తిరుమలలో నకిలీ టికెట్ల దళారీ అరెస్టు

Duplicate ticket broker arrested in Tirumala - Sakshi

నిఘా పెట్టి పట్టుకున్న విజిలెన్స్‌ అధికారులు  

తిరుమల : టీటీడీ ఆన్‌లైన్‌లో రిలీజ్‌ చేసే శ్రీవారి సేవల టికెట్లను అధిక ధరకు విక్రయిస్తున్న దళారీని టీటీడీ విజిలెన్స్‌ వింగ్‌ ఏవీఎస్‌వో రామ్‌కిశోర్‌ శుక్రవారం అరెస్టు చేశారు. విలేకరులకు ఆయన వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర సోలాపూర్‌కు చెందిన ప్రభాకర్‌ (30) ఆన్‌లైన్‌ షాపు నిర్వహిస్తున్నాడు. షాపునకు వచ్చిన వారి ఆధార్‌ కార్డుల జిరాక్సులను వారికి తెలియకుండానే తన వద్ద ఉంచుకునేవాడు. నెలలో మొదటి శుక్రవారం టీటీడీ ఆన్‌లైన్‌లో సుప్రభాతం, నిజపాద దర్శనం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన తదితర సేవలను విడుదల చేస్తుంది.

ఆ సమయంలో అతను సుమారు 1,000 సేవలకు డిప్‌ వేసేవాడు. ఇందుకోసం 600 నుంచి 700 వరకు నకిలీ మెయిల్స్‌ను, కస్టమర్ల వద్ద తీసుకున్న ఆధార్‌ కార్డులను వినియోగించేవాడు. అతనికి సుమారు 100 నుంచి 150 వరకు టికెట్లు లక్కీడిప్‌లో మంజూరయ్యేవి. వాటిని తన వద్దకు వచ్చిన వారికి రూ.250 టికెట్‌ను రూ.1,250కు విక్రయించేవాడు. వారికి ఆ టికెట్‌ ఎవరి పేరుతో ఉందో ఆ పేరు, ఫొటో మార్ఫింగ్‌ చేసి నకిలీ ఆధార్‌ను సృష్టించి శ్రీవారి దర్శనానికి పంపేవాడు. దీనిపై విజిలెన్స్‌ అధికారులు రెండు నెలలపాటు నిఘా పెట్టారు. శుక్రవారం తెల్లవారుజామున కొందరు సుప్రభాతం నకిలీ టికెట్లతో దర్శనానికి వెళుతుండగా గుర్తించారు. విచారణలో తేలిన వివరాల మేరకు నకిలీ టికెట్లు తయారు చేసే ప్రభాకర్‌ను విజిలెన్స్‌ వింగ్‌ ఏవీఎస్‌వో, వీఐ లక్ష్మీకాంత్, సిబ్బంది ప్రకాష్‌ అదుపులోకి తీసుకుని వన్‌టౌన్‌ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top