మరో పెళ్లికి అడ్డువస్తున్నాడని.. హత్య చేశాడు

Father Murdred His Son Because Of Interrupting To Another Marriage - Sakshi

సాక్షి, తుంగతుర్తి : అనుమాన్పాద స్థితిలో మృతిచెందిన నాలుగేళ్ల బాలుడిది హత్యేనని పోలీసుల విచారణలో వెల్లడైంది. భార్యపై కోపం, వివాహానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే తండ్రే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని పోలీసులు తేల్చారు. శనివారం నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టి  సీఐ క్యాస్ట్రో కేసు వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం జాజిరెడ్డిగూడేనికి చెందిన చింతల కనకయ్యకు ఇప్పటికే రెండు సార్లు వివాహం జరిగింది. మూడో వివాహం చేసుకోవడానికి కుమారుడు అడ్డుగా ఉన్నాడన్న కారణంలో ఈ దారుణానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం చౌళ్లరామారం గ్రామానికి చెందిన ఓ యువతితో కనకయ్యకు మొదట వివాహం జరిగింది. కుటుంబ గొడవల కారణంగా వివాహం జరిగిన ఆరు నెలలకే కనకయ్యతో విడాకులు తీసుకుంది.

ఈ నేపథ్యంలో బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లిన కనకయ్య హైదరాబాద్‌లోని దమ్మాయిగూడలో ఉంటూ రోజువారి కూలిపనులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో జనగాంకు చెందిన స్వప్నతో  పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో కులాంతర వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం కనకయ్య–స్వప్న దంపతులకు కుమార్తె, కుమారుడు అక్షయ్‌(4) ఉన్నారు. కొంతకాలంగా వీరు హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌ సమీపంలోని అంబేద్కర్‌నగర్‌లో నివాసం ఉంటూ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కొంతకాలంగా ఇద్దరి మధ్య కుటుంబ గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు అధికం కావడంతో కొన్ని రోజులుగా భార్యభర్తలు దూరంగా ఉంటున్నారు.

నెలన్నర క్రితం కనకయ్య బిడ్డను తల్లి దగ్గరే ఉంచి కొడుకు అక్షయ్‌ను తీసుకొని తిరుమలరాయినిగూడెంలో ఉంటున్న పెదనాన్న చింతల రాములు ఇంటికి వచ్చి అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి భోజనం అనంతరం కనకయ్య అక్షయ్‌ను తనవద్దనే పడుకోబెట్టుకున్నాడు. రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో కన్నకొడుకు అక్షయ్‌ను మెడలు విరిచి హత్య చేశాడు. అనంతరం ఇంటిముందు మంచంలో కొడుకు మృతదేహాన్ని ఉంచి గుట్టు చప్పుడు కాకుండా పరారయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున నిద్రలేచిన చింతల రాములు కుటుంబీకులు మంచంలో నిర్జీవంగా పడి ఉన్న అక్షయ్‌ను దగ్గరకు వెళ్లి చూడగా అప్పటికే మృతి చింది ఉండడంతో పోలీసులకు సమాచారమందించారు.

భార్య దూరం కావడంతో మరో పెళ్లికి యత్నిస్తూ...
ఆదినుంచి గొడవలు పడుతూ సైకో మనస్తత్వం కలిగిన కనకయ్యకు మొదటి భార్య విడాకులు తీసుకుని వెళ్లిపోవడం, రెండవ భార్య ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత కుటుంబ గొడవలతో దూరంగా ఉండటంతో మూడవ పెళ్లి చేసుకునేందుకు కనకయ్య సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో మూడవ పెళ్లి చేసుకునేందుకు కుమారుడు అక్షయ్‌ తండ్రి వద్దనే ఉండటంతో పెళ్లికి అడ్డుగా మారాడు. దీంతో అక్షయ్‌ ఉంటే తనకు మరో పెళ్లి కాదని భావించిన కనకయ్య, పథకం ప్రకారమే అర్ధరాత్రి సమయంలో అక్షయ్‌ మెడలు విరిచి హత్య చేసినట్లు విచారణలో అంగీకరించినట్లు సీఐ తెలిపారు.

కన్నకొడుకును హత్య చేసి పారిపోతున్న కనకయ్యను స్థానికుల సమాచారంతో పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు కనకయ్యపై ఐపీసీ–302 సెక్షన్‌ కింద హత్యానేరం కేసును నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడిని నకిరేకల్‌లోని జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరచగా ఇంచార్జి మెజిస్ట్రేట్‌ కె.రాణి ఆదేశానుసారం  కనకయ్యను రిమాండు నిమిత్తం నల్లగొండ జిల్లా జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top