
హైదరాబాద్: ఆర్‌ఐగా పదోన్నతి పొందిన ఆనందంలో ఓ ఏఆర్ ఎస్‌ఐ మిఠాయిలు పంచుతూ గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించేలోపు ఆయన మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన బుధవారం హైదరాబాద్ అంబర్‌పేటలోని సీపీఎల్‌లో చోటుచేసుకుంది. గోల్నాక తిరుమలనగర్‌లో నివసించే శ్యామ్‌రావు(55) సీపీఎల్‌లో ఏఆర్ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు.
మంగళవారం ఆయన ఆర్‌ఐగా పదోన్నతి పొందారు. ఆనందంతో బుధవారం మిఠాయిలు తీసుకొని కార్యాలయానికి వచ్చారు. అధికారులకు, సిబ్బందికి మిఠాయిలు పంచుతూ కుప్పకూలారు. వెంటనే ఆయనను యశోద హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందారని వైద్యులు తెలిపారు. శ్యామ్‌రావుకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.