ఏం కష్టమొచ్చిందో.. కుమార్తె పుట్టినరోజు నాడే..!

family committed suicide - Sakshi

రైలు కిందపడి భార్యా పిల్లలు మృతి

ఆ వార్తవిని ఆత్మహత్య చేసుకున్న భర్త

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

రామకూరులో అలముకున్న విషాదం

కుమార్తె పుట్టిన రోజును ఎంతో సంతోషంగా జరుపుకోవాలనుకున్నారు ఆ తల్లిదండ్రులు. కొత్త బట్టలు కొనాలనుకున్నారు. ఉదయాన్నే పిల్లల్ని రెడీ చేసి స్కూలుకు పంపించారు. అంతలోనే ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు బిడ్డలతో కలసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. స్కూలుకు వెళ్లిన పిల్లల్ని వెంట తీసుకొచ్చి మరీ ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ముందుగా భర్తకు ఫోన్‌చేసి సమాచారం ఇచ్చింది. ఇది విన్న ఆ భర్త తానూ పురుగుమందు తాగి ప్రాణాలు విడిచాడు. సోమవారం జరిగిన ఈ హృదయ విదారక ఘటన జె.పంగులూరు మండలం రామకూరులో తీవ్ర విషాదం నింపింది. 

సాక్షి, జె.పంగులూరు:  మండలం రామకూరు గ్రామానికి చెందిన పెనుబోతు సోమశేఖర్‌ (40)కు తొమ్మిదేళ్ల క్రితం గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని అప్పాపురం గ్రామానికి చెందిన విజయలక్ష్మి (32)తో వివాహం జరిగింది. వ్యవసాయం చేసుకుంటూ జీవించే ఈ దంపతులకు కుమార్తె దిగ్విజయ (7), కుమారుడు గణేశ్‌సాయి (4) ఉన్నారు. సోమవారం దిగ్విజయ పుట్టినరోజు కావడంతో   కొత్త బట్టలు తెచ్చేందుకు తండ్రి వద్ద డబ్బులు తెచ్చి భార్యకు ఇచ్చాడు సోమశేఖర్‌. ఉదయం పిల్లలిద్దరీనీ మార్టూరులోని ప్రైవేటు పాఠశాలకు పంపారు. అనంతరం సోమశేఖర్‌ మాగాణికి నీరు పెట్టడానికి వెళ్లాడు. విజయలక్ష్మి మధ్యాహ్నం పిల్లలు చదువుతున్న స్కూలుకు వెళ్లింది. వారితో కలిసి భోజనం చేసింది. పిల్లలను తాను తీసుకువెళ్తున్నట్లుగా రిజిస్టర్‌లో సంతకం పెట్టి వారిని నరసరావుపేటకు తీసుకెళ్లింది. అక్కడో స్టూడియోలో పిల్లలతో కలసి ఫొటో తీయించుకుంది. ఆ ఫొటో వెనుక ముగ్గురి పేర్లతోపాటు అడ్రస్‌ రాసి హ్యాండ్‌ బ్యాగ్‌లో పెటుకున్న ఆమె పిల్లలను ఇద్దరినీ తీసుకుని ట్రైన్‌ వచ్చే సమాయానికి పట్టాలపైకి వెళ్లి, కుమార్తె దిగ్విజయ కాలిని తన కాలికి కలిపి కట్టేసుకుని, కుమారుడు గణేశ్‌సాయిని ఎత్తుకుంది. అదే సమయంలో భర్తకు ఫోన్‌ చేసి తాను పిల్లలు రైలు పట్టాలపైకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా చెప్పింది. 

భార్యాపిల్లలు ఇక లేరని..
ఈ విషయం తెలుసుకున్న సోమశేఖర్‌ తన తండ్రి వద్ద రూ.200 తీసుకుని వలపర్లకు వెళ్లి, పురుగుల మందు కొనుగోలు చేశాడు. అక్కడికి సమీపంలోని నూలు మిల్లులోనికి వెళ్లి తాగి, కేకలు వేశాడు. అది విన్న స్థానికులు అతన్ని చిలకలూరిపేట ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి, మృతి చెందినట్లు చెప్పారు. ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు తెలియరాలేదు. సోమశేఖర్‌ మృతదేహం సోమవారం రాత్రి ఇంటికి చేరింది. భార్య పిల్లల మృతదేహాలు మంగళవారం గ్రామానికి చేరే అవకాశం ఉంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒకే రోజు మృతి చెందడంతో రామకూరులో విషాదం అలముకుంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్దసంఖ్యలో బాధితుల ఇంటి వద్దకు చేరుకున్నారు. 
 
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top