్నట్టుండీ ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగసిపడిన అగ్నికీలలు పండగ సంబరాల్లో మునిగి ఉన్న గ్రామీణ ప్రజలను భయాందోళనలకు గురిచేశాయి. అగ్ని ప్రమాదంతో ఎగిసిపడిన మంటల వల్ల ఆ ప్రదేశమంతా  దట్టమైన పొగలు కమ్ముకొన్నాయి. అగ్నిప్రమాదంపై స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోల్‌కతా ప్రాంతానికి చెందిన అమర్, ప్రశాంత్‌ అనే వ్యక్తులు మూడేళ్ల క్రితం గొరుసువానిపాలెం గ్రామ సమీపంలోని ఓ లే అవుట్‌లో కొంత స్థలాన్ని అద్దెకు తీసుకొని వేస్టు క్లాత్‌ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఎస్‌ఈజెడ్‌లోని బ్రాండెక్స్‌ పరిశ్రమ నుంచి వేస్టు క్లాత్‌ను టన్నుల లెక్కన కొనుగోలు చేసి ఇక్కడి గొడౌన్‌లో కూలీలతో క్లాత్‌ల రంగులను బట్టి వేరు చేయించి చెన్నై, హైదరాబాద్, తిరువూర్‌ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేసి విక్రయిస్తుంటారు.

బూడిద చేసిన షార్ట్‌ సర్క్యూట్‌
గత మూడు నెలల నుంచి వేరు చేసిన వేస్టు క్లాత్‌ నిల్వలను త్వరలో ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉంచగా అగ్నికి ఆహుతయ్యాయి. మంగళవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో గొడౌన్‌ మీదుగా ఏర్పాటు చేసిన 11 కేవీ విద్యుత్‌ లైన్‌లో సంభవించిన షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల నిప్పు రవ్వలు వేస్టు క్లాత్‌ నిల్వలపై పడడంతో ఒక్క సారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మంటలకు గాలి తోడు కావడంతో మరింత ఎగసిపడి షెడ్లలోని టన్నులకొద్దీ వేస్టు క్లాత్‌ నిల్వ బస్తాలన్నీ కాలిబూడిదయ్యాయి. రేకుల షెడ్లు కూడా కాలిపోయాయి. రైతులకు చెందిన సరుగుడు, యూకలిప్టస్‌ తోటలకు మంటలు వ్యాపించడంతో నష్టం జరిగింది.

సంక్రాంతి పండుగ కావడంతో కార్మికులకు సెలవు ప్రకటించడం వల్ల వారు విధులకు రాకపోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాద సమాచారాన్ని తెలుసుకొన్న ఎన్టీపీసీ, ఫార్మాసిటీ, అనకాపల్లి అగ్నిమాపక కేంద్రాల సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అర్ధరాత్రి 3 గంటల వరకు సింహాద్రి ఎన్టీపీసీ అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను పూర్తిస్థాయిలో అదుపు చేశారు. అగ్ని ప్రమాదం వల్ల తెగిపడిన విద్యుత్‌ వైర్ల కారణంగా పరిసర గ్రామాల ప్రజలకు తెల్లవారుజాము 3 గంటల వరకు విద్యుత్‌ సరఫరా లేక అంధకారంలో గడపవలసి వచ్చింది. గొడౌన్‌లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల తమ ఉపాదికి గండిపడిందని గొరుసువానిపాలెం, పందివానిపాలెం, పోలిరెడ్డిపాలెం, వాడచీపురుపల్లి, పరవాడ, ఊటగెడ్డపాలెం గ్రామాలకు చెందిన మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అనధికారికంగా నిర్వహిస్తున్న ఈ గొడౌన్‌కు అగ్నిమాపక శాఖ, పంచాయతీ నుంచి అనుమతులు తీసుకోలేదని తెలిసింది. పరవాడ పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. 

Advertisement
Advertisement